బాబుగారి వాదన ప్రకారం….టిడిపి భారతదేశంలో పోటీ చేయడానికి వీల్లేదు!

తెలుగు సినీ హీరో ప్రభాష్‌తో సంబంధం అంటగడుతూ…సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న అనైతిక ప్రచారంపై వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరికొందరు తెలుగుదేశం నాయకులు స్పందించారు.

జగన్‌ మోహన్‌ రెడ్డిపై కోడికత్తి దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తెలంగాణకు వెళ్లి అక్కడి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. జగన్‌ సోదరి షర్మల కూడా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేనివాళ్లు….ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఎలా పోటీ చేస్తారు? అంటూ ప్రశ్నించారు.

ఈవాదన అసంబద్ధమైనది. అర్థంలేనిది. షర్మిల కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నది. అందులోనూ ఇది ఇంటర్నెట్‌కు సంబంధించిన నేరం. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ పోస్టింగులు ప్రపంచంలో ఎక్కడి నుండయినా చేసివుండొచ్చు. అందుకే ఆమె హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయినా…ఓ మహిళపై హేయమైన ప్రచారం జరుగుతుంటే దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందిపోయి…ఏవో వాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసులో నిందితులను పట్టుకోడానికి అవసరమైతే ఏపి పోలీసులు పూర్తిగా సహకరిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించివుంటే హుందాగా ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇక పోటీ అనే అంశానికి వస్తే….పోలీసులపై నమ్మకం లేదని చెప్పినంత మాత్రమే…. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేయకూడదా? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐపైనగానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)పైనగానీ, జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్‌ఐఏ)మీదగానీ నమ్మకం లేదని పదేపదే చెబుతున్నారు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ భారత దేశంలో ఎలా పోటీ చేస్తుందని మోడీ అడిగితే అర్థముంటుందా?

అయినా…నిష్పక్షపాతంగా పని చేయాల్సిన వ్యవస్థలు పాలకులకు కొమ్ముగాస్తూ పని చేస్తున్నాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. సిబిఐ వంటి సంస్థలను కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో…రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థలనూ ఆయా ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వాడుకుంటున్నాయన్నది అంతే వాస్తవం. సిబిఐపై తమకు నమ్మకం లేదని బాబు చెప్పడం ఎంత సమంజసమో…రాష్ట్ర పోలీసులపై తమకు విశ్వాసం లేదని జగన్‌ చెప్పడంలోనూ అంతే సంమంజసం ఉంది. అంతమాత్రం దానికి వైసిపి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పోటీ చేస్తుందని టిడిపి అడగడంలో అర్థం లేదు. అదే ప్రశ్న టిడిపికి ఎదురయితే…ఏమని సమాధానం చెబుతుంది..!?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*