పురాతన నాణేలు కాదు…పురాతన శ్రీవారి ఆభరణాల్లోని వజ్ర వైఢూర్యాలు ఉన్నాయా…?!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహూకరించడానికి… స్వామివారికి కానుకలుగా వచ్చిన పురాతన నాణేలను…శ్రీనివాసుని చిత్రపటం చుట్టూ అమర్చి ప్రత్యేక జ్ఞాపికను రూపొందించిన టిటిడి అధికారులు తీరు వివాదాస్పదం అయింది. ఈ జ్ఞాపిక వ్యవహారం బయటకు పొక్కడంతో….అధికారులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా టిటిడి అత్యున్నతాధికారి అయిన కార్యనిర్వహణాధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రధానంగా విమర్శలు ఎదుర్కొటున్నారు.

శ్రీనివాసునికి కానుకలుగా వచ్చిన నాణేలను ప్రధాన మంత్రికి కానుకగా ఇవ్వాలనుకోవడంలోనే ఏమాత్రం ఔచిత్యం కనిపించడం లేదు. ఇలా చేయడం తప్పాఒప్పా అనేదానిపై కనీసమైన ఆలోచన చేసినట్లు కనిపించదు. ఎందుకంటే…శ్రీకృష్ణదేవరాయలు మొదలుకుని, ఆఖరికి ఆంగ్లీయులు కూడా స్వామివారికి కానుకలు సమర్పించారు తప్ప…స్వామివారి నుంచి కానుకలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాంటిది….స్వామికి వచ్చిన కానుకలను ప్రధాన మంత్రికి కానుకగా ఇవ్వాలనుకోవడం చూస్తే…దైవభక్తి కంటే ప్రభుభక్తే మెండుగా ఉన్నట్లు భావించాల్సివస్తుంది.

ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ వంటి ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చినపుడు….సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శనానంతరం….స్వామివారికి అలంకరించిన వస్త్రాన్ని ఆ ప్రముఖునికి కప్పి, తీర్థప్రసాదాలు అందజేసి గౌరవిస్తుంటారు. టిటిడి తరపున స్వామివారి చిత్రపటాన్ని కూడా జ్ఞాపికగా అందజేస్తుంటారు. ఎంత గొప్ప ప్రముఖుడైనా ఇదే మహద్భాగ్యమని సంబరపడుతారు. అంతేగానీ…తమకు శ్రీవారికి కానుకగా వచ్చిన నాణేలు కావాలని, స్వామివారికి అలంకరించే కిరీటాన్ని తమకు అలంకరించాలని ఎవరూ కోరుకోరు. అధికారులు మాత్రం తమ ప్రభుభక్తి చాటూకోవడం కోసం ఒక్కోసారి విచక్షణ మరచి వ్యవహరిస్తుంటారు. ప్రధానికి పురాతన నాణేలతో జ్ఞాపిక ఇవ్వాలనుకోవడమూ ఆ కోవలోకే వస్తుంది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈవోగా వచ్చిన అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఏడాది పదవీ కాలం ముగిసింది. అయితే…ఎన్నికల తరువాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అనే అనుమానంతో….ఇంకా పదవీకాలం రెండు నెలలు ఉండగానే, ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజులు ముందు…తన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించుకుంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి జీవో తెచ్చుకున్నారు సింఘాల్‌. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో….టిడిపి ఇచ్చిన జీవోను రద్దు చేసి…సింఘాల్‌ను బదిలీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే…ఆయన కేంద్రంలోని బిజెపి నేతల సహకారంతో మరో ఏడాది టిటిడిలోనే కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారన్న వార్తలొచ్చాయి. ఈ ‘తన్మయత్వం’లోనే ఈవో సింఘాల్‌…జరగబోయే పరిణామాలను పట్టించుకోకుండా మోడీకి ‘ప్రత్యేక జ్ఞాపిక’ బహూకరించాలని నిర్ణయించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అటువంటి జ్ఞాపిక ఇవ్వాలని మోడీ ఏమైనా అడిగారా?!

తాను చేసింది సరైనదే అని ఈవో భావిస్తే….జ్ఞాపిక వ్యవహారం మీడియాలోకి ఎక్కగానే ఆ ప్రయత్నాలను ఎందుకు విరమించుకున్నారన్నది ప్రశ్న. పురాతన నాణేలతో తయారు చేసిన మెమెంటో బదులు….టిటిడి వద్ద ఉన్న పురాతన నాణేల వివరాలతో కూడిన పుస్తుకాన్ని మాత్రం బహూకరించారు. ఈ తెలివిడి ముందుగా ఎందుకు లేకుండాపోయిందనేది ప్రశ్న.

తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సున్నితమైనది. ఇక్కడి చిన్నపొరపాటు జరిగినా వివాదాస్పదం అవుతుంది. ఈ అంశాన్ని ఈవో పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఈ సందర్భంగా గతంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య కూడా ప్రస్తుతం జ్ఞాపకం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. తిరుమలలో రద్దీ గురించి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ….షిరిడీలోలాగా తిరుమల శ్రీవారి మూల విరాట్‌ దర్శనాన్ని ఆన్‌లైన్‌లో పెట్టాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. దీన్నిబట్టే….టిటిడి గురించి ఆయన సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. శ్రీవారి ఆలయం నుంచి బయటకు రావడానికి లోపల ఇనుప మెట్లు ఏర్పాటు చేసే ప్రయత్నంలోనూ ఈవో ఇటువంటి విమర్శలే ఎదుర్కొన్నారు.

ఇక ఈ అంశంలో మరో కోణం కూడా ఉంది….పురాతన నాణేలు టిటిడి మ్యూజియంలో భద్రపరిచారు. అటువంటి వాటిని బయటకు తీయాలంటే….అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. పాలక మండలిలో నిర్ణయించాలి. ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే…జ్ఞాపిక తయారీ కోసం మ్యూజియంలోని అతి పురాతన నాణేలను ఎలా బయటకు తేగలిగారు, దీనికోసం ఎవరు ఆదేశాలు ఇచ్చారు…? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈవో ఆదేశాలు ఇచ్చారా? లేక అంతకంటే కిందిస్థాయి అధికారల ఆదేశాలతో నాణేలను బయటకు తెచ్చారా? అనేది తేలాల్సివుంది. ఈ నిర్వాకానికి ఎవరు బాధ్యలో గుర్తించి చర్యలు తీసుకోవాల్సివుంది.

ఇప్పుడు జరిగిన నాణేల వ్యవహారం చూస్తుంటే….ఎంతటి విలువైన వస్తువులైనా టిటిడి నుంచి తరలిపోవడం పెద్ద సమస్యేమీ కాదని అనిపిస్తుంది. శ్రీవారికి అతి పురాతనమైన అనేక ఆభరణాలు ఉన్నాయి. వీటిలో విలువైన వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలూ పొదిగినవి ఉన్నాయి. టిటిడిలో చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం ఏమంటే….శ్రీవారి కిరీటాలు సహా పురాతన ఆభరణాల్లోని విలువైన రాళ్లు మాయమైనాయని చెబుతారు. ఉత్సవాల సందర్భంగా రాలిపోయాయన్న పేరుతో….ఆ స్థానంలో మళ్లీ రాళ్లు తెప్పించి అమర్చుతున్నారు. ఒకప్పడు ఆభరణాలు మిరాశీ అర్చకుల చేతుల్లో ఉండేవి….మిరాశీ వంతు మారేటప్పుడు ఆభరణాలను పరిశీలించేవారు. రాళ్లలో ఏవైనా రాలిపోయివుంటే అప్పటిదాకా మిరాశీ బాధ్యతలు నిర్వహించిన వారే కొత్తవి తెప్పించేవారు. ఆభరణాల నిర్వహణ టిటిడి చేతికి వచ్చిన తరువాత కూడా రాలిపోయిన రాళ్ల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేసి కొత్తవి తెచ్చి అమర్చుతున్నారు.

ఇక్కడ పట్టించుకోని అంశం ఏమంటే….పురాతనమైన రాళ్లను కొత్త రాళ్లు భర్తీ చేయగలవా అనేది. అందంలో మార్పు ఉండకపోవచ్చుగానీ….పురాతనం అనే మాటతో ఏ వస్తువుకైనా విలువ పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని…కొందరు అర్చకులు స్వామివారి ఆభరణాల్లోని పురాతన రాళ్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ ఈ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదుగానీ…ఇప్పుడు పురాతన నాణేలను బహూకరించాలన్న వివాదంతో…ఆభరణాల అంశానికీ ప్రాధాన్యత వచ్చింది. గతంలో ఏ అధికారికి, ఏ ప్రజాప్రతినికిధికి, ఏ విలువైన శ్రీవారి కానుకలను….జ్ఞాపిక పేరుతో ఇచ్చారో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ఆభరణాలు మాయమవుతున్నాయని మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వంటివారు చేసిన ఆరోపణలనూ నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఏదిఏమైనా….శ్రీవారికి కానుకగా వచ్చిన వాటిని ప్రజాప్రతినిధులకు కానుకగా ఇవ్వాలనుకోవడం క్షంతవ్వం కాదు. దీనికి కారకులెవరో బయటకు చెప్పకున్నా, అధికారికంగా వారికి శిక్ష పడకున్నా….శ్రీవారి కోర్టులో శిక్ష తప్పించుకోలేరన్నది స్వామివారి భక్తుల బలమైన నమ్మకం.

– ఆదిమూలం శేఖర్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*