బాగుంది..బాగుంది….బాబుగారి…ధర్మపోరాట దీక్షకు ప్రభుత్వ సొమ్ములు!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జన్మదినమైన ఈ నెల 20వ తేదీన విజయవాడలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నారు. దీనికి ధర్మ పోరాట దీక్ష అని పేరు కూడా పెట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా 175 నియోజకవర్గాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు దీక్షలు చేస్తారు. దీక్షలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరుగానీ… దీక్షలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి ఖర్చు చేస్తుండటమే విమర్శలకు తావిస్తోంది. విజయవాడలో సిఎం దీక్ష చేసే ఇందిరాగాంధీ మైదానంలో వేదికపై 150 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కింద 10 వేల మంది కూర్చూడానికి అనుకూలంగా వసతులు కల్పిస్తున్నారు. దీక్షా స్థలికి బయట గుడారాలు వేస్తారు. ఇంతేకాదు..రాష్ట్ర వ్యాపితంగా ఈ దీక్షను తిలకించడానికి భారీ ఎల్‌ఇడి తెరలు వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఖర్చుమొత్తం సమాచార శాఖ పెడుతుందట. సిఎం దీక్ష వేదిక ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు చూస్తారట. అంటే జిల్లాల్లో జరగబోయే దీక్షల వేదిక ఏర్పాట్లు ఖర్చులూ ప్రభుత్వాలే భరించాలన్నమాట. ఈ దీక్షకు ప్రభుత్వ సొమ్ములు ఎన్ని కోట్లు ఖర్చవుతాయో చెప్పలేం.

తెలుగుదేశం పార్టీ అధినేతగా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీక్ష చేస్తున్నారని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఆ దృష్టితోనే ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడానికి పూనుకున్నట్లున్నారు. ప్రభుత్వ నిధులతో దీక్షలు చేపడుతూ….రాష్ట్రంలోని ప్రతిపక్షాలను విమర్శించే నైతిక అర్హత ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు ఉంటుందా? ఈ దీక్షల్లో వైసిపిని, పవన్‌ని, వామపక్షాలను విమర్శించకుండా మాట్లాడుతారా? బంద్‌ చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని ముఖ్యమంత్రి స్వయంగా విమర్శించారు. అలాంటప్పుడు సిఎం దీక్షకు ప్రభుత్వ నిధులు వ్యయం చేయడంలో ఔచిత్యం ఉంటుందా? అధికార పార్టీ ప్రత్యేక హోదా పేరుతో నిర్వహించే సభలన్నింటికీ ప్రభుత్వ నిధులే ఖర్చు చేస్తారా? ప్రధాన మంత్రి కూడా ఒక రోజు దీక్ష చేశారు. ఆయన తన కార్యాలయంలో పనిచేసుకుంటూ దీక్ష చేపట్టారు. దానికి ఇంత హడావుడి చేయలేదు. భారీగా హడావుడిగా చేయాలనుకుంటే….పార్టీ డబ్బులు ఖర్చుచేసుకుని ఎలాగైనా నిర్వహించుకోవచ్చు.

ధర్మ పోరాట దీక్షకు అన్ని పార్టీలూ రావాలని తెలుగుదేశం నాయకులు పిలుపునిస్తున్నారు. ఆలాంటి వాతావరణం రాష్ట్రంలో ఉందా? వైసిపిఎ ఎంపిలు ఢిల్లీలో దీక్ష చేశారు. తెలుగుదేశం ఎంపిలు వారికి మాటమాత్రంగానైనా సంఘీభావం ప్రకటించారా? రాష్ట్రంలో బంద్‌ నిర్వహిస్తే….తెలుగుదేశం పార్టీగా నేరుగా పాల్గొనకపోయినా….సంఘాభావం క్రటించలేదు. అఖిలపక్ష సమావేశానికే రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ వెళ్లలేదు. అలాంటిది సిఎం ధర్మ పోరాట దీక్షకు వెళుతాయా? అక్కడికి వచ్చి రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో టిడిపికీ భాగస్వామ్యం ఉందని విమర్శలు చేస్తే టిడిపి నాయకులు అంగీకరిస్తారా? అన్ని పార్టీలూ కలిసి ఆందోళన చేసే వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీగా తెలుగుదేశం విఫలమయింది. ఇప్పుడు దీక్షలకు, అఖిల పక్షానికి రమ్మని పిలవడంలో ఉద్దేశం….వాళ్లు రావాలనుకోవడం కంటే…పిలిచినా రాలేదని చెప్పుకోడానికి మాత్రమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*