బాబుగారిది….అభద్రతా…ముందు జాగ్రత్తా..!

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే అభద్రతా భావనతో కూడిన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బిజెపితో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తనపై కక్షసాధింపునకు పూనుకుంటుందని ఆయన చెప్పారు. కర్నాకట ఎన్నికల తరువాత రాష్ట్రంపైన దృష్టిపెట్టే అవకాశాలున్నాయని అంటూ వచ్చారు. ప్రభుత్వానికిగానీ, వ్యక్తిగతంగా తనకుగానీ ఏదైనా కీడు తలపెడితే…అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఆ విధంగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తరువాత అలాంటి వ్యాఖ్యలు చేయడం మానేశారు.

ఇదిలావుండగా…ఈ క్రమంలోనే రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ విభాగంలో భారీ మార్పులు చేపట్టారట. రాష్ట్ర వ్యాపితంగా, అన్ని కీలక స్థానాల్లో, అన్ని స్థాయిల్లో తన సామాజిక తరగతికి చెందిన అధికారులను, సిబ్బందిని నియమించారట. డిజిపి మాలకొండయ్యకు మాటమాత్రం గానైనా చెప్పకుండా, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో చర్చించి ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. ఇంటలిజెన్స్‌లో విభాగంలో ఉన్న కొన్ని సామాజిక తరగతులకు అధికారులను, సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ఇంటిలిజెన్స్‌ విభాగంలో సమర్థులైన అధికారులను నియమించుకోవాలి తప్ప… తమ సామాజిక తరగతికి చెందిన వారినే నియమించుకోవడంలోని ఆంతర్యం ఏమిటనేది ప్రశ్న. ఇది ముందుచూపు కంటే అభద్రతను పట్టిచూపుతుంది. ఎవరినీ నమ్మలేని ఒక భయానికి ప్రతీకగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి తీరుపట్ల డిజిపి మాలకొండలయ్య మనస్తాపంతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ‘నన్ను డిజిపిగా నియమించమని కోరలేదు. మీరే నియమించారు. ఇప్పుడు నన్ను అవమానించేలా వ్యవహరిస్తున్నారు’ అని ముఖ్యమంత్రితో సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా తన సామాజిక తరగతికి చెందిన వారే అని స్థానాల్లో ఉండాలనుకోవడం పొరపాటు అవుతుంది. దీనివల్ల పక్షపాతంతో కూడిన నివేదికలో తప్ప నిష్పక్షపాత, వాస్తవ నివేదికలు ప్రభుత్వానికి అందకపోవచ్చు. తుదిగా నష్టపోయేది ప్రభుత్వమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*