ప్రత్యేక హోదా కేసుల ఎత్తివేత ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది…!

ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. హింసకు పాల్పడని వారిపైన ఉన్న కేసులు మాత్రమే ఉపసంహరించుకుంటామని అందులో ఒక తిరకాసు కూడా పెట్టారు. అయినా…..ప్రభుత్వానికి ప్రత్యేక హోదాకా కేసుల వ్యవహారం ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఉద్యమకారులను కోర్టుల చుట్టూ ఎందుకు తిప్పారు?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ లోక్‌సభలో హామీ ఇచ్చారు. ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బిజెపి డిమాండ్‌ చేసింది. బిజెపి అధికారంలోకి వచ్చాక హోదా సంగతి మరచిపోయింది. ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన టిడిపి…ఆ తరువాత ప్రభుత్వాల ఏర్పాటులో ఒకరితో ఒకరు భాగం పంచుకున్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని మోడీ ప్రకటించారు. దీన్ని టిడిపి స్వాగతించింది. ప్రత్యేక హోదానే కావాలంటూ ఉద్యమించిన వారిని చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. కేసులు పెట్టింది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారిని సంఘ వ్యతిరేక శక్తుల్లాగా చూసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే ఆందోళనలు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు పదేపదే విమర్శించారు. బిజెపి నుంచి విడిపోయేదాకా చంద్రబాబు నాయుడు…ప్రత్యేక హోదా అనేవారిపై ఒంటికాలిపై లేచారు. బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత ఆయన ధర్మ పోరాట దీక్షలంటూ తానే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు ఫోజు పెడుతున్నారు.

ఇంతలోనే బాబ్లీ కేసు నోటీసుల వ్యవహారం వచ్చింది. వాయిదాలకు హాజరుకానందుకు ధర్మాబాద్‌ కోర్టు చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నోటీసులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని భావించిన టిడిపి…ప్రజల కోసం పోరాడితే కేసులు పెడతారా…నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు ఇస్తారా? అంటూ నానా హంగామా చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడిన వాళ్లపైన కేసులు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. మీరు పోరాడితే కేసులు పెట్టకూడదంటూ…జనం పోరాడితే మీరే కేసులు బనాయిస్తారు…ఇదేమిటి? అనే ప్రశ్న వచ్చింది. ప్రభుత్వ ద్వద్వ వైఖరి బయట పడుతుందన్న భయంతోనే ఇప్పుడు ప్రత్యేక హోదా కేసులు ఎత్తేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

తమకు నచ్చని వారిపైన కేసులు కొనసాగించడం కోసం…ఉద్యమంలో ఎవరైనా హింసకు పాల్పడివుంటే అటువంటి వారిపై కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలన్నాక చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకోవడం సహజం. అంతమాత్రాన హింస పేరుపెట్టి ఆ కేసులు కొనసాగిస్తారా…అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బేషరుతుగా ఆ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*