బడా బాబుల ఇళ్లకు టిటిడి అర్చకులు! అధికారులే సారథులు!!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై దేవాదాయ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి సీరియస్‌ అయ్యారు. ఆయన హద్దులు దాటుతున్నారని అన్నారు. దీక్షితులుపైన అనేక ఆరోపణలున్నాయని, ఆరాతీసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విఐపిలు వచ్చినపుడు అతిథిగృహాలకు వెళ్లి ఆశీర్వదిస్తారన్నది కూడా రమణ దీక్షితులుపై కెఇ చేసిన ఒక విమర్శ. ఆశీర్వదించడం అనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తే…చాలా విషయాలు బయటికొస్తాయి. శ్రీవారికి అర్చన చేయాల్సిన అర్చకులను రాజకీయ నాయకులు, సినీనటులు, బోర్డు సభ్యులు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు పిలిపించుకుని, వారితో పూజాదికాలు చేయించుకోవడం లేదా…అనేది ప్రశ్న. పెళ్లిళ్లు, వివాహ రిసెప్షన్లు, పుట్టిన రోజు వంటి కార్యాలకు టిటిడి అర్చకులను పిలిపించుకోవడం పరిపాటిగా మారిపోయింది. టిటిడి ఉన్నతాధికారులే అర్చకుల బృందాన్ని తీసుకెళ్లి, ఆశీర్వచనాలు అందజేసి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సమర్పించి వస్తుంటారు. చాలా మంది ప్రముఖుల ఇళ్లలో జరిగిన శుభ కార్యాల సిడీలను పరిశీలిస్తే ఈ దృశ్యాలు కనిపిస్తాయి.

ఇక ఎవరైనా దేవుడి దగ్గరకు రావడం ఆనవాయితీ. స్వామి భక్తిని చాటుకునేందుకు టిటిడి అధికారులు….తిరుమలలో పనిచేసే అర్చకులను తీసుకెళ్లి ఆశీర్వచనాలు ఇప్పిస్తుంటారు. ముఖ్యమంత్రి ఇంటికి అర్చకులు తరచూ వెళుతుంటారు. మొన్న ఉగాది రోజు టిటిడి అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించి వచ్చారు. ఈ సంస్కృతిని ఇప్పుడు అన్ని దేవాలయాలకు పాకుతోంది. శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు ఇటీవల స్థానిక ఎంఎల్‌ఏ బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆశీర్వచనాలు అందించి వచ్చారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ జన్మదినం రోజున శ్రీకాళహస్తి ఆలయ ఈవో అర్చకులను చిత్తూరుకు తీసుకెళ్లి ఆశీర్వచనాలు అందజేసి వచ్చారు. ప్రముఖ ఆలయాల అర్చకుల తమ ఇళ్లకు వచ్చి ఆశీర్వచనాలు అందించం హోదాకు చిహ్నంగా భావిస్తున్నవారు ఉన్నారు. రమణ దీక్షితులు చేసిన తప్పేగానీ…మరి అధికారులే అర్చకులను తీసుకెళ్లి విఐపిల ఇళ్ల ముందు సాగిలపడుతున్నారే…అదీ..!


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*