బాబుకు కోర్టు నోటీసులు…బిజెపి కుట్రనా?….సొంత డ్రామానా?

ముఖ్యమంద్ర చంద్రబబు నాయుడికి మహారాష్ట్రలోని ధర్మబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు ఇవ్వడంతో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. నాయకులంతా ఈ అంశంపైనే మాట్లాడుతున్నారు. సినీ నటుడు శివాజీ చెబుతున్న ఆపరేషన్‌ గరుడలో భాగంగానే ఈ నోటీసులు వచ్చాయని, తమ నాయకుడిని ఇబ్బంది పెట్టడానికి బిజెపి కుట్రలు చేస్తోందని టిడిపి నాయకులు వరుసబెట్టి మాట్లాడుతున్నారు. తెలంగాణలో నిరసన ధర్నాలు కూడా చేస్తున్నారట. కోర్టు నోటీసులను అడ్డుపెట్టుకుని టిడిపి రాజకీయ డ్రామా ఆడుతోందని బిజెపి విమర్శిస్తోంది. తెలంగాణలో ఓట్లు దండుకోడానికే ఈ నాటకం ఆడుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

కోర్టు వాయిదాలకు హాజరుకాకుంటే కోర్టులు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయడం సహజమే. వెంటనే కోర్టుకు వెళ్లి ఇకపై వాయిదాలకు విధిగా హాజరవుతానని న్యాయమూర్తికి చెబితే…ఆ వారెంట్‌ను రద్దు చేస్తారు. అయితే…2010లో నమోదైన కేసులో ఒకసారి కూడా నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు ఇచ్చారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకసారి కేసు కోర్టు గుమ్మం తొక్కాక….సాధారణంగా జరగాల్సిన పక్రియలు జరిగిపోతాయి. కేసులోని ముద్దాయిలకు నోటీసులు పంపుతుంది. నోటీసులు అందుకున్న ముద్దాయిలు న్యాయవాదిని నియమించుకుని, తమ వాదనలు వినిపిస్తారు. నోటీసులే రాలేదని టిడిపి నేతలు చెబుతున్నదాంట్లో వాస్తవమెంతో తెలియదు. కోర్టుకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు ఇవ్వకుండా ఒకేసారి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ చేసివుంటే….హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ న్యాయమూర్తి చిక్కుల్లోపడుతారు. ప్రాథమిక నోటీసులు ఇవ్వకపోవడమే ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 22 వాయిదాలకు హాజరుకాకపోవడంతోనే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇక బిజెపి కుట్ర కోణంలో ఈ నోటీసులను పరిశీలిస్తే….వాయిదాలకు హాజరుకానందున కోర్టు ద్వారా నాన్‌ బెయిలబుల్‌ వారెంటు ఇప్పించడం వల్ల బిజెపి ఆశిస్తున్నదేమీ జరగదు. ఎందుకంటే….ఇటువంటి కేసుల్లో వాయిదాకు హాజరైన వెంటనే కేసును రీకాల్‌ చేస్తారు. ఒకవేళ అరెస్టు చేసినా…వెంటనే బెయిల్‌ ఇస్తారు. ఇంత చిన్న వ్యవహారం కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని అనుకోలేం. నిజంగా బాబుపైన కేసులు పెట్టాలనుకుంటే….అనేకమైన అంశాలు ఉన్నాయి. ఏ అంశంపైనైనా సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు. అటువంటి వాటిని విడిచిపెట్టి కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి బాబును ఇబ్బందిపెట్టాలని బిజెపి అనుకుంటుందని భావించలేం.

ఈ వ్యవహారంలో మరో చర్చ కూడా జరుగుతోంది. తెలుగుదేశం నాయకులే కోర్టు నుంచి నోటీసులు వచ్చేలా చేసి, దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బాబ్లీ ప్రాజెక్టును ఆనాడు అడ్డుకోడానికి ప్రయత్నించామని, ఇటువంటి కేసులో తమను ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం చేసుకోవడం కోసం నోటీసుల డ్రామా ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. ఈ డ్రామాలో భాగంగానే వారం రోజులు ముందు శివాజీతో ప్రెస్‌మీట్‌ పెట్టించి…ఆపరేషన్‌ గరుడలో భాగంగా ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వబోతున్నారని చెప్పించారని అంటున్నవారూ ఉన్నారు.

ఈ నోటీసుల వ్యవహారంలో టిడిపి శ్రేణలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. బాబును అరెస్టు చేస్తే రణరంగం అవుతుందని బెదిరింపులకు దిగుతున్నారు. కోర్టుకు హాజరుకాకుంటే….అరెస్టు చేసి తీసుకెళడం సహజం. న్యాయ ప్రక్రియకు ఎవరైనా కట్టుబడాల్సిందే. అలాకాకుండా కోర్టునే సవాలు చేసేలా మాట్లాడటం న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. ఈ నెల 21వ తేదీలోపు బాబును హాజరుపరచాలని ధర్మబాద్‌ కోర్టు నాందేడ్‌ పోలీసులను ఆదేశించింది. అప్పటి దాకా ఆగాల్సిన అవసరం లేకుండా రేపు ఉదయమే….చంద్రబాబు తన న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరై…కేసును రీకాల్‌ చేసుకోవచ్చు. మరి చంద్రబాబు ఆ పని చేస్తారా…లేక ఇంకొంత రచ్చకావడానికి కోర్టుకు వెళ్లడానికి నిరాకరస్తారా…అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*