ప్రభుత్వ సెక్యూరిటీస్‌ బాండ్లలో టిటిడి డిపాజిట్లు పెట్టడం నేరమా…!

బ్యాంకులు నగదు డిపాజిట్లపై వడ్డీ తగ్గిపోతున్న నేపథ్యంలో తిరుమల శ్రీనివాసుని నగదు డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీస్‌లలో పెట్టాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. దీన్ని కొందరు తప్పుబడుతున్నారు. దీనివల్ల స్వామివారి నగదుకు భద్రత ఉండదని, టిటిడికి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ సెక్యురిటీస్‌ బాండ్స్‌లో పెట్టే పెట్టుబడులు ప్రభుత్వపరమైపోతాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది తప్పా ఒప్పా అనే నిర్ధారణకు వచ్చేముందు….ప్రభుత్వ సెక్యూరిటీ డిపాజిట్ల గురించి కొంచెం తెలుసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రకరకాలుగా అప్పులు తీసుకుంటాయి. ఎల్‌ఐసి వంటి సంస్థల నుంచి ప్రభుత్వాలు అప్పు తీసుకున్న సంగతి తెలిసిందే. అదే పద్ధతిలో దేశ పౌరుల నుంచి, ప్రవాస భారతీయుల నుంచి కూడా అప్పులు తీసుకునే సంప్రదాయం ఉంది.

ఉదాహరణకు….అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.1000 కోట్లు ఇటువంటి ప్రభుత్వ సెక్యురిటీస్‌ బాండ్ల ద్వారానే సేకరించింది. దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ బాండ్ల రూపంలో అప్పులు తీసుకుంటున్నాయి. ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బులతో ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తారు. సాధారణంగా బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ మొత్తం ఈ బాండ్ల ద్వారా వస్తుంటుంది.

ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు అనేవి ఆషామాషీగా ఇచ్చేవి కావు. భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు, నిబంధనలకు అనుగుణంగానే ఈ బాండ్ల జారీ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రక్రియపై రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా ప్రతిపైసాకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఐదేళ్ల నుంచి 40 ఏళ్ల కాల పరిమితితో బాండ్లు ఇస్తుంటారు. ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. అసలు మాత్రం బాండు గడువు తీరినపుడు ఇస్తారు.

టిటిడికి సంబంధించి వివిధ బ్యాంకుల్లో 15 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. డిపాజిట్లపై బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రానురానూ తగ్గిపోతున్నాయి. దీనికి ఆర్థిక మాంద్యం వంటి అనేక కారణాలున్నాయి. రెండు కోట్ల లోపు డిపాజిట్లకు గరిష్టంగా 5.55 శాతం మాత్రమే వడ్డీ ఇస్తున్నాయి. అదే రూ.2 కోట్లు మించితే 4.65 శాతం మాత్రమే వడ్డీ వస్తోంది. అదే ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలోనైతే 7 శాతం దాకా వడ్డీ వచ్చే అవకాశముంది. అమరావతి బాండ్లపై ప్రభుత్వం 10 శాతం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ 6 శాతానికి తక్కువ ఉండదు. గణాంకాలు చూస్తే ఇదే అర్థమవుతుంది.

ఉదాహరణకు టిటిడి రూ.1000 కోట్లను ఐదేళ్ల కాలానికి బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే 4.65 శాతం వంతున వడ్డీ లెక్కిస్తే…రూ.260 కోట్లు వస్తుంది. అదే రూ.500 కోట్లను ప్రభుత్వ బాండ్లలో పెడితే ఐదేళ్లలో రూ.410 కోట్లు వడ్డీ వస్తుంది. వెయ్యి కోట్లకే రూ.410 కోట్లు అదనంగా వస్తే రూ.15,000 కోట్లకు ఎంత వస్తుందో లెక్కించుకోవచ్చు. అయినా డిపాజిట్ల మొత్తం ప్రభుత్వ బాండ్లలోనే పెట్టరు. బ్యాంకుల్లో ఎంత పెట్టాలి, అదీ జాతీయ బ్యాంకుల్లో ఎంత పెట్టాలి, ప్రైవేటు బ్యాంకుల్లో ఎంత శాతం పెట్టాలి, ఇటువంటి బాండ్ల రూపంలో ఎంత శాతం పెట్టాలి అనే దానికి లెక్కలున్నాయి.

అయినా బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రంగా ఉంటాయని, ప్రభుత్వ గ్యాంరెంటీ ఉన్న బాండ్లలో పెట్టుబడులకు భద్రత ఉడదన్న వాదన అసంబద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే బ్యాంకులు గ్యారెంటీ ఇవ్వలేదు. ఆ బ్యాంకులు దివాలా తీస్తే ఆదుకునేది ప్రభుత్వాలే. బెయిల్‌ అవుట్‌ ఇచ్చి బయటపడేసేది ప్రభుత్వాలు. అటువంటి ప్రభుత్వం వద్ద డిపాజిట్లు భద్రంగా ఉండవన్న ఆందోళనలో అర్థంలేదు.

మన రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలోనే కాదు…ఇతర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ బాండ్లలోనూ టిటిడి పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి ప్రభుత్వ అనుమతి కూడా ఉంది. జిఓ ఎంఎస్‌ నెం.311, తేదీ : 09.04.1990 మేరకు టిటిడి తన డిపాజిట్లను ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో పెట్టడానికి అవకాశముంది. ఆ మాటకొస్తే దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలన్నింటికి ఇటువంటి నిబంధనే ఉంది.

కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఇప్పటిదాకా జారీ చేసిన బాండ్లపైన వడ్డీ చెల్లించలేదనిగానీ, అసలు ఎగ్గొట్టాయన్న ఆరోపణలుగానీ లేవు. చంద్రబాబు ప్రభుత్వ జారీ చేసిన అమరావతి బాండ్లకూ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోంది. బ్యాంకులతో పోల్చితే ప్రభుత్వ సెక్యూరిటీస్‌లోనే పెట్టుబడులకు భద్రత ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

మళ్లీ టిటిడి విషయానికొస్తే…తన వద్ద ఉన్న రూ.15,000 కోట్ల డిపాజిట్లను బ్యాంకులకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సెక్యూరిటీస్‌లోనూ కొంత పెట్టడంలో తప్పులేదు. వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది. ప్రభుత్వాలు ఎల్‌ఐసి వంటి సంస్థల నుంచి అప్పులు తీసుకుని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నాయి. ప్రభుత్వాలనే నమ్మలేమంటే….బ్యాంకులనూ నమ్మలేం. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు…బ్యాంకుల కంటే ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు ఎంతో పదిలం.

అయితే…ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం టిటిడి నిధులను తరలించేందుకు ప్రయత్నిస్తోందనే వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే జరుగుతున్న అనేక ప్రచారాల్లో ఇదీ ఒకటి అనుకోవాలి. అంతకు మించిన వివాదం ఏమీ ఇందులో లేదు.

….ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*