పృధ్వీరాజ్‌ను అపహాస్యం చేయడం ఎందుకు..!

టిటిడికి చెందిన భక్తి ఛానల్‌ ఎస్‌విబిసి ఛైర్మన్‌గా సినీ నటులు పృధ్వీరాజ్‌ నియమితులైన్నప్పటి నుంచి కొందరు ఆయన్ను అపహాస్యం చేస్తూనే ఉన్నారు. పృధ్వీరాజ్‌ను భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా నియమించడం ఏమిటని కొందరు ఎద్దేవా చేశారు. ఈ ధోరణి ఆ తరువాత కూడా కొనసాగుతూనే ఉంది. మొన్నటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన చేసిన కృషిని అభినందించడానికి బదులు అభిశంసిస్తూ, అభ్యంతరక ధోరణిలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు.

పృధ్వీరాజ్‌…తెలుగు సినీ పరిశ్రమలో పేరుగాంచిన నటుడు. ’30 ఇయర్స్‌ ఇండస్త్రీ’ అనే ఒక్క డైలాగుతో కోట్ల మందికి చేరువైన నటుడు. హాస్య నటుడిగా పృద్వీరాజ్‌ తెలియనివారు తెలుగురాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో ఆయనకు మంచి డిమాండ్‌ కూడా ఉంది. ఎస్‌విబిసి ఛైర్మన్‌ పదవి దక్కడంతో సినిమాలు తగ్గించుకుని, నెలకు 20 రోజుల దాకా తిరుపతిలోనే ఉంటున్నారు. ఛానల్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల కోసం రూపొందించిన కొన్ని ప్రోమోలలో ఆయన స్వయంగా నటించారు. ఎస్‌విబిసిలో కాంట్రాక్టుపై పని చేస్తున్న ఉద్యోగులందరినీ….ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుని అయినా పర్మినెంట్‌ చేయిస్తానని చెప్పారు. ఇవన్నీ అభినందించదగ్గ విషయాలే.

మరెందుకోగానీ….పృధ్వీరాజ్‌ను అభినందించడం కంటే అపహాస్యం చేయడానికే కొందరు ఆసక్తి చూపుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళ భక్తులకు ఒక సందేశం ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. తమిళం రాకున్నా….రాసుకుని, దాన్ని రికార్డు చేసే ప్రయత్నం చేశారు. రికార్డు చేసే సమయంలో తప్పులు పోవడం, మరో టేక్‌ తీయడం సహజమే. తప్పులు లేకుండా బాగా వచ్చిన దాన్ని వినియోగించుకుంటారు. మిగతావి డిలీట్‌ చేస్తారు. అయితే…పృద్వీని అపహాస్యం చేయాలనుకున్న వ్యక్తులు….డిలీట్‌ చేయాల్సిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియోపై ఎగతాళి కామెంట్లు సరేసరి. ఈ వీడియోను ఎవరు లీక్‌ చేశారు, ఎందుకు లీక్‌ చేశారు అనే అంశాలు విజిలెన్స్‌ విచారణ జరిపిస్తేగానీ తెలియవు.

గతంలో దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్‌విబిసి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన రొమాన్స్‌ చిత్రాల దర్శకుడిగా అందరికీ తెలుసు. ఆయనపైనా ఇటువంటి విమర్శలే (ఇంత మోతాదులో లేవు) వచ్చాయి. అటువంటి దర్శకున్ని భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసినా వాళ్లు ఉన్నారు. సినీ జీవితం వేరు….నిజ జీవితం వేరు. సినిమా తెరపై కనిపించినట్లే నిజజీవితంలో ఉండరు. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే….రాఘవేంద్రరావునైనా, పృధ్వీరాజ్‌నైనా ఎవరూ ఎద్దేవా చేయరు.

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*