ప్రతి ఓటుకూ విలువ దక్కాలంటే…ఒక్క ఓటూ మురిగిపోకూడదనుకుంటే…

కర్నాటక ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశం ఒకటి చర్చించాలి. 104 స్థానాలు కైవసం చేసుకున్న బిజెపికి 37.90 శాతం (1,24,61,000) ఓట్లు వచ్చాయి. 78 సాథనాలకే పరిమితమైన కాంగ్రెస్‌కు 36.20 (1,33,48,000) శాతం ఓట్లు దక్కాయి. 38 సీట్లతో మూడో స్థానంలో ఉన్న జెడిఎస్‌కు 18.40 శాతం ఓట్లు వచ్చాయి. బిజెపి కంటే కాంగ్రెస్‌కు దాదాపు 9 లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. సీట్లు ఎక్కువ వచ్చినవారిన గెలిచినట్లు భావించాలా? లేక ఓట్లు అధికంగా తెచ్చుకున్నవారిని విజేతలుగా పరిగణించాలా? మన ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎక్కువ వచ్చిన వారినే విజేతలుగా గుర్తిస్తున్నారు. ఓడిపోయిన వారికి ఎన్ని ఓట్లు వచ్చినా, ఎన్ని సీట్లు వచ్చినా వృథానే అవుతున్నాయి. ఈ ఎన్నికలోల సిపిఎంకు 79,161 ఓట్లు, బిఎస్‌పికి 1,06,798 ఓట్లు, కెపిజెపికి 73,440 ఓట్లు, ఎఐఎంఇపికి 94,546 ఓట్లు, ఐఎన్‌డికి 1,33,0157 ఓట్లు వచ్చాయి. ఇన్ని ఓట్లు వచ్చినా చాలా పార్టీలూ ఒక్కసీటు కూడా గెలుచుకోలేని స్థితివుంది. అంటే ఆ పార్టీలకు వేసిన ఓటుకు విలువ లేకుండాపోయింది. ఆ మాటకొస్తే గెలిచన అభ్యర్థులకు పడిన ఓట్లే ఉపయోగపడినట్లు. అదే నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థులకు వేసిన ఓట్లు వృథా అయినట్లే. ఆ ఓట్లు వేసుకున్న వ్యక్తి శాసన సభకు వెళ్లరుకాబట్టి ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్లు వేసిన వారి తరపున ప్రాతినిథ్యం లేనట్లే లేక్క.

అలాకాకుండా ప్రతి ఓటుకూ విలువ కల్పించే ప్రజాస్వామిక ఎన్నికల విధానం ఒకటి ఉంది. దాన్నే ‘దామాషా’ ఎన్నికల విధానం అంటారు. ఈ పద్ధతిలో ప్రతి ఓటుకూ విలువ ఉంటుంది. ఉదాహరణకు 100 అసెంబ్లీ స్థానాలున్న ఒక రాష్ట్రంలో కోటి మంది ఓటర్లు ఉన్నారనుకుందాం. ఇందులో 90 వేల మంది ఓట్లు వేశారుకుందాం. అంటే ఒక్కో స్థానానికి 90 వేల ఓట్లు ఉన్నట్లు లెక్క. ఒక్కో ఎంఎల్‌ఏకి 90 వేల ఓట్లు రావాలి. దామాషా ఎన్నికల విధానంలో ఫలానా నియోజకవర్గానికి ఫలానా వ్యక్తి పోటీ చేస్తారని ఏదీ ఉండదు. పార్టీలు తమకు ఎన్ని ఓట్లు వస్తాయనుకుంటున్నాయో అంచనా వేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తాయి. ఉదాహరణకు ఒక పార్టీ తమకు రెండు లక్షల ఓట్లు వస్తాయని అనుకుంటే ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఒక పార్టీ తమకు 10 లక్షల ఓట్లు ఉన్నాయనుకుంటే 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి తనకు రాష్ట్ర వ్యాపితంగా లక్ష ఓట్లు రావచ్చని అనుకుంటే అతనొక్కడే బరిలో ఉంటారు. అభ్యర్థుల జాబితా కూడా సీరియల్‌గా ప్రకటించాలి. 10 లక్షల ఓట్లు వస్తాయనుకున్న పార్టీకి 5 లక్షల ఓట్లే వస్తే…మొదటి ఐదు మంది శాసన సభకు ఎన్నికవుతారు. 8 లక్షల ఓట్లు వస్తే మొదటి 8 మంది ఎన్నికవుతారు. ఈ పద్ధతి వల్ల ప్రతి ఓటకూ విలువ ఏర్పడుతుంది. ఒక పార్టీకి అన్ని స్థానాల్లో బలం ఉండకపోవచ్చు. రాష్ట్ర వ్యాపితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీని అభిమానించే వాళ్లు కొందరు ఉండచ్చు. అలాంటి వాళ్లు కూడా ఆ పార్టీకి ఓటేయవచ్చు. తనకు నచ్చిన పార్టీ తన నియోజకవర్గంలో పోటీ చేయలేదని ఆ ఓటరు ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిన పనిలేదు. అభ్యర్థులు నేరుగా రంగంలో ఉండరు కాబట్టి డబ్బులు, మద్యం పంచడం వంటి ప్రలోభాలూ తగ్గుతాయి. ఎక్కువ పార్టీలకు, వ్యక్తులకు, కులాలకూ ప్రాతినిథ్యం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు రజక సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో ఐదు వేలు, ఈ నియోజకవర్గంలో ఐదు వేలు…ఇలా ఉన్నారనుకోండి. ఆ సామాజికవర్గమంతా ఒకరినో ఇద్దరినో నిలబెట్టి ఓట్లేయవచ్చు. అప్పుడు శాసనసభలో మా కులానికి ప్రాతినిథ్యం లేదని ఎవరూ బాధపడాల్సిన అవసరమూ ఉండదు.

ఇది అత్యంత ప్రజాస్వామిక ఎన్నికల విధానం. ఇప్పుడున్న విధానానికి పూర్తి భిన్నమైనది. ప్రజాస్వామ్యం బలోపేతమవాడినికి ఉపయోగపడేది. ఈ విధానం రావాలని మేథావులు చాలాకాలంగా కోరుతున్నారు. ఎన్నికల సంస్కరణల గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ దామాషా విధానంపై గురించి మాట్లాడుతున్నారు. కర్నాటక ఎన్నికలను చూసిన తరువాత దామాషా పద్ధతిపైన విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనికి మేథావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*