ప్రజలతో మమేకమే.. వైవి సుబ్బారెడ్డి జీవన శైలి !

  • టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

‘‘కాలం ప్రతి రోజు నీకో అవకాశం ఇస్తుంది. ఉన్నచోటే నిల్చిపోవడమా లేక మార్పు దిశగా ముందుకు సాగడమా అనేది నీ ఇష్టం !’’ అవును. సరిగ్గా ఏడాది క్రితం వైవీ సుబ్బారెడ్డిగారి ముందున్న పరిస్థితి అదే. అప్పటిదాకా ఒంగోలు ఎంపీగా ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తిన స్వరం.. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. మనం వెళ్లానుకున్న దారి మూసుకుపోయినా కాలం మరోవైపు చూపిస్తుంది. నిత్యం ప్రజలతో మమేకమవుతూ.. సమస్యలపై నినదించే నాయకుడు ఆధ్మాత్మికత వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం పగ్గాలు చేపట్టాల్సివచ్చింది.

‘‘ ఏదైనా సమస్య లేదా సహాయం కోసం మన దగ్గరకు వచ్చిన ప్రజలను పదేపదే తిప్పించుకోవడం భావ్యం కాదు. నిజాయితీగా మనం చేయగలిగితే చేయాలి. లేకుంటే ఆ పని కాదని వాళ్లెదుటే చెప్పెయ్యాలి ! ’’ ప్రజాక్షేత్రంలో ఇంత నిర్మొహమాటంగా మాట్లాడిన పార్లమెంటు సభ్యుడ్ని ప్రకాశం జిల్లా ప్రజలు అంతకుముందు చూడలేదు. మొట్టమొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతూనే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా విజయం సాధించారు. గతంలో ఇక్కడ నుంచి ఎంపీలైన వాళ్లందరికన్నా భిన్నంగా సుబ్బారెడ్డి వ్యవహారశైలిని ప్రజలు చూశారు. వివిధ సమస్యలపై లేదా సహాయార్థం తనవద్దకొచ్చిన ప్రజలు చెప్పేది క్షుణ్ణంగా వినేవారు. సంబంధిత అర్జీను తీసుకెళ్లి అధికారులతో మాట్లాడేవారు. సమస్య పరిష్కారమవగానే సదరు అర్జీదారునికి సమాచారం ఇచ్చేవారు. ఈరకమైన పనివిధానం కేవలం కమ్యూనిస్టు పార్టీల్లో ఉండేదని ప్రజల నుంచి ప్రశంశలందుకున్నారు. ఎంపీగా అభివృద్ధి విషయంలో ఏనాడూ రాజకీయ వివక్ష చూపలేదు. కొన్ని సందర్భాల్లో ఫలానా పని చేయొద్దంటూ పార్టీ కార్యకర్తలు ఏకరువుపెట్టినా.. ఎన్నికల వరకే రాజకీయాలు. ఇప్పుడు ప్రజలందరికీ ప్రతినిధిని. ఎవరికి ఏ కష్టమొచ్చినా రాజకీయాలకు అతీతంగా నిలవాల్సిందేనంటూ అభివృద్ధి పనుల కేటాయింపులో అన్ని పక్షాల నేతలనూ అబ్బురపరిచారు.

స్వామివారి సన్నిధిలో టిటిడి ఛైర్మన్

ఓ ప్రతిపక్ష పార్లమెంటు సభ్యునిగా ఏమేరకు అభివృద్ధి చేయొచ్చనేది నిరూపించారు. ఏటా పొగాకు రైతులు రోడ్డెక్కనిదే వాళ్ల సమస్యలు పరిష్కారమయ్యేవి కావు. పొగాకు రైతుల విషయంలో సుబ్బారెడ్డి చూపిన చొరవ అంతాఇంతా కాదు. నేరుగా అప్పటి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను రైతుల వద్దకు తీసుకొచ్చారు. గిట్టుబాటు ధర ఇప్పించడానికి కృషి చేశారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం ఏకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగారు. నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డిని తీసుకొచ్చి కనిగిరి వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం మెడలు వంచి డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటునకు కృషి చేశారు. కిడ్నీ వ్యాధులపై కేంద్ర బృందంతో అధ్యయనం చేయించారు. వాటర్‌ ప్లాంట్ల ద్వారా నీటి సరఫరాకు దోహదపడ్డారు. అతీగతీ లేకుండా పడిఉన్న రైల్వే వంతెనకు మోక్షం కల్పించారు. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం తీసుకొచ్చారు. ఒంగోలు, మార్కాపురం మోడల్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ఇంకా రెండు కేంద్రీయ విద్యాయాలు, ఒంగోలులో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం పోర్టు కోసం ఆందోళన చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకను నిరసిస్తూ ఏకంగా 23 రోజులపాటు పాదయాత్ర చేశారు. రైతాంగం ఉప్పెనలా ఆయన పాదయాత్రలో అడుగు కలిపారు. సమైక్య రాష్ట్రం కోసం పార్టీ అధినేత ఇచ్చిన పిలుపునకు కట్టుబడి ఎంపీగా రాజీనామా చేశారు. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే.. నాలుగేళ్లకుపైగా సుబ్బారెడ్డి అందించిన సేవలను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారంటే అతిశయోక్తికాదు.

