పుట్టిన రోజు నాడే…ప్రాణాలు పోయాయి : కరోనా మిగిల్చిన విషాదం…!

ఈసారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. అయితే…ఆ పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది కరోనా మిగిల్చిన విషాదం.

తమిళనాడు డిఎంకె ఎంఎల్ఏ అయిన అన్బళగన్‌ (62)కు కరోనా సోకడంతో గతవారం ఆ‍స్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం  ఉదయం కన్నుమూశారు. ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం తీవ్ర విషాదకరం. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

చెన్నైలోని క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతిచెందారు. ఆయనకు బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అన్బళగన్‌ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా వైరస్‌ కారణంగా ఓ ఎమ్మెల్యే మృతి చెందడం దేశంలోనే ఇదే తొలిసారి.

ఈ ఉదంతం నేర్పుతున్న పాఠం ఏమంటే…కరోనాకు ఎంతటి వారైనా ఒక్కటే. దానికి పేదా ధనిక తేడాలేదు. పలుకుబడితో పనిలేదు. కరోనా సోకిందంటే ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే అప్రమత్తత అవసరం. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*