పోలవరంపై జగన్‌ ఉచ్చులో చిక్కుకున్న టిడిపి..! చంద్రబాబు సెల్ఫ్‌ గోల్‌…!!!

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వేసిన ఉచ్చులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. పోలవరానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోందిన ప్రభుత్వం లేవనెత్తిన అంశాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావించిన చంద్రబాబు…తనకు తెలియకుండానే సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారు.

పిల్లర్ల నిర్మాణం పూర్తయి ఆకృతిదాల్చిన పోలవరం

తాము అధికారంలో ఉండగా సోమవారం-పోలవరం నినాదంతో పోలవరం పనులను పరుగులు పెట్టించామని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటున్నారు. 2018 లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని, దీన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి రాసిపెట్టుకోవాలని అసెంబ్లీ వేదికగా అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి దేవివేని ఉమామహేశ్వ రరావు చెప్పారు. అయితే 2019 ఎన్నికల నాటికి కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు.

పిల్లర్లపై గడ్డర్ల నిర్మాణం పూర్తయి శ్లాబ్ వేస్తున్న దృశ్యం

ఇదిలావుండగా, జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు లాగా ‘సోమవారం-పోలవరం’ వంటి నినాదాలు ఇవ్వలేదు. ప్రాజెక్టు సందర్శన పేరుతో హడావుడి చేయడం లేదు. అయితే…ప్రాజెక్టు పనులు మాత్రం శరవేగంగా సాగిపోతున్నాయి. కరోనా సమయంలోనూ పోలవరం పనులు ఆగలేదు. ప్రత్యేక రైళ్లలో కార్మికులను, ప్రత్యేక విమానాలలో నిపుణులను రప్పించి పనులు చేయిస్తోంది మెగా కంపెనీ. మూడు షిప్టుల్లో, రాంత్రిబవళ్లూ పనులు వేగంగా జరుగుతున్నాయి.

రాత్రివేళ కూడా పని చేస్తున్న కార్మికులు

ఇప్పటికే మొత్తం పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. గతంలో వీటి ఎత్తు 28 మీటర్లు వుంటే…ఆ తరువాత 52 మీటర్లకు పెంచారు. అయినా నిర్మాణం పూర్తయింది. పిల్లర్లపై పెట్టేందుకు 192 భారీ గడ్డర్లు నిర్మించాల్సివుండగా, అన్నీ సిద్ధమయ్యాయి. ఇందులో 84 గడ్డర్లను స్పిల్‌వే పిల్లర్లపైన అమర్చారు. దీనిపైన కాంట్రాక్టు శ్లాబ్‌ నిర్మాణమూ జరుగుతోంది. డిసెంబర్‌లోపు మొత్తం గడ్డర్లు అమర్చడం, కాంక్రీటు శ్లాబు వేయడం పూర్తవుతుంది. అంటే డిసెంబరు నెలాఖరు నాటికి….పోలవరం ప్రాజెక్టు ఇటువైపు నుంచి అటువైపునకు ప్రయాణింవచ్చు. ప్రాజెక్టులో కీలకమైన గేట్లు సిద్ధమవుతున్నాయి. వాటిని అమర్చే పని కూడా మొదలయింది. జూన్‌ నెలాఖరుకల్లా గేట్లు అమర్చడం పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు జగన్‌ హయాంలోనే పూర్తవడం, జాతికి అంకితమివ్వడం జరుగుతాయనడంలో సందేహం లేదు.

ఇటువైపు‌ నుంచ అటువైపునకు కనిపిస్తున్న పోలవరం

అయితే….ఇవన్నీ మరుగున పెట్టి తెలుగుదేశం పార్టీ పోలవరంపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రాజెక్టు పనులు జరగడం లేదని పదేపదే చెబుతోంది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదేమాట చెబుతోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో పోలరవం పనులు వేగంగా జరిగాయని, ఇప్పుడు జరగలేదని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే….పోలవరం పనులు మొదట్లో రివర్స్‌ టెండర్ల కోసం కొంతకాలం ఆగడం మినహా….నిధులు లేక ఆగిన పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలుగా 24 గంటలూ పనులు జరుగుతున్నాయి, అయినా పోలవరం పనులు ఆగిపోయాయంటూ ప్రచారం చేస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వం కూడా పోలవరంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. అయితే అది నిర్మాణానికి సంబంధించి కాదు. పునరావాసానికి సంబంధించిన అంశం. డ్యాం నిర్మాణం పూర్తయి నీళ్లు నిలబెట్టాలంటే ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించి, వారిని గ్రామాలు ఖాళీ చేయించాలి. దీనికి నిధులు అవసరమవుతాయి. వాస్తవంగా డ్యాం ఎత్తు పెంచడం వల్ల ముంపు ప్రాంతం ఎక్కువయింది. దీంతో పరిహారం కూడా భారీగా పెరిగింది. కేంద్రం ఇక్కడే మెలికపెడుతోంది. నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. జగన్‌ ఆందోళన ప్రాజెక్టు నిర్మాణంపై కాదు…నిర్వాసితులకు పరిహారం చెల్లించడం గురించి. దీన్నే జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెబుతున్నారు.

నిధులు రావడం లేదని ప్రభుత్వం చెప్పడాన్ని ఆసరా చేసుకుని….అసలు ప్రాజెక్టు పనులే జరగడం లేదనే ప్రచారాన్ని టిడిపి సాగిస్తోంది. ఈ ప్రచారం ప్రాజెక్టు పనులు పూర్తయి, ప్రాజెక్టును జాతికి అంకితం చేసేదాకా ఉపయోగపడొచ్చు. ఆ తరువాత ఆ ప్రచారం టిడిపికే ఎదురుతన్నుతుంది. ఇంతకాలం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని ప్రచారం చేస్తుండగా….అంతలో ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి నోచుకుంటే….ప్రజలు కళ్లముందు కనిపించే దాన్నే నమ్ముతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి వస్తుంది. టిడిపి సాగిస్తున్న ప్రచారం వల్ల ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ ఉండదు.

ఇక్కడ ఇంకో అంశం కూడా చెప్పుకోవాలి…పోలవరం నిధుల అంశాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి తెరపైకి తేవడం వల్ల….ఈ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన నిర్వాకాలన్నీ చర్చకు వస్తున్నాయి. అసలు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు, ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల పెరిగే పరిహారానికి సంబంధించి నిధులను అప్పుడే ఎందుకు మంజూరు చేయించుకోలేదు, విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే ఇచ్చేలా ఎందుకు ఒప్పించలేదు, వీటన్నింటికీ అంగీకరించకుండా కేంద్రం నుంచి ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారు…ఇటువంటి అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి.

మొత్తంగా చేస్తే పోలరవం విషయంలో జగన్‌ వేసిన ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నట్లే ఉన్నారు. పరిహారానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసివుంటే ప్రజల అభిమానాన్ని చూరగొనేవాళ్లు. అలాకాకుండా….జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టడం కోసం పాజెక్టే ఆగిపోయిందని ప్రచారం చేయడం వల్ల ఆ పార్టీకి ఒరిగేదీమీ లేదనే చెప్పాలి. ప్రభుత్వం బాగా పని చేస్తున్నా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ప్రచారం సాగిస్తోందని…భవిష్యత్తులో జగన్‌ చెప్పుకోడానికి చంద్రబాబు మాటలు పనికొస్తాయి తప్ప…రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం దోహదపడవు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని ప్రచారం చేయడం కంటే….నిర్వాసితులకు పరిహారం, విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం ఉత్తమం.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*