పొరుగు రాష్ట్రాల నేత‌ల‌తో చంద్ర‌బాబు పాట్లు…!

గ్రహాలలో ఒకటైన చంద్రుడికి స్వయం ప్రకాశం లేదనేది అందరికీ తెలుసు. అందుకేనేమో ఆ పేరుగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 1995 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎవరితో నైనా ఒకరి పొత్తు లేకుండా ముందుకు సాగిన సందర్భం లేదు. అదృష్టమో దురదృష్టమో గాని 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయ వలసిన సందర్భం ఏర్పడింది. కానీ ఆ సందర్భం కూడా ఏర్పడకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సార్థకనామ థేయం- నిజం అయ్యేటట్టు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రతిపక్షాలు రాష్ట్రంలో సింహం సింగిల్ గానే వేటకు వెళుతుందన్నట్లు పోటీ చేస్తుంటే అధికారంలో వుండి 40 ఏళ్ల రాజకీయ అనుభవం వుండి కూడా చంద్రబాబు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను తన ఘనత చెప్పించు కోనేందుకు ప్రచారం కోసం రప్పించారంటే వాస్తవంలోతన ఓటమిని అంగీకరించినట్లు భావించ వలసి వుంటుంది. కోట్లాది రూపాయల విలువ చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు అమలు చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అవి వాస్తవంలో ప్రజలకు అందించి వుంటే ఆ అంశాలు టాంటాం వేసేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాల్సిన అవసరం వుండదు. తన ఘనతను చాటేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను పిలిపించినారంటే రెండు అంశాలు ఇమిడి వున్నాయి. 1)గతంలో లాగే ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబులో లేదు. 2)ఈ చర్య ద్వారా పరోక్షంగా ఓటమిని పోలింగ్ కౌంటింగ్ ముందే అంగీకరించారు.

గతంలోనికి ఒకమారు వెళ్లి సింహావలోకనం గావించితే ఎన్టీఆర్ శకం ఇంకా వుండగానే 1994 లో టిడిపి ఒంటరిగా పోటీ చేసి స్వీప్ చేసింది. తదుపరి జరిగిన పరిణామాలల1995 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుండి 1999లోనూ 2004 లోను 2009 లోనూ 2014 లోనూ జరిగిన ప్రతి ఎన్నికల సమయంలో పొత్తు లేకుండా పోటీ చేసిన సందర్భం లేదు. 2004 లో బిజెపితో కలసి పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఇక జన్మలో బిజెపితో కలిసి పోటీ చేసేది లేదని భీష్మ ప్రతిఙ్ఙ చేశారు. తిరిగి 2009 ఎన్నికల్లో వామపక్షాలు టిఆర్ఎస్ తో జట్టు కట్టారు. అప్పుడు ఓటమి చెందారు.

రాష్ట్ర విభజన జరిగిన తదుపరి 2014 లో జరిగిన ఎన్నికల్లో గతంలో చేసిన ప్రతిఙ్ఙ గాలికి వదిలేసి తిరిగి బిజెపితో పొత్తు పెట్టుకొన్నారు. ప్రథాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని వెంటవేసుకొని తిరుపతి నుండి వైజాగ్ వరకు సభలు నిర్వహించారు. ఇదొక చారిత్రక దశగా అభివర్ణించారు. ప్రస్తుతం బిజెపితో చెడిన తదుపరి తెలంగాణ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అందుకూ అది కూడా చారిత్రక ఆవశ్యకత గా చెప్పారు. తీరా ఫలితాలు వచ్చి తలకు బొప్పి కట్ట గానే ఎపి ఎన్నికలు వచ్చే సరికి కాంగ్రెస్ కు రాం రాం చెప్పారు.

ప్రస్తుతం ఎపిలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక అప సోపాలు పడుతూ తుదకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించుకొని ప్రచారం చేయించు కుంటున్నారు. రాజకీయ నాయకులకు విశ్వసనీయ ప్రాణ ప్రద మైనది. మాట మీద నిలబడివుండటం తరచూ మాటలు మార్చితే విశ్వసనీయ పోతుంది. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంశంలో ఇవేవీ వుండవు. ఒకే అంశంపై కొద్ది మాసాలలో మాట మార్చడం దానికి చారిత్రక ఆవశ్యకతగాపేరు పెట్టడం రివాజు అయింది. అందుకే తన మీదనే తనకు విశ్వాసం కోల్పోయినందున ఇంత అనుభవం వుండీ ఎపి ప్రజలను మెప్పించేందుకు ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపించు కొనే దుస్థితి నెలకొంది.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*