బాబుగారూ మీ మీటర్‌లో తప్పుందేమో…చూడండి!

ముఖ్యమంత్రి చంద్రబబు నాయుడులాగా టెక్నాలజీని ఉపయోగిం చుకునేవారు ఉండరు. ఆయన ప్రతిదానికీ టెక్నాలజీపైనే ఆధారపడుతుంటారు. అదే ఆయన బలమూ బలహీనత కూడా. నాయకుల పనితీరును అంచనా వేయడానికి అవసరమైన సర్వేలనూ టెక్నాలజీ ద్వారానే చేస్తుంటారు. ఆ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా హెచ్చరించాల్సిన నాయకులను హెచ్చరిస్తుంటారు. సూచనలు చేయాల్సిన వారికి సూచనలు చేస్తుంటారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి మరింత ఎక్కువగా, విస్తృతంగా చేస్తుంటారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే…అమరావతిలో నిర్వహించిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని వివరాలను స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. కొన్ని ఫలితాలపై ఆయనే స్వయంగా విస్మయం వ్యక్తం చేశారు. రాష్ర ప్రభుత్వ పథకాలపై ఏమేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే అంశంపైనా టెక్నాలజీని ఉపయోగించి సర్వే చేస్తున్నారు. అదే పద్ధతిలో ఎంఎల్‌ఏల పనితీరుపైనా సర్వే చేస్తుంటారు. ఎంఎల్‌ఏ అందుబాటులో ఉండటం, ప్రవర్తన, సమస్యలపై స్పదించే తీరు వంటి ఐదు అంశాల ఆధారంగా సర్వే చేశారు. ఈ సర్వే వివరాలను చంద్రబాబు నాయేడే స్వయంగా చదివి వినిపించారట. ప్రత్యేకించి 70 మార్కులకంటే పైగా తెచ్చుకున్న వారి పేర్లు చదవి, అభినందించారట. 70 శాతానికి పైగా మార్కులొచ్చిన వారిలో చింతమనేని ప్రభాకర్‌ అగ్రస్థానంలో ఉన్నారట. తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న ప్రభాకర్‌కు అన్ని మార్కులు రావడం చూసి సమావేశంలోని నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారట. దీన్ని దేనికి సంకేతంగా చూడవచ్చనేది చంద్రబాబు నాయుడు ఆలోపించాల్సిన అంశం. సర్వే నిజంగా పకడ్బందీగా జరుగుతోందా, ప్రజల్లో చెడ్డపేరు మూటగట్టుకున్న ఎంఎల్‌ఏ పని తీరుకు అద్భుతమైన మార్కులు రావడం ఏమిటి అనేది అందరికీ వస్తున్న అనుమానం. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తున్న కుప్పంలో 53-58 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తమయిందట. దీనిపై ఆయన కాసింత అసహనం వ్యక్తం చేస్తూ…కుప్పంలో సంతృప్తి శాతం ఇంత తక్కువగా ఉండటం ఏమిటని ప్రశ్నించారట.

సర్వేలు చేయడం, ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం, తప్పులుంటే సరి చేసుకోవడం ఇవన్నీ మంచి పని పద్ధతులేగానీ…ఇది సవ్యంగా జరుగుతోందా లేదా అనేది కూడా క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. కంప్యూటర్‌ సర్వేలో ఇంకో విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కంప్యూటర్‌ ద్వారా సెల్‌ఫోన్‌కు కాల్స్‌ వచ్చినపుడు చంద్రబాబు గళం వినిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఏ అభిప్రాయమూ చెప్పకుండా కాల్‌ కట్‌ చేసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వారి సంఖ్య ఎంతుందో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలైతే కాల్‌ మొత్తం విని, కచ్చితంగా అనుకూలంగానే సమాధానం ఇస్తారు. అంతేతప్ప కాల్‌ ఆసాంతం విని, అనుకూలంగా, వ్యతిరేకంగా ఓటు వేసిన వారి సంఖ్యను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే పప్పులో కాలేసినట్లే. బాబుగారి సర్వే మీటర్‌ బాగా పనిచేస్తున్నదీ లేనిదీ ఒకసారి చెక్‌ చేసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*