ఎన్నికల సమయంలో తనకే తిరిగి ఒంగోలు ఎంపీ నియోజకవర్గం కేటాయిస్తారని భావించారు. కానీ రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు, పార్టీ ఎత్తుగడలరీత్యా సుబ్బారెడ్డికి అవకాశం దక్కలేదు. పార్టీ ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని భావించారు. అది తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక వర్గం బాధ్యత రూపంలో వచ్చింది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోలేదు. టీటీడీ చైర్మన్‌గా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముక్కుసూటిగా వ్యవహరించే సుబ్బారెడ్డి శైలి తొలుత ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తించింది. ఆయన ఇవేమీ పట్టించుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మార్గదర్శకాలతో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తొలుత వీఐపీ బ్రేక్‌ దర్శనాల్లో పారదర్శకత కోసం ఎల్‌1, ఎల్‌2 దర్శనాలను రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రొటొకాల్‌, నాన్‌ ప్రొటోకాల్‌ దర్శనాలను ప్రవేశ పెట్టారు. సాధారణ భక్తులకు క్యూల్లో గంటల తరబడి నిరీక్షించే సమయాన్ని గణనీయంగా తగ్గించారు. దళారులు.. వారికి ఊతమిచ్చే శక్తులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఏకోన్ముఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సన్నాయి నొక్కులు నొక్కారు. అయినా వెరవలేదు. ఉద్యోగుల పని విధానంలో పారదర్శకత ఉండాల్సిందేనంటూ సంస్కరణలకు బీజం వేశారు. అరకొర వేతనాలతో ఏళ్ల తరబడి కునారిల్లుతున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అగచాట్లను తీర్చేందుకు నడుం బిగించారు. దీనిపై పాలకవర్గంలో ఓ కమిటీని వేశారు. పొరుగు రాష్ట్రాల్లో సలహా మండళ్లు ఏర్పాటు చేసి శ్రీవారిని భక్తులకు మరింత దగ్గర చేశారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో తనదైన మార్కును ప్రదర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుండగా ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో మొట్టమొదట వైవీ అడుగు ముందుకేశారు. తక్షణ కర్తవ్యంగా టీటీడీ అన్నదానం ట్రస్టు నుంచి నిత్యం లక్షా 20వేల మంది ఆకలి తీర్చేందుకు మార్చి చివరి వారం నుంచి ఆహార పంపిణీ మొదలుపెట్టారు. తిరుమల, తిరుపతి నగరంతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు. కోవిడ్‌ 19ను నిరోధించేందుకు టీటీడీ నుంచి సుమారు రూ.19 కోట్లు వెచ్చించి ఆస్పత్రి, వెంటిలేటర్లు, ఇతర సామాగ్రిని ఏర్పాటు చేశారు. తిరుచానూరు పద్మావతీ నిలయాన్ని క్వారంటైన్‌ వార్డు కింద ఇచ్చేశారు. లాక్‌డౌన్‌ కొనసాగినంతకాలం నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ పనిచేసినా.. ఏ పదవిలో కొనసాగినా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటారు. అందుకే ఆయన ప్రజానేత అయ్యారు. (01.05.2020న వైవి సుబ్బారెడ్డి గారి పుట్టిన రోజు)

  • సీహెచ్‌ కాశీ విశ్వనాథ్‌, సీనియర్ జర్నలిస్ట్,
    పీఆర్‌ఓ, టీటీడీ చైర్మన్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*