ప్రశాంతంగా ఎస్వీయూ ఉద్యోగుల ఎన్నికలు

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు గా ఉన్న ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.‌ ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల దాకా జరగుతుంది. మొత్తం 643 మంది ఓటర్లు ఉండగా ఉదయం 10.30 గంటలకే దాదాపు 350 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు తమకు కేటాయించిన ఎన్నికల గుర్తు నమూనాలతో వర్శిటీ ఆవరణలో సందడి చేశారు. గొడుగు గుర్తు వచ్చిన వారు గొడుగులు వేసుకుని ఓట్లు అడుగుతూ కనిపించారు. టెంకాయ గుర్తు అభ్యర్థి అనుచరులు టెంకాయలు చూపించారు. గౌను గుర్తువారు గౌన్లు చేత పట్టుకున్నారు.

అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 36 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం కోసం పోలింగ్ జరుగుతోంది. అధ్యక్ష పదవి కోసం సిట్టింగ్‌ అధ్యక్షులు పికె సుబ్రమణ్యంతో పాటు అరుణ్‌ ఉమార్‌, కృష్ణకుమార్‌, గురుమూర్తి పోటీపడుతున్నారు. కార్యదర్శి పదవి కోసం సిట్టింగ్‌ కార్యదర్శి శ్రీధర్‌తో పాటు సుబ్రమణ్యం బరిలో ఉన్నారు. ఇక వివిధ విభాగాలు, క్యాడర్ల నుంచి 36 మంది ఇసి సభ్యులకుగాను…10 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 26 ఇసి స్థానాలకు పోటీవుంది.

పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలపైన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు‌. ఎన్నికయ్యే కార్యవర్గం మూడేళ్లు అధికారంలో ఉంటుంది. ఎన్నికైన వారి నుంచి ఒక జాయింట్ సెక్రటరీ, ఒక వైస్ ప్రెసిడెంట్, కోశాధికారిని ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసక్తికొద్దీ రిటైర్డ్ ఉద్యోగులూ వర్సిటీకి వచ్చి ఎన్నికల కోలాహలంలో భాగం పంచుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*