ప్రజల విశ్వసనీయత లేని టిడిపి ‘ప్రత్యేక’ పోరాటం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా రాజకీయం మొదలయింది. అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా పేరుతో రకరకాల విన్యాసాలకు పూనుకుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో కలిసివునన్న నాలుగున్నరేళ్లు ప్రత్యేక హోదా మరచిపోయిన టిడిపి….బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత సాగిస్తున్న ‘పోరాటం’ ఎంతకీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోతోంది.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కలిసిపోటీ చేశాయి. ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయింది. మంత్రిపదవులు తీసుకుంది. రాష్ట్రంలోని ఏర్పడిన తమ ప్రభుత్వంలో బిజెపికి భాగం పంచింది. బిజెపి ఎంఎల్‌ఏను చంద్రబాబు తన మంత్రిమండలిలోకి తీసుకున్నారు.

ఇదంతా చూసిన తరువాత…నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావించారు. ఆచరణలో ఈ అంశంపై అటు బిజెపి, ఇటు టిడిపి అనేక పిల్లిమొగ్గలు వేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బిజెపి ప్రకటిస్తే… చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ప్రత్యేక హోదాను ఎందుకు వదులుకుంటున్నారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే….ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినినా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే అంతా అయిపోతుందా అని నిలదీశారు. అటువంటి హోదా ఉన్న రాష్ట్రాలు ఏమి సాధించాయో చెప్పండి అని హూంకరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై పోలీసులను ప్రయోగించి ఉక్కుపాదం మోపారు.

నాలుగున్నరేళ్ల తరువాత ఏవో రాజకీయ కారణాల వల్ల బిజెపితో సంబంధాలు తెగిపోవడంతో….ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి ధర్మ పోరాట దీక్షల పేరుతో అన్ని జిల్లాల్లో దీక్షలు చేపట్టారు. ఆ మధ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అఖిలపక్ష సమావేశం అంటున్నారు. ఈ అఖిలపక్షాలకు ప్రధాన పార్టీలైన వైసిపి, కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ దూరంగా ఉంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోడానికి బిజెపి ఎంత కారణమో టిడిపి కూడా అంతే కారణం. అటువంటి టిడిపి ప్రత్యేక హోదా పేరుతో పోరాటం చేస్తామనడంలో అర్థం లేదని, అందులో తాము పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీలు తేల్చిచెప్పాయి.

పతిపక్షాలు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే. ఎందుకంటే….2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేక హోదా సహా సమస్యలుపై చర్చించడానికి అఖిపక్ష సమావేశం నిర్వహించమని అనేక పర్యాయాలు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. నాలుగున్నరేళ్ల పాటు ఒక్కసారి కూడా చంద్రబాబు ఆ డిమాండ్‌ను పట్టించుకున్నపాపాన పోలేదు. అయినా…ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించేటప్పుడు కూడా ఆయన ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. ప్రత్యేక హోదా అనేది టిడిపి సొంత వ్యవహారం కాదు. అది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం. అందుకే…ప్రత్యేక బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించే ముందు అఖిలపక్షంతో చర్చించివుంటే….ఈ రోజు టిడిపి చేస్తానంటున్న పోరాటానికి ప్రతిపక్షాల మద్దతు లభించివుండేది. ఆ రోజు ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుని, ఈ రోజు టిడిపితో కలిసి రమ్మంటే ఏ పార్టీ కూడా రాదు. టిడిపి చేస్తున్న ధర్మపోరాట దీక్షలకు ప్రజల విశ్వసం చూరగొనకపోడానికి కారణం ఇదే.

ఇక ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసిపి, సిపిఎం హాజరుకాలేదు. ఏ పార్టీలైతే ప్రత్యేక హోదా రాకపోడానికి కారణమో (బిజెపి, టిడిపి) ఆ పార్టీలనూ సమావేశానికి ఆహ్వానించడాన్ని వైసిపి, సిపిఎం తప్పుబట్టాయి. అందుకే తాము సమావేశానికి హాజరుకాలేదని ప్రకటించాయి. చలసాని శ్రీనివాస్‌గానీ, ఉండవల్లి అరుణ్‌కుమార్‌గానీ…ఎవరైనాసరే ప్రత్యేక హోదా పోరాటాన్ని చేపట్టాలంటే బిజెపి, తెలుగుదేశం పార్టీలను పక్కనపెట్టాలి. మిగతా పార్టీలను ఏకం చేసి పోరాటం నిర్వహించాలి. అంతేతప్ప ఆ పార్టీలనూ కలుపుకుంటే పోరాటం రాజకీయంగా మారి పవిత్రతను కోల్పోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*