ఫక్తు రాజకీయ నేతలా పవన్ కళ్యాణ్..!

– ఎంత వారలైనా గాని…. రాజకీయాల్లోకి కొచ్చేసరికి….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న ప్రసంగాలు వింటుంటే విస్తుపోవలసి వస్తోంది. 2014 తర్వాత జనసేన పార్టీని పట్టాల మీదకు ఎక్కించిన తొలి రోజుల నాటి ప్రసంగాలు విన్నప్పుడు రాజకీయాలకు పనికిరాడని, అందులోని మెలుకువలు వంటబట్టించుకోలేదని, ఆదర్శవాదం, ఆవేశం ఎక్కువ అని పలువురు అభిప్రాయపడ్డారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై మక్కువ లేదని ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పదే పదే చెప్పిన సందర్భాలు అనేకం. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు, జగన్ పాకులాడుతున్నారని అవహేళన చేసిన సంఘటనలు లేక పోలేదు.

రాజకీయ పార్టీ నెల కొల్పిన పవన్ కళ్యాణ్ ఏమిటి ఇలా మాట్లాడుతున్నారని జన సేన కార్యకర్తలతో పాటు రాజకీయ విశ్లేషకులు విస్మయం వెలు బుచ్చడం అందరికీ తెలుసు. అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని ఆలాంటి అభిప్రాయం వున్నవారు తన వెంట రావద్దని కూడా హెచ్చరించారు. ఇది గతం.

ఇటీవల కాలంలో ప్రసంగాల తీరు పూర్తిగా మార్చి వేశారు. ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి తనేనని ప్రకటనలు చేయడంతో ఫక్తు రాజకీయ నేతగా మారిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం వున్న పరిస్థితులలో జనసేన పూర్తి మెజారిటీ సంపాదించి అధికారంలోనికి వస్తుందని ఇతరుల సంగతి అటుంచగా ఆ పార్టీ నేతలు కూడా భావించ గలరా? అయితే ఇందులో పవన్ కళ్యాణ్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత తన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంతో కర్నాటకలో కుమార్ స్వామి లాగా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు భావించ వలసి వుంది.
వామపక్ష భావజాలం తనను ప్రభావితుడిని చేసిందని చెప్పుకొనే పవన్ కళ్యాణ్ అతి కొద్ది స్థానాల్లో గెలుపొంది టిడిపి పై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా?

ఈ పరిణామక్రమం పరిశీలించితే గుంటూరు బహిరంగ సభ తదుపరి పలుమార్లు మాటలు మార్చడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కూడా పవన్ కళ్యాణ్ ను తప్పుబట్ట పనిలేదు. ఆదర్శ వాదం నుండి,‌ ఆగ్రహావేశాల నుండి క్రమేణా ఫక్తు రాజకీయ నేతగా మార్పు చెందటం అవసరం కూడా. అలాగే జరిగింది. కాని అది మితిమీరడమే నేటి సమస్య.

పోలింగ్ దగ్గరపడే కొద్ది చేస్తున్న కొన్ని ప్రసంగాలు దుమారం రేపడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతకన్నా మరో అంశం ఏమంటే ఒక దశలో కెసిఆర్ ను కలసి ఒక రక్తం బొట్టు చిందించకుండా తెలంగాణ రాష్ట్రం సాధించారంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఈ రోజు ఏ కారణం చేతనైనా ఆ అభిప్రాయం మార్చుకొనే స్వేచ్చ పవన్ కళ్యాణ్ కు వుంది. అది ఆయన స్వవిషయం. రాజకీయ నేతలు తరచూ వేసే పిల్లి మొగ్గలులో భాగంగా వుంటుంది. అందువలన కలిగే దుష్ప్రభావాలను వారే భరిస్తారు. కాని మధ్యలో తెలంగాణలో నివసించే లక్షలాది మందిని చిక్కులలో పడవేసే విధంగా మాట్లాడటమే ప్రమాదకరం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ లేదా పార్టీ నేతలను కాపాడేందుకు చేపట్టిన విధానాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కన్నా రెండడుగులు ముందుకు వేసి తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారని ప్రకటించడం ద్వారా పలు విధాల నష్టం వాటిల్లింది.

1)మరో ప్రతి పక్షం ఆరోపించుతున్నట్లు టిడిపి కి అనుకూలంగా పవన్ వ్యవహార సరళి వుందని భావించే అవకాశం ఏర్పడింది.

2)నేడు వాస్తవంలో ఆలాంటి దుస్థితి లేకున్నా ఈ లాంటి ప్రసంగాలతో ఎక్కడో అనుకోకుండా ఒక నిప్పు రవ్వ పడితే తెలంగాణలో నివసిస్తున్న లక్షలాది మందికి అపకారం జరిగే ప్రమాదం పొంచి వుంది.

3)ఇటీవలనే కెసిఆర్ పొగిడిన నోరు అంతలోనే మాట మార్చడంతో అపప్రద మూట గట్టుకున్నట్లు అవుతుంది. ఆదర్శవాదిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేతను సాదా సీదాగా జమ కట్టే అవకాశం ఏర్పడింది.

4) అంతేకాదు. ఇన్నాళ్లు టిడిపితో ప్రతి పక్ష పార్టీగా చేస్తున్న పోరాటం అంతిమంగా లాలూచీ కుస్తీగా తేలి పోయింది.

మరో అంశమేమంటే ప్రస్తుతం కెసిఆర్ నుండి జనసేన పార్టీకి గాని లేదా ఎపి ప్రజలకు గాని అంతేకాదు తెలంగాణలోని ఎపి ప్రజలకు వచ్చిన ముప్పు లేదు. చిక్కుఅల్లా తెలంగాణలో ఆస్తులు గల ఎపి టిడిపి నేతలపై ఒత్తిడి వుందని మాత్రమే. ఇది రెండు పార్టీలకుచెందిన సమస్య.

తెలంగాణలో టిడిపి వుంది. వారు కెసిఆర్ కు పొగ బెడుతున్నారు. అందుకు ప్రతిగా కెసిఆర్ టిడిపి నేతలపై వత్తిడి తేవచ్చు. ఇది రెండు పార్టీల మధ్య తగాదా. దానిని ముఖ్యమంత్రి తన పార్టీని కాపాడుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య సమస్య గా చేస్తుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంకా ముందుకు పోయి మాట్లాడితే ఇద్దరూ ఒక గూటి పక్షులేనని భావించక తప్పదు.

గుంటూరు అనంతపురం సభల నుండి పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వ్యవహార సరళి పరిశీలించితే అంతా పిల్లి మొగ్గల తీరు ద్యోతకమౌతుంది.
మరో కీలక మైన అంశమేమంటే రెండు రాష్ట్రాల మధ్య సుహ్రుధ్భావ వాతావరణం వుండాలని కోరు కొనే వామపక్షాలు పవన్ కళ్యాణ్ వైఖరి విస్మయం కలిగిస్తుండొచ్చు.

– వి.శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*