ప్రభుత్వ కార్పొరేషన్ లో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విలీన ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాలి…టైంస్కేల్ హామీని అమ‌లుచేయాలి…రౌండ్ టేబుల్ స‌మావేశంలో టిటిడి ఉద్యోగ సంఘాల నేత‌ల డిమాండ్‌..

   టిటిడిలో విధులు నిర్వ‌హిస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేసే ప్ర‌క్రియ‌ను వెంట‌నే నిలుపుద‌ల చేయాల‌ని టిటిడి ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు. తిరుప‌తిలోని య‌శోద న‌గ‌ర్‌లోగ‌ల ఎంబి భ‌వ‌న్‌లో ఆదివారం టిటిడి ఉద్యోగ, కార్మిక సంఘాల నేత‌ల రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. 

   ఈ సంద‌ర్భంగా సిఐటియు జిల్లా అధ్య‌క్షుడు ఎం.నాగార్జున మాట్లాడుతూ టిటిడిలో సుమారు 14 వేల మంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు చాలా సంవ‌త్స‌రాలుగా అంకిత‌భావంతో విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు ఇచ్చిన హామీ మేర‌కు అంద‌రికీ టైంస్కేల్ వ‌ర్తింప చేయాల‌ని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంద‌రూ టైంస్కేల్ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో APCOSలో విలీనం చేయాల‌ని టిటిడి బోర్డు నిర్ణ‌యించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. టైంస్కేల్‌కు సంబంధించి టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డితోపాటు బోర్డు స‌భ్యులు మ‌రియు తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ప‌లుమార్లు హామీలిచ్చార‌ని గుర్తు చేశారు. ఈ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల‌తో ద‌శ‌ల‌వారీగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. 

  సిఐటియు జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కందార‌పు ముర‌ళి మాట్లాడుతూ క‌రోనా విప‌త్తు స‌మ‌యంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు ప‌లు ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో హ‌డావుడిగా APCOSలో విలీనం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. టిటిడిలో భ‌క్తుల‌కు ఎన‌లేని సేవ‌లందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని, లేనిప‌క్షంలో సిఐటియు త‌ర‌ఫున టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఎలాంటి పోరాటాల‌కైనా సిద్ధ‌మ‌ని తెలియ‌జేశారు. 

   టిటిడి స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయ‌కులు, ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్ట‌ర్ జి.వెంక‌టేశం మాట్లాడుతూ టిటిడిలో ఎలాంటి నిధుల కొర‌త లేద‌ని, APCOSలో విలీనం చేయ‌కుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరారు. 

   టిటిడి జెఏసి ఛైర్మ‌న్ జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ టిటిడి సంస్థ అభివృద్ధి కోసం శాశ్వ‌త ఉద్యోగుల‌కు స‌మానంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, అలాంటి వారికి న్యాయం చేయాల‌ని, వారికి పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని తెలిపారు. 

   టిటిడి మ‌హిళా ఉద్యోగుల అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు కె.ఇందిర మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాల‌ని వేత‌నాల‌తో కుటుంబ పోష‌ణ‌కు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, త‌ప్ప‌కుండా టైంస్కేల్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని తెలిపారు. 

   టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చేలా టిటిడి యాజ‌మాన్యం ముందుకు సాగాల‌ని, ఇందుకోసం యూనియ‌న్ త‌ర‌ఫున పోరాటం చేస్తామ‌ని అన్నారు. 

   టిటిడిలోని ప‌లువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ APCOSలో విలీనం చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. APCOSలో విలీనం చేస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని ర‌ద్దు చేయాల‌ని, టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరారు. 

రౌండ్ టేబుల్ స‌మావేశం తీర్మానాలు

 • మే 18న టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, జెఈవో, స్థానిక ఎమ్మెల్యే, తుడ ఛైర్మ‌న్‌ను క‌లిసి విన‌త‌ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం.
 • మే 19న టిటిడిలోని ఔట్‌సోర్సింగ్ కార్మికులు విభాగాలవారీగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి నిర‌స‌న తెలియ‌జేయ‌డం.
 • మే 20న ఉద‌యం 8 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ఎదుట పెద్ద ఎత్తున ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంద‌రూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి నిర‌స‌న తెలియ‌జేయ‌డం. ఈ స‌మావేశంలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి భౌతిక‌దూరం పాటిస్తూ, మాస్కులు ధ‌రించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, నాయ‌కులు పాల్గొన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు హరిప్రసాద్, నవీన్, రూప్ కుమార్, హరి, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*