పింక్‌ డైమండ్‌పై నోరువిప్పని ఐవైఆర్‌ కృష్ణారావు!

టిటిడి వివాదంపై మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ఆచితూచి మాట్లాడారు. తాను చెప్పదలచుకున్న విషయాలు తప్ప వేరే అంశాల జోలికి వెళ్లలేదు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను….ముందుగానే విలేకరులు టిటిడి గురించి ప్రశ్నించారు. విడిగా మాట్లాడేందుకు ఇష్టపడటని ఆయన సభలోనే ముందుగా టిటిడి అంశాలపై కొన్ని వివరణలు ఇచ్చారు. ‘రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై నేను ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాను. ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని ప్రధాన అర్చకులే ఆరోపిస్తున్నారు. ఆలయ పాలనాధికారులు తొంతరపెడుతున్నారని ఆయన విమర్శిస్తున్నారు. అదేవిధంగా పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని గట్టిగా చెబుతున్నారు. అదేకాదు…పురాతన కట్టడాల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా పురావస్తు శాఖ అనుమతులు అవసరం. రమణ దీక్షితులు చెప్పేవన్నీ నిజాలే అని నేనూ అనడం లేదు. అందుకే నిజానిజాలు తేల్చడానికి విచారణ జరిపించమని ముఖ్యమంత్రిని కోరాను’ అని తాను చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా చెప్పారు. ఆ తరువాత కూడా మీడియా ప్రతినిధులు టిటిడి గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయగా….’నేను టిటిడికి సంబంధించి చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే చెప్పేశాను. ఇక దాని గురించి చెప్పేదేమీ లేదు’ అంటూ వెళ్లిపోయారు.

టిటిడి వివాదంలో ఐవైఆర్‌ కృష్ణారావు ఎందుకు ఇంత ఆచితూచి మాట్లాడారనేది ప్రశ్న. వాస్తవంగా రమణ దీక్షితులు ఆరోపణల్లో కీలకంగా ఉన్న పింగ్‌ డైమండ్‌ విషయంలో కృష్ణారావుకూ ప్రమేయం ఉంది. ఆయన ఈవోగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి పంపిన ఓ నివేదికలో….పింక్‌ డైమండ్‌ అనేది లేదని, గరుడోత్సవంలో పగిలిపోయింది రూబీ మాత్రమేనని తెలియజేశారు. ఇప్పుడేమో రమణ దీక్షితులు పింక్‌ డైమండ్‌ ఉండేదని, అది అదృశ్యమయిందని ఆరోపిస్తున్నారు. దీక్షితులు చేసిన ఆరోపణల్లో కైంకర్యాలు, పోటు తవ్వకాల గురించి ప్రభుత్వానికి లేఖ రాసిన ఐవైఆర్‌ కృష్ణారావు….పింక్‌ డైమండ్‌ గురించి మాట్లాడేందుకు మాత్రం ఇష్టపడ లేదు. ఈ అంశంలో రమణ దీక్షితులు ఆరోపణలను ఆయన విశ్వసిస్తున్నట్లు లేదు. వాస్తవంగా కృష్ణారావు ఈవో ఉన్నప్పుడు రమణ దీక్షితులతో సరైన సంబంధాలు లేవు. కృష్ణారావుకు వ్యతిరేకంగా రమణ దీక్షితులు పని చేశారు. అయినా అవేవీ మనసులో పెట్టుకోకుండా ఆయన లేవనెత్తిన అంశాల్లో, తాను నమ్మతున్న రెండు అంశాలపైన ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఇదిలావుండగా…పింక్‌ డైమండ్‌ ఉండేదని, అది కనిపించకుండా పోయిందని 2009లో నివేదికలో పొందుపరచిన అప్పటి సివిఎస్‌వో రమణ కుమార్‌ కూడా తిరపతికి వచ్చారు. అప్పుడు రమణ దీక్షితులు చెప్పడం వల్లే నమ్మి నివేదికలో రాశానని మరోసారి ఆయన బహిరంగంగా మీడియాకు చెప్పారు. అప్పుడు దీక్షితులను అంత బాగా నమ్మిన రమణ కుమార్‌ ఇప్పుడు ఎందుకు నమ్మడం లేదో..! ఏమైనా పింక్‌ డైమండ్‌ ఉన్నదన్న అధికారి, లేదన్న అధికారి ఇద్దరూ ఒక రోజు తిరుపతిలో కనిపించడం కాకతాళీయమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*