బాబుకు అడ్డుగోడలా ఎల్.వి.సుబ్రహ్మణ్యం..!

*టిడిపి విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్న పరిణామాలు. రాష్ట్రంలో చల్లారని రాజకీయ వేడి.*

ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే ప్రస్తుతం సంభవిస్తున్న పరిణామాలు టిడిపితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
పోలింగ్ రెండు రోజులు వుందనగా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి నిధులు విడుదల అయ్యాయని, రైతులు బ్యాంకులకు వెళ్లి తమ వద్దవున్న బాండ్లు సమర్పించాలని ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో రైతులు పోలో మని బ్యాంకుల వద్ద బారులు తీరారు. కాని కొన్ని బ్యాంకులు సానుకూలంగా వ్యవహారించినా ఎక్కువ సందర్భాల్లో రైతులు కంగుతిన్నారు. పోలింగ్ జరిగిపోయింది. కాని బాండ్లు తీసుకున్న బ్యాంకులు కూడా రుణ మాఫీ చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాలేదు. ఎన్నికల్లో రైతులను మభ్య పెట్టేందుకు ఉత్తుత్తి ప్రకటన చేశారని తేలి పోయింది. ఎన్నికల్లో గెలుపొందినా లేక ఓటమి చెందినా భవిష్యత్తులో తమ మాటలను రైతులు నమ్మరనే భయం టిడిపి అధినేతను పట్టు కొంది.

మరో వైపు రాష్ట్రం మొత్తం మీద రైతులు తాము మళ్లీ మోసపోయామనే భావించారు. వాస్తవంలో కూడా ఇందుకు అవసరమైన నిధులు విడుదల కాలేదు. 4వ విడత రుణ మాఫీ జరగాలంటే 3,900 కోట్ల రూపాయలు అవసరం కాగా ప్రభుత్వం మాత్రం 500 కోట్లే విడుదల చేసింది.
పోలింగ్ ముగిసి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి నిధులు వచ్చే జాడ కనిపించడం లేదు.

రాష్ట్రం మొత్తం మీద రైతులకు వాస్తవాలు తెలిశాయి. టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు భావించితే విశ్వసనీయత గంగలో కలిసి పోయే ప్రమాదముందని టిడిపి అధిష్టాన వర్గానికి గంగ వెర్రులెత్తాయి.
గమనార్హమైన అంశమేమంటే ఆ పాటికే ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి కి మధ్య ఏర్పడిన తగాదాలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ కావడం అంతేకాకుండా కొత్తగా యల్ వి సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శిగా వచ్చి వున్న నేపథ్యంలో పోలింగ్ తదుపరి మున్ముందు సంభవించనున్న పరిణామాలను గ్రహించిన ముఖ్యమంత్రి ఎన్నికల సంఘానికి, అది నియమించిన కొత్త ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా తన పోరాటం మరింత విస్తృతం చేశారు.

పోలింగ్ తదుపరి కొత్త ప్రధాన కార్యదర్శి తన పట్ల అనుసరించే వైఖరిని ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి అతనితో వ్యక్తి గత తగాదా లేకున్నా విమర్శల దూకుడు పెంచారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రి వర్గంకు మధ్య తీవ్ర అఘాథం ఏర్పడింది. ఫలితంగా ముందుగానే ముఖ్యమంత్రి ఊహించినట్లు ఎన్నికల వాగ్దానాలు అమలుకు వచ్చే అవకాశాలకు తెర పడింది. అంతేకాదు. ఒక వేళ ఎన్నికల్లో ఓటమి చెందితే అవసరమైన విధంగా ఇల్లు చక్కబెట్టు కొనేందుకు పైగా అనుయాయుల అవసరాలు తీర్చేందుకు కొత్తగా వచ్చిన ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి అడ్డు గోడగా వుంటున్నాడు. ఇది మరీ పుండుపై కారం రాసినట్లయింది.

ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి కాగానే ప్రభుత్వ నిధుల విడుదల పద్ధతి పూర్తిగా మారిపోయింది. అదే పాత కార్యదర్శి వుండి వుంటే నిధులు విడుదల ఇలా వుండేది కాదు. ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా నిధులు మంజూరు అయ్యేవి. ఈ అవాంతర పరిస్థితి ఏర్పడటంతో ఎన్నికల గండం గడచి పోయినా లక్షలాది మంది రైతులు ప్రభుత్వం మీద అగ్గిలో గుగ్గిలం అవుతున్నారు. ఈ ప్రమాదం విశ్వరూపం దాల్చే కొద్ది నూతన ప్రధాన కార్యదర్శిపై టిడిపి నేతల దాడి ఎక్కువౌతోంది. యల్వి సుబ్రమణ్యం ఎన్నికల నిర్వహణ సమీక్ష చేసినా టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. వాస్తవంలో ఈ అంశం టిడిపి కి ఏ విధంగానూ అపకారం కలిగించ కుండా వున్నా సమయం సందర్భం లేకుండా విమర్శలు చేస్తున్నారంటే ప్రభుత్వ నిధులు విడుదల ముఖ్యమంత్రి చేతి నుండి జారి పోవడమే.

దీనికి తోడు నిధులు విడుదల అయిన ఇతర పథకాల అంశంలో కూడా కొన్ని జిల్లాల్లో బ్యాంకులు లబ్దిదారులకు చుక్కలు చూపించడం అగ్నికి గాలి తోడయినట్లయింది. వాస్తవం చెప్పాలంటే నేడు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగానికి, మంత్రివర్గానికి మధ్య పూర్తిగా సంబంధాలు తెగి పోయాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే ముఖ్యమంత్రి గాని టిడిపి నేతలు గాని ఎంత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరు చాలా హుందా వుంది. ఫలితంగా టిడిపిది షాడో బాక్సింగ్‌గా మిగిలి పోతోంది.

ఈ అంశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటనలు కూడా హుందాగా లేవు. ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులు విడుదలలో మంత్రి వర్గ నిర్ణయాలను తిరగ తోడటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అత్యవసరాలకు ప్రయారిటీ బట్టి నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. . కాని మంత్రికి గాని టిడిపి నేతలకు గాని ఇవేవీ పట్టడం లేదు. ఉద్యోగులకు జీతాలు లేక పోయినా ఫర్వాలేదు. పాత బకాయిలు చెల్లించక పోయినా బాధ లేదు. తమ పార్టీ పరువు నిలుపు కొనేందుకు తమ వారి బిల్లులు కోసం అన్నీ పక్కన పెట్టి రుణ మాఫీకి నిధులు విడుదల చేస్తే చాలు. ఈ స్వార్థం దాచుకొంటూ మంత్రి వర్గ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రశ్నించే హక్కు లేదనే వాదనకు దిగుతున్నారు.

ఈ రగడ ఇంతటితో ఆగేలా లేదు. ఒక వేళ రాష్ట్రంలో టిడిపి ఓటమి చెంది (పాపం శమించు గాక) వేరే పార్టీ అధికారం లోనికి వస్తే….గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రగడ ముందుగా పెద్ద ఎపిసోడ్ కానున్నది.

ప్రధానంగా కొత్తగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభం కాకనే ఎన్నికల అవసరాలకు విడుదల చేసిన మొబలైజేశన్ అడ్వాన్సులు ఒక పెద్ద స్కామ్ అవుతుందేమో.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*