పార్టీకి ప్రభుత్వానికి మధ్య గీత‌ను చెరిపేసిన ముఖ్యమంత్రి

బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుర్మార్గ వ్యవస్థ ఎపిలో వేళ్లూని కొని వుంది.  పార్టీ వ్యవస్థకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య గల  గీత‌ ఎపిలో పూర్తిగా చెదిరిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష వైఖరి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా నిర్వహించేందుకు తాజాగా ఒక కోటి రూపాయలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రితో పాటు ఏలాంటి అధికార పదవులు లేని పార్టీ నేతలు కార్యకర్తలు ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు అచ్చట మకాం వేసేందుకు అయ్యే మొత్తం ఖర్చుకు ప్రజల డబ్బు వ్యయం చేయ నున్నారు.  మూడు నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఎవరు రాజో ఎవరు పకీరు తెలియని పరిస్థితి  నెలకొని ఉంది.ఈ స్థితిలో ఇంత ప్రజాధనం ఖర్చు చేయడం ఎంత వరకు సబబు? 
వాస్తవం చెప్పాలంటే తెలుగు దేశం పార్టీ అధికారంలోనికి రాగానే రాజ్యాంగ బద్దంగా ఎన్ని కైన సర్పంచ్ లను తోసిరాజని అభివృద్ధి పథకాల అమలుకు ఈ పథకాల్లో లబ్ది దారుల ఎంపికకు జన్మ భూమి కమిటీలను పార్టీ నేతలతోనింపి సరి కొత్త ప్రయోగం తెర మీదకు తీసుకు వచ్చి రాజ్యాంగాన్ని నిలువునా ఖూనీ చేశారు. బిజెపి కి అనుబంధంగా ఆర్ యస్ యస్ యే కాకుండా దాని పరివార సంస్థలు ఎన్నో ఉన్నాయి. కాని సలహాల వరకు పార్టీ కార్య క్రమాల వరకే పరిమితం అవుతున్నాయి. అదే కాంగ్రెస్ కు పలు అనుబంధ సంస్థలు వున్నాయి. ఎపిలో జన్మ భూమి కమిటీలు చేస్తున్న లాంటి పెత్తనం ఏ పార్టీకి చెందిన అనుబంధ సంస్థలు చేయడంలేదు. ఎపిలో మరీ బరి తెగించి రాజ్యాంగ వ్యవస్థ మట్టి పాలు చేశారు. తెలంగాణలలో కెసిఆర్ ఇటీవల రైతు సమితిలు ఏర్పాటు చేశారు.  గాని జన్మ భూమి కమిటీలకు ఇచ్చిన అధికారాలు తెలంగాణలో రైతు సమితులకు లేవు.
రాష్ట్రంలో ప్రభుత్వానికి పార్టీకి తేడా లేకుండా చేసిన ముఖ్యమంత్రి అదే సమయంలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రేపు ఢిల్లీలో ధర్నా చేయ బోతున్నారు. ప్రజలు శ్రమటోడ్చి చెల్లించిన నిధులును మంచి నీళ్ల ప్రాయంగా వ్యయం చేస్తూ అదే సమయంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యంను ఖూనీ చేయనున్నారు. కేంద్రానికి మోదీకి వ్యతిరేకంగా ధర్నా చేయ దలచితే పార్టీ నిధులు వ్యయం చేసుకోవాలి.
పైగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కోసం గతంలోపోరాటం చేసిన వారిపై పోలీసు లాఠీని ముఖ్యమంత్రి ప్రయోగించి అపకీర్తి మూట కట్టుకొని వున్నారు. ఈ స్థితిలో ప్రజా ధనాన్ని ధర్నాకు వెచ్చించే అర్హత వుందా? నాలుగేళ్లకు బిజెపితో కాపురం చేసి మూట గట్టు కొన్న ప్రభుత్వ వ్యతిరేకత నుండి బయట పండేందుకు తను చేసిన అపకీర్తి కడుగు కొనేందుకు అవసరమైతే తన పార్టీ నిధులు వ్యయం చేసుకోవచ్చు. కాని తాను నాలుగు ఏళ్లు పూసుకొన్న బురద కడుగు కొనేందుకు నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలను భ్రమలో వుంచింది- కాకుండా తిరిగి ప్రజా ధనమే ఖర్చు చేయడం ఏరక మైన ప్రజాస్వామ్యం?
ఇంత క్రితమే రాష్ట్రంలో ధర్మ పోరాట దీక్షల పేర వంద కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారు. అదే సమయంలో ప్రజలు తాము చెల్లించిన పన్నులరూపం లోని నిధులు దుర్యయం కావడమే కాకుండా ధర్మ పోరాట దీక్షలసభలకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో సామాన్య ప్రజలకు గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు తగిలాయి. అయితే త్వరలో నే ప్రజలు అంతకు అంత తీర్చేందుకు సిద్ధంగా వున్నారు.
– వి.శంకరయ్య, 9848394013

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*