పాపం…తిరుమల కోతులు!

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో, అలాగే తిరుమల నుంచి తిరుపతికి దిగే రోడ్డులో అక్కడక్కడా కనిపిస్తాయి. భక్తులు వేసే ఆహారం తిని అక్కడే తచ్చాడుతూ ఉంటాయి. ఆహారమైతే భక్తులు ఇస్తారుగానీ…తాగడానికీ నీళ్లు ఎవరిస్తారు? ఈ ఆలోచనే రోజూ ఆ మార్గంలో ప్రయాణించే కొందరు పాత్రికేయులకు వచ్చింది. దాంతో కొన్నేళ్ల క్రితం ఉన్నతాధికారులతో మాట్లాడి కోతులు, పక్షులు వంటివాటి కోసం తిరుమల ఘాట్‌రోడ్లలో అక్కడక్కడా చిన్న తొట్టెలు ఏర్పాటు చేయించారు. వాహనాల రేడియేటర్‌కు అవసరమైన నీళ్ల కోసం పెద్ద తొట్టెలు ఉన్నా….కోతులు ఆ నీళ్లు తాగలేవు. నీటిమట్ట కొద్దిగా లోతుకు వెళ్లిపోతే….ఆ నీళ్ల తాగడం కోతులకు సాధ్యం కాదు. అందుకే ఈ చిన్నతొట్టెల ఏర్పాటు. ఈ తొట్టెల్లో రోజూ నీళ్లు నింపేవాళ్లు. ప్రధానంగా వేసవిలో అడవిలో నీళ్లు దొరకవు. నీళ్ల కోసం చాలా దూరం ప్రయాణించాల్సివుంటుంది. అందుకనే వేసవిలోనైతే ఈ తొట్టెల్లో తప్పక నీళ్లు నింపుతారు. ఏమయిందోగానీ…ఇటీవల ఈ తొట్టెలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నీళ్లు నింపిన దాఖలాలే కనిపించడం లేదు. మొదటి ఘాట్‌రోడ్డలోనైతే రేడియేటర్‌ నీళ్ల ట్యాంకుల్లోని నీరు కూడా పాచిపట్టిపోయింది. అంటే నీళ్లు నింపి ఎంతకాలమయిందో అర్థం చేసుకోవచ్చు. తొట్టెలకు నీళ్లు నింపడానికి కొండపై నుంచి కిందిదాకా పైపులైను కూడా ఉంది. అయితే…అది అక్కడక్కడా తెగిపోయివుంది. దాన్ని సరిచేస్తే అన్ని తొట్టెలకు నీళ్లు పట్టవచ్చు. టిటిడి అధికారులు వెంటనే స్పందించి…తొట్టెల్లో రోజూ నీళ్లు నింపాలి. ఈ వేసవిలో వానరాల ప్రాణాలు కాపాడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*