బలహీనులపైనే పరిపూర్ణానంద ప్రతాపం!

కత్తి మహేష్‌ ఏదో అన్నారని పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహం పేరుతో ఆందోళనకు దిగారు. ఆయన్ను శాంతింపజేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించింది. పరిపూర్ణానంద స్వామి ఆ మధ్య కంచె ఐలయ్యతోనూ ఘర్షణకు దిగారు. తాను స్వామీజీనని మరచి దూషలకు పూనుకున్నారు. కత్తి మహేష్‌ వల్ల జనం మధ్య చిచ్చు రగులుకుంటోందని చెబుతూ పోలీసులు, ప్రభుత్వ పెద్దలు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. నిజంగా జనం మధ్య విభేదాలు రాజేస్తున్నది ఎవరు? ప్రశాంతంగా ఉన్న చోట ఏదో ఒక అలజడి సృష్టించాలని నిత్యం ప్రయత్నిస్తున్నది ఎవరు? ఈ వివాదాల్లో పరిపూర్ణానంద స్వామి పాత్ర ఏమిటి? అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రశాతంగా ఉంది. తిరుపతిలో ఎలాంటి మత విద్వేషాలూ లేవు. అటువంటి చోట…అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉన్నారంటూ గొడవలు సృష్టించే ప్రయత్నం చేసింది ఎవరు? తిరుపతిలో ఏమి జరుగుతోందో స్థానికులు బాగా తెలుసుకాబట్టి…ఆయన లేవనెత్తిన అంశాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక వకులామాత ఆలయం పేరుతో నానా హడావుడీ చేశారు. ఆపై చంద్రగిరి సమీపంలోని మదరసాను వివాదాస్పదం చేస్తూ ప్రకటనలు చేశారు. తిరుపతిలో అలజడి సృష్టించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నది పరిపూర్ణానందే అనేది సుస్పష్టం. అదేవిధంగా కంచె ఐలయ్య పుస్తకం రాస్తే…ఆ వివాదంలోకి జొరబడి, ఆయనపై క్రైస్తువుడని ముద్రవేసి, వివాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేసిందీ ఈ స్వామీజీనే. ఇప్పుడు కత్తి మహేష్‌ వ్యవహారాన్ని అందుపు చ్చుకున్నారు. దీన్ని రగిలించి, రచ్చచేసేందుకు తహతహలాడుతున్నారు. ఎవరు మాట్లాడినా…వాళ్లపైన అన్యమతస్తులని, విదేశీ కుట్రలలో పావులని ముద్రవేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

అన్ని సందర్బాల్లోనూ ఇదే ధోరణితో వ్యవహరించరు. రాజకీయాలను అనుగుణంగా ఆయన ప్రవర్తన ఉంటుంది. బలవంతుల జోలికి వెళ్లరు. ఉదాహరణకు…టిటిడి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను నియమించడంపై పెద్ద చర్చ జరిగింది. శివస్వామి వంటి వారు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను వ్యతిరేకించి, టివి ఛానళ్లలో సిఎం రమేష్‌ వంటి వాళ్ల దూషణలకు గురయ్యారు. ఇది పెద్దలతో, రాజకీయాలతో కూడకున్న వ్యవహారం కాబట్టి పరిపూర్ణానంద స్పందించరు. కనీసం చిన్న ప్రకటన కూడా చేయలేదు. సిఎం రమేష్‌ ఏక వచనంతో మాట్లాడి శివస్వామిని బహిరంగంగా కించపరచినా ఈ స్వామీజీకి బాధ కలగలేదు. చూసీచూడనట్లు ఉండిపోయారు. అంతెందుకు….తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని, పోటులో తవ్వకాలు జరిగాయని, ఆభరణాలు కనిపించలేదని సాక్ష్యాత్తు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే ఆరోపణలు చేశారు. దీంతో దీక్షితులను ఆగమేఘాలపై ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. కానీ మాటమాత్రంగానైనా దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకంటే…రమణ దీక్షితులుకు అనుకూలంగా మాట్లాడితే…ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అవుతుంది. అందుకే దాని జోలికి వెళ్లలేదు. ఆఖరికి కొందరు మఠాధిపతులు చొరవ తీసుకుని తిరుపతిలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొన్న పరిపూర్ణానంద కనీసం ప్రెస్‌మీట్‌ దాకా కూడా ఉండదు. ప్రెస్‌తో విడిగానూ మాట్లాడలేదు. అదే అన్యమత ఉద్యోగులున్నారంటూ లెక్కలేనన్ని సార్లు మాట్లాడారు. అంటే కత్తి మహేష్‌, కంచె ఐలయ్య, చిరు ఉద్యోగులు వంటి బలహీనులపై తప్ప….బలవంతులు ఏమి చేసినా నోరు విప్పలేరనేందుకు ఇంతకన్నా ఉదాహరణలు అవసరమా?

ఉత్తరప్రదేశ్‌లో యోగి లాగా ఆంధ్రప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రి అయిపోవాలని పరిపూర్ణానంద కలలు కంటున్నారన్న వార్తలు గతంలోనే గుప్పుమన్నాయి. ఏ చర్య చేపట్టినా ఆ రాజకీయ లక్ష్యానికి అనుగుణంగానే చేస్తున్నారనేది బహిరంగ సత్యం. పరిపూర్ణానంద ప్రవచనాల కంటే రాజకీయ ఉపన్యాసాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్వామీజీలు, మఠాధిపతులు రాజకీయాలు చేయాలంటే చేసుకోవచ్చు. అయితే…అందుకు మతాన్ని అడ్డుపెట్టుకోవాలని అనుకోవడమే అభ్యంతరకరం. ప్రభుత్వాలు బయటకు చెప్పకపోవచ్చుగానీ…తిరుపతి కేంద్రంగా అలజడి సృష్టించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో ప్రభుత్వం వద్ద ఇంటలిజెన్స్‌ నివేదికలు లేకపోలేదు. ఏదోఒక రోజు ఆ నివేదికలు బయటపెట్టాల్సిన అనివార్యత ప్రభుత్వానికీ ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో తేటతెల్లమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*