పారిశుద్ధ్యం భేష్… సిబ్బంది శభాష్..! శివరాత్రి ఉత్సవాల్లో శానిటేషన్ పనితీరుపై ప్రశంసలు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

సాధారణంగా మన ఇంట్లో ఒక పండగ వచ్చిందంటే ఇంటిని ఒక రోజంతా శుభ్రంగా ఉంచుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది 13 -14 రోజుల పాటు లక్షల మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నా ఎక్కడా చిన్నపాటి చికాకు రాకుండా, చెత్తా చెదారం కనిపించకుండా పట్టణాన్ని అద్దంలా ఉంచడం ఎంతో కష్టం. అయితే రేయింబవళ్లు కష్టపడి శివరాత్రి ఉత్సవాల్లో ఎక్కడ కూడా పారిశుద్ధ్యం సమస్య లేకుండా పనిచేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు మున్సిపాలిటీ, దేవస్థానం పారిశుద్ధ్య విభాగం సిబ్బంది.

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 131మంది శానిటరీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరివద్ద పనిచేయించడానికి నలుగురు శానిటరీ మేస్రీ లు విధుల్లో ఉంటున్నారు. ఒక్కో మేస్రీ 35 మంది శానిటరీ సిబ్బందిచేత పనులు చేయించాల్సి ఉంది. వీరు కాకుండా శివరాత్రి ఉత్సవాలు కోసం దేవస్థానం శానిటేషన్ విభాగం అధికారులు తాత్కాలిక పద్ధతిలో మరో 200 మందిపైగానే పారిశుద్ధ్య కార్మికులను తీసుకుని మున్సిపల్ శానిటేషన్ విభాగానికి అప్పగించారు. దాదాపు మూడు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు వరకు శివరాత్రి ఉత్సవాల్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నారు. అంటే ఒక్కో మేస్రీ సుమారు75 మంది సిబ్బందికి బాధ్యత తీసుకుని పని చేస్తున్నారు. రోజుకు మూడు షిప్టుల ప్రకారం ఉదయం 6 నుంచి 2గం.ల వరకు, 2 నుంచి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6గం.ల వరకు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నారు.

ఉత్సవాల సందర్భంగా వీరు చేస్తున్న శ్రమ అంతాఇంతా కాదు. పట్టణంలో ప్రధాన నాలుగు మాడా వీధులతోపాటు సన్నిధి వీధి, కీలకమైన ఆర్టీసీ బస్టాండ్ ఏరియాతో పాటు తిరుపతి మార్గం నుంచే భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. స్వర్ణముఖి బస్టాండ్ నుంచి మిట్టకండ్రిగ వరకు ఎప్పటికప్పుడు రోడ్డుపై శుభ్రం చేయించాల్సి ఉంది. అర్దరాత్రి కూడా తేరువీధి , స్వర్ణముఖి బస్టాండ్ నుంచి ఏపిసీడ్స్ వరకు పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రంచేస్తూ కనిపిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో మేస్ర్తీలు గా ఉంటున్న ఇన్ చార్జీలు కంటిమీద కునుకులేకుండా దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణోత్సవం రోజుల్లో వీరి కృషి అంతాఇంతా కాదు. ఇటు మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శానిటరీ పని తీరును పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగానే శివరాత్రి ఉత్సవాల్లో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*