పెప్సీ కంపెనీ కంటే పెద్ద అన్యాయం… రైతులకు ప్రభుత్వమే చేస్తోంది..!

తమ కంపెనీ తయారుచెసే లేస్ చిఫ్స్ లో వినియోగించే ప్రత్యేక రకమైన బంగాళాదుంపలను తమ అనుమతి లేనిదే ఎవరూ పండించకూడదని పెప్సీ కంపెనీ అంటోంది.‌ అనుమతి లేకుండా పండించిన రైతులపై కేసులు పెట్టింది. ఇది కచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశమే. దేశ ప్రజలంతా రైతుకు అండగా నిలవాల్సిన సందర్భమే. ఎందుకంటే విత్తనాలపైన పేటెంట్ అనేదే దుర్మార్గమైనది. కోటానుకోట్ల ప్రజల ఆహార భద్రతను కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్డేదే. అందుకే మొదటి నుంచి పేటెంట్ పద్ధతిని ప్రగతిశీల శక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ కథనంలో చర్చించదలచుకున్నది బంగాళాదుంప రైతుల గురించి కాదు. పెప్సీ నిర్వాకం కాదు. మన ప్రభుత్వమే మన రైతులకు చేస్తున్న అన్యాయం గురించి. చిత్తూరు జిల్లాలో చెరకు విస్తారంగా పండిస్తారు. చెరకు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ విస్తీర్ణంలో ఉంది. చెరకు పండించిన రైతులు కొందరు…చక్కెర ఫ్యాక్టరీ లకు చెరకు తోలుతారు. ఈ సంవత్సరం సరఫరా చేసిన చెరకుకు వచ్చే ఏడాది కూడా డబ్బులు రావు.

ఈ బాధ భరించలేక కొందరు‌ రైతులు చెరకుతో బెల్లం‌ తయారు చేస్తారు. అయితే…నేల స్వభావాన్ని బట్డి కొన్ని ప్రాతాల్లో పండిన చెరకుతో తయారయ్యే బెల్లం నల్లగా ఉంటుంది. ఈ నలుపే రైతుకు శాపంగా మారుతోంది. నల్ల బెల్లాన్ని సారా తయారీకి వాడుతారట…అందుకే ఎవరూ నల్లబెల్లం‌ తయారు చేయకూడదట. అలా చేసిన రైతులపై కేసులు పెట్డిన ఉదంతాలున్నాయి. సారా తయారు చేస్తే…తయారుచేసే వారిని పట్టుకోవాలి తప్ప…బెల్లం తయారుచేసే రైతును శిక్షించడంలో అర్థం ఉంటుందా…! అయినా…మంచి రంగులో బెల్లం తయారైతే రైతు వొద్దనుకుని నల్లగా చేస్తారా..!!

రైతులు చాలాకాలం ఉద్యమించిన తరువాత ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్డింది.‌ ఎంత కొనుగోలు చేశారు, ఎంత ధర ఇచ్చారు అనేది పక్కన పెడితే…బెల్లం తయారుచేసే రైతులను నేరస్తుల్లాగా చూశారన్నది వాస్తవం.

అదేవిధంగా చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతంలో గసగసాలు పండించిన రైతులపైన కేసులు పెట్డారు. పంటను ధ్వంసం చేసిన సందర్భాలన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న రైతులే గసగసాలు పండించాలట. గసగసాలకు మంచి ధర ఉన్నా పండించకూడదట…

మరోమాట కూడా…భూగర్భ జలాలు అడుగంటాయన్న పేరుతో కొన్ని ప్రాంతాలను డార్క్ ఏరియాలుగా ప్రకటిస్తారు. ఇటువంటి ప్రాంతాల్లో బోర్లువేస్తే కేసులు పెడతామంటూ రైతులను బెదిరిస్తారు.‌ ఒకవేళ బోరు వేసుకున్నా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా వేధిస్తారు. కళ్ల ఎదుటే చెన్నైకి నీళ్లు పారుతుంటాయి. ఏ రైతయినా ఆ కాలువలో మోటారు పెట్డి నీళ్లు తోడితే…కేసులంటూ బెదిరిస్తారు.

ఇలాంటి రైతు దీనగాథలు కోకొల్లలు. ప్రతి జిల్లాలోనూ ఇటువంటి రైతు కన్నీటి కతలుంటాయి. ప్రతి ఏటా వుంటాయి. ప్రతి చోడా ఉంటాయి. ప్రభుత్వాలకు సమగ్రమైన ఆలోచనా విధానం లేకపోవడం వల్లే ఈ దుస్థితి.

వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత తమదే అనే సంగతిని పాలకులు‌ మరచిపోతారు. బోర్లు వేయవద్దంటే…నీళ్లు ఎలా వస్తాయో చెప్పరు. ఒక పంట వేయకూడదంటే ప్రత్యామ్నాయం ఏమిటో ప్రభుత్వం చెప్పదు. బెల్లం నల్లగా ఉంటే…దాని రంగు మార్చడానికి మార్గం ఏమిటో సూచించరు.

ఇది పెప్సీ కంపెనీకంటే అన్యాయమైన మోసంకాదా…పెప్సీది చేస్తున్న దగా కంటే దారుణమైనది కాదా…!

– ఆదిమూలం శేఖర్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*