బంగాళాఖాతంలో భూమి చీలిందట…విశాఖకు ప్రమాదం పొంచివుందట… ఈ వార్తపై అనుమానాలు!

బంగాళాఖాతంలో భూమి 300 కిలోమీటర్ల మేర నెర్రి చీలిందట, దీనివల్ల విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా ఉత్తరాంధ్రకు పెను ప్రమాదం పొంచివుందట, భూకంపం …సునామీ వంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయట. ఈనాడు లో ప్రచురితమైన కథనం సారాంశం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి భూమి వైపు నుంచి సముద్రంలోకి మట్టి కొట్టుకెళ్లి, కిలోమీటర్ల కొద్దీ మేట వేసిందట…ఇదే ఇప్పుడు నెర్రెలు చీలిందట. దీనివల్ల ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారట. ఈ మేరకు ఓ సైన్స్ జర్నల్ లో వ్యాసం ప్రచురితమైనదట.

ఈ పరిశోధనకు ఏమాత్రం శాస్త్రీయత ఉందో, ఇది ఎంత వాస్తవమో ఎంత అవాస్తవమో తెలియదుగానీ… రాజధాని అంశం పై చర్చ జరుగుతున్న సమయంలో ఈ కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు గవర్నర్ వద్ద ఉన్న సమయంలో ఇటువంటి కథనం ప్రచురించడంపై వైసిపి శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అమరావతినే రాజధాని కొనసాగించాలని చెబుతోంది.

విశాఖపట్నంలో రాజధాని ప్రతిపాదన వచ్చిన మొదటి రోజు నుంచి ఆ నగరానికి వ్యతిరేకంగా అనేక కథనాలు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో వస్తున్నాయి. విశాఖపట్నం పారిశ్రామిక కేంద్రం అయినందువల్ల అది రాజధానిగా ఉపయోగపడదన్న వాదన తెరపైకి తెచ్చారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల వరుసుగా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలుగుదేశం కుట్రలో భాగమే అని వైసిపి ఆరోపిస్తోంది.‌

ఇప్పుడు సముద్రంలో నెర్రులు, భూకంపాలు, సునామీ‌ ఇవన్నీ కూడా కుట్రలో భాగమే అని చెబుతున్నారు. అదీ బిల్లు గవర్నర్ వద్ద ఉన్న సమయంలో ఇటువంటి ప్రచారం చేయడంలో దురుద్దేశం ఉందని అంటున్నారు. – ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*