పాదయాత్రతో జగన్‌కు వెలకట్టలేని ‘సంపద’!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవంబర్‌ 6, 2017న ఇడుపులపాయలో ప్రారంభించిన పాదయాత్ర జనవరి 9, 2019న ఇచ్చాపురంలో ముగియనుంది. 341 రోజులు, 134 నియోజకవర్గాలు 3648 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర జగన్‌ జీవితంలోనేకాదు రాష్ట్ర చరిత్రలోనూ ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

ఎన్నికలకు దాదాపు ఒకటిన్నరేళ్ల సమయం ఉండగానే జగన్‌ పాదయాత్ర ప్రారంభించడంపై చర్చోపచర్చలు జరిగాయి. ఇంత ముందస్తుగా పాదయాత్ర మొదలుపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినవారు కొందరైతే…పాతయాత్ర వల్ల వైసిపికి ఒరిగేదేమోంటుందన్న సందేహం వ్యక్తం చేసినవారు కొందరు. అన్నింటికీ మించి…ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా జగన్‌ నడవగలరా అనే సందేహాలూ వ్యక్తమయ్యాయి.

జగమొండిగా పేరున్న జగన్‌ను….పాదయాత్రలోనూ ఆ మొండితనమే నడిపించిందని చెప్పాలి. ఏడాదికిపైగా పాదయాత్రను కొనసాగించడం, మూడున్నర వేల కిలోమీటర్లు నడవడం అంత తేలికైన విషయం కాదు. ఇందుకు ఎంతో ప్రణాళిక, పట్టుదల ఉండాలి. హత్యాయత్నం వంటి ఉదంతం ఎదురైనా…సుదీర్ఘ పాదయాత్రను విజయంతంగా ముగిస్తున్న జగన్‌ను ఆయన ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేని పరిస్థితి కల్పించారు.

వ్యాయామం కోసం ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేసినట్లు జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు జగన్‌ పాదయాత్రను చిన్నదిగానూ, సామాన్యమైనదిగానూ చూపడానికి ప్రయత్నించినా….ఈ పాదయాత్రి జగన్‌ను శారీరకంగానే కాదు…మానసికంగానూ ఉక్కు మనిషిగా మలిచిందనడంలో సందేహం లేదు. రాజకీయ నేతగా అనేక విషయాలను ఆకలింపుజేసుకోడానికి దోహదపడిందనడంలో అనుమానం లేదు.

పాదయాత్ర రూపకల్పనలోనే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా జగన్‌ పాదయాత్ర సాగింది. నగరాలు, పట్టణాల కంటే మండల కేంద్రాలు, గ్రామాల మీదుగానే యాత్ర సాగించారు. 2,516 గ్రామాల్లో జగన్‌ పాదయాత్ర సాగింది. దీంతో గ్రామీణుల్లో బలమైన ముద్ర వేయడానికి జగన్‌ ప్రయత్నించారు.

ఈ పాదయాత్రలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కోటి మందికిపైగా జనాన్ని జగన్‌ చూడగలిగారని ఒక అంచనా. ఇది ఆషామాషీ సంగతి కాదు. ఒక రాజకీయ నాయకుడు జనాన్ని కలుసుకోవడమే పనిగా పెట్టుకుని, కోటి మందిని కలుసుకోవడమంటే అరుదైన ఉదంతంగానే చెప్పాలి.

పాదయాత్ర అంటే….మనకు ఇష్టవున్నా లేకున్నా అనేక విషయాలు, విశేషాలు తెలుస్తాయి. జనం సమస్యలు ఎలావున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రజా సమస్యలు అర్థమైతేనే వాటిని పరిష్కరించడానికీ వీలుటుంది. ఎన్ని పుస్తకాలు చదవినా, ఎన్ని సమీక్షలు చేసినా లభించని జ్ఞానం లభిస్తుంది. అందుకే పాదయాత్రలు రాజకీయ నాయకులకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసినా, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినా… ఇటువంటి ప్రయోజనం వారికి దక్కింనడంలో సందేహం లేదు.

మీడియా ఉద్ధేపూర్వకంగా విస్మరించివుండొచ్చుగానీ…జగన్‌ పాదయాత్రలకు జనం పోటెత్తినమాట వాస్తవం. జగన్‌ను బలముందని చెప్పుకునే రాయలసీమ జిల్లాల కంటే కోస్తా జిల్లాలోనే ఎక్కువ జనం వచ్చారన్నది పరిశీలకుల అంచనా. తన జీవితంగా ఇటువంటి పాదయాత్రను చూడలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటి వారు చెప్పారు.

జగన్‌ కూడా తాను చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా జనంలోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. ఆయన మాట్లాడుతుంటే… సభికుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. ఒకవైపు తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు మరోవైపు ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో జగన్‌ సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి.

రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందా, జగన్‌ ముఖ్యమంత్రి అవుతారా అనే అంశాలను పక్కనపెడితే…ఈ సుదీర్ఘ పాదయాత్ర వల్ల వెలకట్టలేని, అంచనా వేయలేని జ్ఞాన సంపదను జగన్‌ సంపాదించారనడం సందేహం లేదు. నాయకుడిగా రాటుదేలారనడంలో అనుమానం అవసరం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*