ప్రత్యేక హోదా ఎగ్గొట్టేందుకు కేంద్రం మరో ఎత్తుగడ..!

        ప్రత్యేక హోదా ఎపికి ఇచ్చే అంశాన్ని 15 వ ఆర్థిక సంఘానికి అప్పజెప్పినట్లు ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానంగా చట్టసభలో కేంద్ర మంత్రి చెప్పిన జవాబు మరో మోసపు ఎత్తుగడ మాత్రమే. ఎందుకంటే ఇంత వరకు ఏ రాష్ట్రానికి గతంలో చెప్పినట్లు చట్టం ద్వారా గాని ప్రస్తుతం మభ్య పెడుతున్నట్లు ఆర్థిక సంఘం ద్వారా గాని ప్రత్యేక హోదా ఇవ్వ లేదు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. 1969 లో 5 వ ఆర్థిక సంఘం ఈ విధానాన్ని సూచించింది. ఇందుకు గైడ్ లైన్స్ నిర్దేశించినది. అంతేకాదు. 14వ ఆర్థిక సంఘం కూడా ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వ వద్దని చెప్పలేదు. కాని తదనుగుణంగా నిధులు లేకుండా చేసింది. .

తొలుత- 5 వ ఆర్థిక సంఘం సూచనలు గమనంలోనికి తీసుకొన్న కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలను జాతీయాభివ్రుద్ది మండలి ఆమోదంతో ఈ పథకం అమలు చేస్తోంది. ఎపి అంశానికి వచ్చే సరికి వివిధ కారణాలు చెప్పి ఎగ్గొట్టారు. అయితే ఇచ్చట ఒక కీలకాంశం వుంది.

14 ఆర్థిక సంఘం సాధారణ రాష్ట్రాలు ప్రత్యేక హోదా గల రాష్ట్రాల మధ్య తేడా లేకుండా చేసి అంతవరకు అమలులోవున్న నాలుగు కేంద్ర పథకాలను రద్దు చేసింది. ఈ కారణం చూపెట్టి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులు లేవని కేంద్రం ప్రభుత్వం ఎపికి రిక్త హస్తాలు చూపెట్టింది. అంతవరకు బాగానే వుంది. ఎపికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టేందుకు ఇది ఒక సాకు మాత్రమే. ఎందుకంటే వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా పంట పండినట్లు 2017 లో 14 ఆర్థిక సంఘం సిఫార్సులు వెలువడిన తదుపరి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాలకు పదేళ్ల కాలానికి పైగా జిఎస్టీ అమలులో వున్నా 27413 కోట్ల రూపాయల మంత్రి వర్గ సమావేశంలో పెట్టి ఆమోదించింది. మరి ఒకవేళ వైసిపి నేతలు భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యెడల అప్యాయత వుంటే 2017 లో ఆమోదించినట్లు మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించవచ్చు. కాని రాష్ట్ర బిజెపి నేతలు చెబుతున్నట్లు ఎపికి ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదు. నెపం తన మీద లేకుండా చేసుకొనేందుకు మారిన రాష్ట్ర రాజకీయ పరిణామాలలో మొన్న కేంద్ర బడ్జెట్ తర్వాత బిజెపి లోనికి వచ్చేందుకు ముందు వెనుక ఆలోచించించు తున్న ఇతర పార్టీల నేతలను ఉద్దీప్తులను గావించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది.

ఒక వేళ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎపి యెడల మంచి చేయాలనే భావన వుంటే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46(3) ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఇందుకు చెంది 1050 కోట్ల రూపాయల మాత్రమే ఇచ్చి తదుపరి గుండు సున్నా చుట్టింది. ఒక వేళ చంద్రబాబు నాయుడుతో ఘర్షణ ఏర్పడినందున నిధులు ఆపేసిందనేందుకు ఆస్కారం లేదు. చంద్రబాబు నాయుడుతో తగాదా వుందని ఎపి ప్రజలకు చెందవలసి హక్కులు హరించితే రాష్ట్ర ప్రజలు బిజెపిని ఏలా నమ్ముతారు? కనీసం తమతో సఖ్యతగా వుండే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత అయినా మొన్నటి బడ్జెట్ లో నిధుల ఎందుకు కేటాయించ లేదు.? తుదకు రాష్ట్రంలో నెలకొల్పిన ఐఐటి లాంటి విద్యాసంస్థలకు ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించ లేదు.

అంతేకాదు. విభజన చట్టం సెక్షన్ 94(1)ప్రకారం రెండు రాష్ట్రాలలో వెనుక బడిన జిల్లాల్లో నెల కొల్పే పరిశ్రమలకు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం నిధులు కేటాయించాలసి వుండగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేక పోవడం కొస మెరుపు.

వాస్తవాలు ఇలావుండగా కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత కొందరు వైసిపి నేతలు హుషారుగా వుండ వచ్చు. గాని ఆచరణలో సాధించేది ఏమీ వుండదు.
ఒక వేళ అయితే గియితే సాధారణ రాష్ట్రాలు ప్రత్యేక హోదా గల రాష్ట్రాల మధ్య 14 ఆర్థిక సంఘం తేడా లేకుండా చేసిన విధానాన్ని 15 వ ఆర్థిక సంఘం తిరగ తోడి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అనువుగా నిధులు కేటాయింపులు చేస్తే తప్ప హోదా సాధన సాధ్యం కాదు. అప్పుడు కూడా హోదా కోసం ఒరిస్సా తదితర రాష్ట్రాలు క్యూలో వుంటాయి. ఇవన్నీ పరిశీలించితే ఇదంతా కంటి తుడుపు లాగా వుంది. ప్రస్తుతం బిజెపిలోనికి వెళ్లేందుకు ముందు వెనుక ఆలోచించే నేతలను ఆకర్షించే ఎత్తుగా భావించాలి. ఇచ్చట ఒక ముఖ్య మైన అంశం గుర్తించాలి. ప్రత్యేక హోదా వేరు. రాష్ట్ర విభజన చట్టం అంశాలు వేరు. దురదృష్టం ఏమంటే విభజన చట్టం అంశాలు కూడా అమలు చేయడం లేదు.

ఒక వేళ ఎపి మీద అపారమైన దయ వుంటే చట్ట బద్దంగా అందవలసిన వెనుక బడిన ప్రాంతాల నిధులు 2014 రాష్ట్ర లోటు బడ్జెట్ నిధులు వెనువెంటనే విడుదల చేస్తే కొంత మేరకు నమ్మ వచ్చు. ఆలాంటి సూచనలు కనిపించడం లేదు. వాస్తవం ఏమిటంటే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకు మేకై కూర్చుంటారు. ఇవ్వక పోతే ఎపి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. అందుకే ఈ లాంటి జిమ్మిక్కులు ప్రయోగించు తున్నారు. మబ్బులను చూచి కుండలో నీరు ఒలక బోసుకొనే విధంగా వైసిపి నేతలు వ్యవహరించితే ఇంతే సంగతులు.

       – వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*