పార్టీగా వైసిపి – పత్రికగా సాక్షి విఫలం!

రాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 3 లక్షల ఎన్‌టిఆర్‌ ఇళ్లకు గృహప్రవేశం చేయించింది. దీనిపై రెండు రోజులు టివి ఛానళ్లలో ప్రచారం హోరెత్తింది. పత్రికల్లోనూ పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. ఏదైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినపుడు ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం సహజమే. కాకుంటే ఇటీవల కాలంలో ఇది కాస్త ఎక్కువయింది. అది తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వమైనా చేసింది గోరంతైతే ప్రచారం చేసుకునేది కొండత అనేట్లుగా ఉంది. అది వేరేసంగతి. ఎన్‌టిఆర్‌ ఇళ్లలో భారీ అక్రమాలు జరిగాయన్నది మొదటి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఈ రాష్ట్రంలోని పలు ప్రధాన పత్రికలు, టివి ఛానళ్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నాయని వైసిపినే విమర్శిస్తోంది కనుక…వాటిని వదిలేద్దాం. అయితే సాక్షి పత్రిక ఏం చేస్తోందనేది అసలైన ప్రశ్న. ఎన్‌టిఆర్‌ ఇళ్లు రాత్రికి రాత్రి నిర్మించలేదు. రాత్రికి రాత్రి పూర్తికాలేదు. కనీసం ఐదారు నెలల నుంచి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇందులో అక్రమాల జరిగాయనేది బహిరంగ రహస్యం. అయితే….బయటపెట్టాల్సింది ఏమంటే నిర్ధిష్ట ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి పని చేయడంలో సాక్షి విఫలమయిందనే చెప్పాలి. ఈ విషయంలో సోషల్‌ మీడియా చేసిన కృషి కూడా సాక్షి చేయలేకపోయింది.

మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం గురించి తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత గొప్పగా చెప్పుకున్నారోగానీ…కొన్ని పత్రికలు మాత్రం ‘ఆహా…ఓహో’ అంటూ ప్రచారం ఆకాశానికెత్తేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగానే సోషల్‌ మీడియా….ఈ పథకంలో జరిగిన అక్రమాలపై ఉతికి ఆరేస్తోంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా పేజీలో ప్రచురించిన ఒక ఫోటో వైరల్‌ అవుతోంది. ఇద్దరు దంపతులు పూరి గుడిసె ముందు నిలబడిన ఒక ఫొటో, కొత్త ఇంటి ముందు నిలబడిన ఒక ఫొటో అది. ఈ ఫొటో చూస్తే అనేక సందేహాలు తలెత్తుతాయి. రెండు ఫొటోల్లో ఒకే రకమైన దుస్తుల్లో ఆ దంపతులున్నారు. స్పష్టంగా అర్థమయ్యేదేమంటే…ఏదో పూరి గుడిసె ముందు నిలబడి ఒకసారి, కొత్త ఇంటి ముందు నిలబడి ఇంకోసారి ఫొటో తీశారనేది తెలిసిపోతుంది. ఆ గుడిసె అలాగే ఉండగా ఇంకో స్థలంలో ఎన్‌టిఆర్‌ ఇల్లు నిర్మించారా? లేక పాత ఇంటి స్థలంలోనే ఇల్లు నిర్మించినా, ఫొటో కోసం ఏదైనా ఇంకో గుడిసెను ఉపయోగించుకున్నారా? ఎన్‌టిఆర్‌ గృహాన్ని రాజభవనంలాగా నిర్మించిన ఫొటోను సాక్షినే ప్రచురించింది. వాస్తవంగా ఇది మంచి ఫొటో. అయితే దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. లోపల పేజీల్లో పడేశారు. ఆ ఒక్క ఫొటోతోనే ఎన్‌టిఆర్‌ గృహాల బండారమంతా బయటపెట్టివుండొచ్చు. విలేకరి పంపినా…డెస్క్‌లో దానికి న్యాయం చేయలేకపోయారు.

ఎన్‌టిఆర్‌ గృహాల్లో జరిగిందేమంటే…ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యర్తలు, అభిమానులు అనేవాళ్లందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ‘ఇంద్రభవనంలాగా కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు…మేము ఇచ్చే సబ్సిడీ మేము ఇస్తాం’ అనే విధంగా వెసులుబాటు కల్పించారు. దీంతో చాలామంది బంగళాలులాగా ఎన్‌టిఆర్‌ ఇళ్లను నిర్మించారు. అయితే చెప్పేదేమంటే…ఇటువంటి ఉదంతాలను బయటకు తీసుకురావడంలో సాక్షి పత్రిక పూర్తిగా విఫలమయింది. ప్రతి జిల్లాలోనూ అన్ని పేజీలూ నిండిపోయే అన్ని ఫొటోలతో ఎన్‌టిఆర్‌ ఇళ్ల అక్రమాలను బయటపెట్టివుండొచ్చు. కనీసం పార్టీగానైనా వైసిపి ఆ పని చేసివుండొచ్చు. రాష్ట్ర వ్యాపితంగా సమాచారాన్ని సేకరించి మీడియాకు విడుదల చేసివుండొచ్చు. ఎక్కడెక్కడో అవినీతి జరిగిందని చెబితే జనం నమ్మరు. బహిరంగంగా కనిపించే అంశాలను చెబితే విశ్వసిస్తారు. మరెందుకో ఎన్‌టిఆర్‌ గృహాల్లో అక్రమాలను బయటపెట్టడంలో అటు పార్టీగా వైసిపి, ఇటు పత్రికగా సాక్షి విఫలమయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*