ఫేస్‌బుక్‌పై పన్ను…వాట్సాప్‌కు టాక్స్‌!

ఎవరో ఒకరాజు ఆదాయం పెంచుకోవడం కోసం మార్గాలను అన్వేషిస్తుండగా…జుత్తు (వెంట్రుకలు)పై పన్ను వేస్తే ఖజానా నిండిపోవడం ఖాయమని సలహా ఇచ్చారట మంత్రిపుంగవులు. అంతే ఆ రాజు వెంటనే జుత్తు పన్నును ఆచరణలోకి తెచ్చేశారు. జుత్తు పెంచుకున్నా పన్ను కట్టాలా…అంటూ జనంలో వ్యతిరేకత వచ్చింది. అయినా రాజును ఏం చేయగలరు? భరించారు. ఉగాండా ప్రభుత్వం పరిస్థితి అచ్చం ఆ రాజులాగే ఉంది. ఆయన జుత్తుపై పన్ను వేస్తే….ఈయన సామాజిక మాధ్యమాలపైన పన్ను విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది కూడా. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ తదితర సోషల్‌ మీడియా యాప్స్‌ను వాడుతున్నవారి నుంచి సోషల్‌ మీడియా టాక్స్‌్‌ విధించడం మొదలయింది. ఆ దేశంలో 22 శాత మంది మాత్రమే ఇంటర్నెట్‌ వాడుతున్నారు. సోషల్‌ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యెవేరి ముసవేని అంటున్నారు. సోషల్‌ మీడియాకు దాసోహం అయిపోతున్న యువతను కట్టడి చేయడానికే పన్ను ప్రవేశపెట్టారని చెబుతున్నా…దేశాధ్యక్షుడు మాత్రం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోడానికే ఈ కొత్త పన్ను అమల్లోకి తెచ్చామని చెబుతున్నారు. ఆ దేశ టెలికం రెగ్యులేటరీ అథారిటీ కూడా పన్ను వేయమని సలహా ఇచ్చిందట. సోషల్‌ మీడియా యాప్స్‌ వాడేవాళ్లు రోజుకు 200 ఉగాండా షెల్లింగులు చెల్లించాలని నిర్ణయించారట. మన కరెన్సీలో చూస్తే రూ.3.56 అవుతుంది. అంటే నెలకు రూ.106 చెల్లించాలన్నమాట.

ఆదాయం పెంచుకోడానికి అన్ని దేశాలూ సోషల్‌ మీడియా వినియోగదారులపై పన్నులు విధిస్తే… ప్రభుత్వ ఖజానా నిండిపోతుంది. డబ్బులకు కొదవే వుండదు. సోషల్‌ మీడియాకు బానిసలైపోయిన వారు నెల పన్ను చెల్లించయినా వాడుకోకతప్పదు. ప్రపంచ వ్యాపితంగా సోషల్‌ మీడియాను నియంత్రించడానికి పాలకులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియా వచ్చిన తరువాత ప్రజలు తమ భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించగలుగుతున్నారు. ప్రధాన స్రవంతి మీడియాను గుప్పెట్లో పెట్టుకున్నా సోషల్‌ మీడియాను ఏమీ చేయలేకున్నారు. అందుకే ఏదో ఒకపేరుతో దాన్ని నియంత్రిం చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో వెనకడుగు వేస్తున్నారు. ఉగాండాలో జరిగిందీ ఇటువందే అనుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*