బాబు ఆత్మాభిమానంపై కొట్టిన మోడీ!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అత్యంత చాకచక్యంగా మాట్లాడారు. గురిచూసి చంద్రబాబు నాయుడి ఆత్మాభిమానంపై కొట్టి గిలగిలా కొట్టుకునేలా చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు రెండో రోజే ఢిల్లీకి వెళ్లి, ప్రెస్‌మీట్‌ పెట్టి ఇగ్లీషులో మోడీ తీరుకు జవాబు చెప్పారు.

సహజంగానే మోడీ ప్రధాన మంత్రి హోదాకి, స్థాయికి తగినట్లుగా మాట్లాడరన్న విమర్శలున్నాయి. ఆయన ఏ స్థాయికైనా వెళ్లి మాట్లాడగలరు. ఎవరు ఏమనుకుంటారనేది పట్టించుకోరు. చంద్రబాబు విషయంలోనూ అదే చేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి పరిణతితో వ్యవహరిస్తున్నారు. ఆయన అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాత్రం గొడవలు పడుతున్నారు’ అని మాట్లాడారు. ఈ మాటలతో చంద్రబాబు కుతకుతలాడిపోయారు.

దేశంలో ఏ మూఖ్యమంత్రి కంటే…తనే సమర్థుణ్ని అనేది బాబు అభిప్రాయం. అందులోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌….తన శిష్యుడని, తన వద్ద మంత్రిగా పని చేశారని చెబుతుంటారు. ఒక విధంగా కెసిఆర్‌ కంటే నేనే గొప్ప అని అనేక పర్యాయాలు నారావారు చెప్పారు. అలాంటిది ‘కెసిఆర్‌ పరిణతితో ఆలోచిస్తున్నారు…మీకు పరిణతి లేదు’ అని మోడీ మాట్లాడటం బాబుకు కంట్లో మిరపకాయ పెట్టినట్లు అయింది. అందుకే ఆరోజే రాత్రే మీడియా సమావేశం పెట్టి….’నాకు పరిణతి లేదా…నాకు పరిణతి లేదా…ఏం మాట్లాడుతున్నారు’ అని వాపోయారు. ఇది జాతీయ మీడియాకు అర్థం కాలేదనుకున్నారో ఏమోగానీ…రెండో రోజే ఢిల్లీకి వెళ్లి అవే మాటలు చెప్పారు.

నరేంద్రమోడీ పరోక్షంగా ఇంకోమాట కూడా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుతో గొడవలు పెట్టుకుంటున్నారని అన్నారు. దీని వెను అనేక అర్థాలున్నాయి. ఓటుకు నోటు కేసు విషయంలో కెసిఆర్‌-చంద్రబాబు మధ్య ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. వాస్తవంగా ఈ కేసు తరువాత చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటున్నారు. కెసిఆర్‌పై గతంలోలాగా విమర్శలు చేయడం లేదు. అయినా….మోడీ ఇలా ఎందుకు మాట్లాడారు? తన మాటల ద్వారా ఓటుకు నోటు కేసును పరోక్షంగా గుర్తు చేశారనేది సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. ఇది ఎవరికి అర్థమైనా అర్థం కాకున్నా….చంద్రబాబుకు అర్థమైవుంటుంది. అందుకే చిల్లరగా మాట్లాడుతున్నారంటూ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు బాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*