బాబుపైకి ‘రామ’బాణం విసిరిన జగన్‌!

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. రామ బాణానికి తిరుగులేదంటారు. ఇవన్నీ ఎందుకంటే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబుపైకి ‘రామ’బాణం గురిచూసి విసిరారు. ఆ బాణం ఏ మేరకు చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని తాకుతుందోగానీ….ఎవరూ ఊహించని శక్తివంతమైన బాణాన్ని అయితే జగన్‌ వదిలారు. ఇంతకీ ఆ రామబాణం కథాకమామిషు ఏమిటి?

తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారరామారావు పేరు పెడతామని జగన్‌ ఆశ్చర్యకర ప్రకటన చేశారు. నందమూరి తారక రామారావు స్వగ్రామైన నిమ్మకూరు ప్రాంతంలో పాదయాత్ర జరుగుతుండగా ఈ ప్రకటన చేశారు. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఇంకా చెప్పాలంటే….చంద్రబాబు నాయుడు తిరుగుబాటుతో (కొందరు దీన్నే వెన్నుపోటు అంటున్నారు) ఎన్‌టిఆర్‌ను గద్దె దించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తరువాత ఎన్‌టిఆర్‌ పేరును తుడిచేయడానికి ప్రయత్నించాడన్న విమర్శలు వచ్చాయి. అందుకే ఆయన ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం పథకాన్ని కూడా ధర పెంచారని అంటారు. ఎన్‌టిఆర్‌ తీసుకొచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధానికీ తూట్లు పొడిచారు. 2004లో చంద్రబాబు ఓటమి పాలైన తరువాత మళ్లీ ఎన్‌టిఆర్‌ నామాన్ని జపించడం ప్రారంభించారని చంద్రబాబును తీవ్రంగా విమర్శించేవాళ్లు ఉన్నారు.

ఎన్‌టిఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేయడం మినహా ఏనాడూ దాని కోసం గట్టిగా ప్రయత్నించలేదంటారు. కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ పేరుతో చంద్రబాబు నాయుడు చంక్రం తిప్పన సందర్భంలోనూ ఎన్‌టిఆర్‌కు భారత రత్న కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదంటారు. భారత రత్న అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ ఇవన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. అంతెందుకు…వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో వేలాది వైఎస్‌ విగ్రహాలున్నాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. ‘వైఎస్‌ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు’ అని ఎద్దేవా చేసింది. దానికి సమాధానంగా….టిడిపి వ్యవస్థాపకుడైన ఎన్‌టిఆర్‌ పేరును శాశ్వతంగా తుడిచిపెట్టేయాలన్న దురుద్ధేశంతోనే ఎక్కడా ఎన్‌టిఆర్‌ విగ్రహాలు పెట్టకుండా చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని విమర్శించింది. ఈ సంవాదం నేపథ్యంలోనే అక్కడక్కడా ఎన్‌టిఆర్‌ విగ్రహాలు హడావుడిగా ఏర్పాటు చేశారు. ఆఖరికి ఎన్‌టిఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులోనూ ఆ మధ్యే ఎన్‌టిఆర్‌ విగ్రహం పెట్టారు.

ఈ నేపథ్యంలో జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఇప్పటిదాకా కడప జిల్లాకు వైఎస్‌ పేరు, ప్రకాశం జిల్లాకు ప్రకాశం పంతులు పేరు, నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు ఉన్నాయి. కృష్ణా జిల్లాకు ఎన్‌టిఆర్‌ పేరు పెడితే…వ్యక్తుల పేరుతో ఉన్న నాలుగో జిల్లా అవుతుంది. జగన్‌ చేసిన ప్రకటనపై టిడిపి పెద్దగా స్పందించడం లేదు. వినీవిననట్లు ఉంది. జగన్‌ వదిలిన ఈ రామబాణం చంద్రబాబును ఓడించడాని ఎంత ఉపయోగపడుతుందోగానీ…ఎన్‌టిఆర్‌ అభిమానుల మనుసును గెలుచుకోడానికి మాత్రం దోహదపడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*