బాబుగారి మనసు వెన్నపూస..!

అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పిలుపు మేరకు సోమవారం భారత్‌ బంద్‌ జరిగింది. బంద్‌ల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని వాదిస్తూ, బంద్‌లు చేసేవారిని నిర్భంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యకర్తలు కూడా ఈ బంద్‌లో పాల్గొనడం విశేషం. బంద్‌ సంగతి అలావుంచితే….రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు రూ.2 తగ్గిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. ఇదే సందర్భంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నా కాసింత కూడా కనికరం చూపలేదంటూ బిజెపిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

పెట్రో ధరలను రూ.2 తగ్గించినందుకు ముందుగా ముఖ్యమంత్రిని అభినందించాలి. ఆ మాత్రం కూడా తగ్గించని బిజెపికి అభిశంసించాల్సిందే. అయితే…ఇక్కడ అసలు విషయం పక్కకుపోతోంది. పెట్రోలు ధరలనూ జిఎస్‌టి పరధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ ఉంది. అలా చేయగలిగితే….ధరలు దాదాపు సగం తగ్గుతాయి. లెట్రిన్‌ పేపర్‌ నుంచి బంగారం దాకా ప్రతిదాన్ని జిఎస్‌టిలో చేర్చిన కేంద్రం…పెట్రోలును ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తే…రాష్ట్రాలు అంగీకరించడం లేదని బిజెపి నేతలు చెబుతున్నారు. ఇక్కడ ఇప్పుడు చర్చించాల్సిన అంశం ఇదే.
పెట్రోలు ధరలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డిమాండ్‌ చేయడం లేదు. చంద్రబాబు నాయుడు ఆ డిమాండ్‌ను ముందుకు తెస్తే బిజెపి పాలిత రాష్ట్రాలను కూడా ప్రశ్నించడానికి వీలవుతుంది. అందరూ దొంగలే అన్నట్లు…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పెట్రోల్‌పై పన్నులను తగ్గించడానికి సిద్ధంగా లేవు. అందుకే జిఎస్‌టి అనగానే ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ తప్పించుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది పెట్రోలు ధరలను వెంటనే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేయడమే.

మరో అంశం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. నిన్నమొన్నటి దాకా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. 2014లో లీటరు పెట్రోలు ధర రూ.49.60 ఉంటే ప్రస్తుతం రూ.86.71 అయింది. ఈ నాలుగేళ్లలో అనేక పర్యాయాలు పెట్రోలు ధరలు పెరిగా మాటమాత్రంగానైనా చంద్రబాబు ఖండించిన దాఖలాలు లేవు. కేంద్రం ధరలు పెంచేకొద్దీ…ఆ మేరకు రాష్ట్రానికి పెరుగుతున్న పన్నులను వసూలు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, బిజెపితో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పెట్రో ధరలపై హడావుడి చేస్తూ…నామమాత్రంగా రూ.2 తగ్గించారు. ఏమైనా బాబుగారి మనసు వెన్నపూసే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*