బాబుగారూ…అయ్యో…అయ్యో…అయ్యయ్యో..!

దాదాపు 10 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయింది. వరుసగా రెండు పర్యాయాలు టిడిపి ఓడిపోడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు విధానాలను నెత్తికెత్తుకున్న చంద్రబాబు నాయుడు, సంస్కరణల పేరుతో విద్యుత్‌ ఛార్జీల నుంచి నీటి తీరువా దాకా అన్నీ పెంచడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలపైన మోయలేని భారాలు మోపారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురయింది. ఛలో హైదరాబాద్‌ కార్యక్రమంలో పోలీసు కాల్పుల్లో ఉద్యమ కారులు నలుగురిని పొట్టనపెట్టుకున్నారు. ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని రగిల్చాయి. ఇదే సమయంలో 2003 ఆఖరులో చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టులు హత్యాయత్నం చేశారు. ప్రజల్లో తనపై వ్యతిరేకత ఉందని తెలిసి…బాంబు దాడితో సానుభూతి పొందవచ్చునని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. సానుభూతి కూడా పని చేయలేదు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని సాధించింది. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ ఎంతగా ప్రయత్నించినా తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోయింది. వాస్తవంగా 2014 ఎన్నికల్లోనూ టిడిపి ఓటమిపాలవ్వాల్సింది. ఉమ్మడి రాష్ట్రం ఆధారంగా టిడిపి గెలిచిన సీట్లు లెక్కిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టే అవకాశం లేదు. రాష్ట్ర విభజనతో 2014లోనైనా అధికారంలోకి రాగలిగారు.


వరుసుగా రెండు పర్యాయాలు ఓటమి పాలైన సందర్భంగా….తాను పొరపాట్లు చేశానని బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉండేసరికి పాత విషయాలన్నీ ఆయన మరచిపోయారో…లేక ప్రజలకు మరచిపోయివుంటారని అనుకున్నారోగానీ…. సింగపూర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ‘ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నేను ఓడిపోతానని ఎవరూ ఊహించలేదు. నా ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు’ అని అన్నారు. తెలుగుదేశం ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకుంటే…మరి ఆ పార్టీని ఓండించింది ఎవరు? ఆ ప్రజలు కాదా? బాబుగా చెప్పింది నిజమే అనుకుంటే…2004 ఎన్నికల్లో పొరపాటును ఓడించారనుకుందాం. 2009 ఎన్నికల్లోనైనా ఆ పార్టీ గెలిచివుండాలి కదా! కనీసం 2014లోనైనా టిడిపి ఏకపక్షంగా గెలవాలి కదా! మరి చంద్రబాబు మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? బాబుగారూ… అయ్యో…అయ్యో…అయ్యయ్యో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*