పాత ప్రతీకార సినిమాను తలపించిన నాని ‘వి’

సహజ నటుడిగా పేరున్న నాని తాజా చిత్రం ‘వి’ రెండు రోజుల క్రితమే అమేజాన్ ప్రైమ్ లో విడుదలయింది. కరోనా పుణ్యాన కొత్త చిత్రాలను ఓటిటి ప్లాట్‌ఫారమ్ మీద విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా బాగోలేదని చాలామంది చెప్పారు. రివ్యూలు రాశారు. అయినా ఒకసారైనా చూడాలి కదా..! అందులోనూ థియేటర్ కు వెళ్లాల్సిన పనిలేదు. టికెట్లు దొరకవన్న బెంగలేదు. పెద్ద తెరమీద చూడలేదనేగానీ… విడుదలైన సినిమా ఇంట్లోనే చూడటం బాగానే ఉంది.

చాలామంది చెప్పినట్లు వి‌‌ సినిమా అంత తీసిపారేయాల్సినదేమీ కాదు. బ్రహ్మాండం, అద్భతం అ‌నలేంగానీ…బాగానే ఉంది. నాని సునాయాసంగా నటించారు. అందరూ నెగటివ్ టచ్ ఉన్న పాత్రగా చెబుతు న్నారుగానీ…నెగటివ్ క్యారెక్టర్ ఏమీ కాదు.

తన తల్లిదండ్రులను చంపిన విలన్ గ్యాంగును వేటాడి వెంటాడి‌ చంపి, ప్రతీకారం తీర్చుకునే కథానాయకుడి కథలు అనేకం వచ్చాయి. ఒకర్ని చంపడం, తరువాత ఎవర్ని చంపబోతున్నదీ ఒక క్లూ వంటిది ఆ శవం వద్దే విడిచిపెట్డడం, పట్టుకోమని పోలీసులకు సవాలు విసరడం, ఒకొక్కర్నీ ఒక్కోరీతిలో చంపడం…ఇలాంటి కథలు చాలానే చూసుంటాం. నాని వి కూడా అటువంటి సినిమానే.

గర్భంతో ఉన్న తన భార్యను చంపిన, ఆమె మరణానికి కారణమైన వారిని ఒకొక్కరినే చంపడమే లక్ష్యంగా తిరుగుతుంటాడు సైనికుడైన విష్ణు (నాని). హీరో కాబట్టి సులభంగానే అందర్నీ హతమార్చుతాడు. ఒకొక్కర్నీ చంపుతుంటే…నిందితున్ని పట్టుకోడానికి పోలీసు అధికారి సుధీర్ బాబు ప్రయత్నిస్తుంటాడు. అసలు సైనికుడిగా ఉన్న వ్యక్తి… ఇలా హత్యలు ఎందుకు చేస్తాడనేది…సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ, మెలమెల్లగా చెబుతాడు డైరెక్టర్. ఏదేమైనా ఇటువంటి ప్రతీకార కథ చూసే అవకాశం మళ్లీ చాలాకాలం తరువాత వచ్చింది.

అయితే…సినిమా బాగోలేదన్న అభిప్రాయం ఎందుకు కలుగుతోందన్నది ప్రశ్న. సినిమా మొత్తం చూశాక చెత్తగా ఉందనిగానీ, బోర్ కొట్టించిందనిగానీ అనిపించదు. సమస్యంతా ఎక్కడంటే…హీరో నానికి, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ఇప్పటిదాకా ఉన్న ముద్రే. ఈ ఇద్దరి సినిమాలు హాయిగా సాగిపోతూ,ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇందుకు భిన్నంగా తుపాకులు, కత్తులు, రక్తం, ఎడాపెడా హత్యలు….చూసి, ప్రేక్షకులు నెగిటివ్ భావనకు వచ్చారేమో అనిపిస్తుంది. ఇంకో డైరెక్టర్ ఇంకో హీరోతో ఇదే సినిమా చేసివుంటే చాలా బాగుందనే అభిప్రాయం వచ్చేదేమో..!

  • ఆదిమూలం శేఖర్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*