ప్ర‌త్యేక హోదా ఇచ్చే రాహుల్ గాంధీ…క‌డ‌ప ఉక్కు ఇవ్వ‌రా…!

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్రం జాప్యం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పరిశ్రమ ఏర్పాటు చేయాని మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో స్థాపించే పరిశ్రమ కోసం నెల రోజుల్లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికలకు ఆరు నెలల ముందు చేస్తున్న ఈ హడావుడి వల్ల రాయలసీమకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేది ప్రశ్న. అసలు పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందా? గాలిలో దీపంలా మారిపోతుందా?

రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగుల ఉపాధికి ఆశాదీపంలా కనిపిస్తున్న కడప ఉక్కు పరిశ్రమతో రాజకీయాలు చేయడం తప్ప….పరిశ్రమను నిర్మించి ఇక్కడి ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో కనిపించడం లేదు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు బ్రాహ్మణి స్టీల్స్‌ పేరుతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడుగులుపడ్డాయి. భూములు, నీటి కేటాయింపులు జరిగాయి. ఆ భూముల చుట్టా ప్రహరీ నిర్మాణమూ జరిగింది. రాజశేఖర్‌ రెడ్డి తన అనుచరులకు ఉక్కు పరిశ్రమ కట్టబెట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఇంతలో వైఎస్‌ మరణంతో…పరిశ్రమ నిర్మాణం ఆగిపోయింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో…ఉక్కు పరిశ్రమ కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని విభజన చట్టలో రాశారు. తీరా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గిట్టుబాటు కాదని సెయిల్‌ చేతులెత్తేసింది. దీనిపై రాయలసీమ ఉద్యమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో మళ్లీ పరిశీలిస్తామంటూ ఓ కమిటీని నియమించారు. అంతే అక్కడితో ఉక్కు పరిశ్రమ ఆగిపోయింది.

కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టలేమని కేంద్రం రెండేళ్ల క్రితమే తేల్చేసినా….ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టిడిపి దీనిపై నోరుమెదపలేదు. ప్రత్యేక పాకేజీ గురించి తప్ప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడలేదు. ఇటీవల బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాతే టిడిపికి ఉక్కు పరిశ్రమ గుర్తుకొచ్చింది. మొదటి నుంచి రాయలసీమ ఉద్యమ సంఘాలు చేస్తున్న ఆందోళనలకు టిడిపి మద్దతు ఇచ్చివుంటే…ఈపాటికి పరిశ్రమ ఏర్పాటు కొలిక్కివచ్చేది. ఇటువంటి అంశాలపై ఎవరైనా ఆందోళనకు దిగితే….వారిపై అభివృద్ధి నిరోధకులు అనే ముద్ర వేసి నోరు మూయించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది. రాయలసీమ అంశాల విషయంలోనూ ఇదే జరిగింది.

ఎన్నికలకు ఐదారు నెలల గడువున్న సమయంలో టిడిపి హడావుడి మొదలుపెట్టింది. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదుకాబట్టి….రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తామని చెబుతోంది. రూ.12000 కోట్ల పెట్టుబడి అవసరమయ్యే పరిశ్రమకు ప్రైవేట్‌ వ్యక్తుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. మరి ప్రైవేట్‌ వ్యక్తులు ఎవరు ముందుకొస్తారు, ఎంత పెట్టుబడులు పెడతారు, ఎంతకాలంలో ఇది పూర్తవుతుంది… వంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లు నెల రోజుల్లో పరిశ్రమకు శంకుస్థాపన చేసినా…అది పూర్తవుతుందా లేక బ్రాహ్మణి స్టీల్స్‌లాగే మొండి గోడలకే పరిమితమైపోతుందా?

కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు. దీన్ని సాధించడానికి కేంద్రం మెడలు వంచాలి. కేంద్రం అధ్వర్యంలోనే ఏర్పాటు చేయించాలి. ఆ పోరాట పటిమ సీమ ప్రజలకు ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వమూ సీమ ప్రజలకు అండగా నిలబడాలి. అంతేగానీ….రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు చేస్తుందంటూ శంకుస్థాపన చేయడం వల్ల సమస్య పక్కదారిపడుతుంది. ఆరు నెలల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మారకపోదు. కాంగ్రెస్‌ ప్రభుత్వమో, ఇంకో ప్రభుత్వమో అధికారంలోకి రావచ్చు. అప్పుడు కేంద్రంతోనే పరిశ్రమ ఏర్పాటు చేయించవచ్చు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. అలాంటప్పుడు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా రాజకీయ స్టంట్‌ కాదా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*