బాబు…చాలా జాగ్రత్తపడ్డారు!

తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఉపన్యాసంలో కొంత జాగ్రత్తపడ్డారు. విజయవాడలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలోనూ, ఆ తరువాత జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలోనూ మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడలేదు. ‘కేంద్రం నాపై కుట్రలు చేస్తోంది…నాపై కేసులు పెట్టాలని చూస్తోంది. వ్యక్తులుగా మాకుగానీ…ప్రభుత్వానికిగానీ ఏదైనా జరిగితే, మీరంతా వలయంలా ఏర్పడి రక్షించాలి…కర్నాకట ఎన్నికల అయిన తరువాత మన రాష్ట్రంపైన, నాపైనా బిజెపి దృష్టి ఎట్టవచ్చు’ అని ఆ సభల్లో బాబు మాట్లాడారు.దీనిపైన పెద్ద చర్చ జరిగింది. ముఖ్యమంత్రే స్వయంగా తనకు రక్షణగా ఉండాలని ప్రజలను కోరడం ఏమిటి? చంద్రబాబు ఇంత బేలగా ఎందుకు మాట్లాడుతున్నారు? వంటి ప్రశ్నలు వచ్చాయి. వాస్తవంగా ఈ మాటలు తెలుగుదేశం శ్రేణుల్లోనూ ఆందోళన కలిగించాయి. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రే ఇంతగా భయపడితే ఇక పార్టీ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకత్వానికి ఏమి భరోసా ఉంటుందన్న ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా ‘నేను ఎవరికీ భయపడను’ అనే మాటను పదేపదే చెబుతూ వచ్చాయి. ఆ మాట చెప్పడంలోనే బాబు భయం బయటపడుతూ వచ్చింది. అసలు కేంద్రం మీపై ఏ కుట్రలు చేస్తోందో చెప్పండి…అని కొందరు నిలదీసే సరికి….’గవర్నర్‌ నాతో మాట్లాడి వెంటనే ఢిల్లీకి వెళితే ఏమనుకోవాలి’ అని వివరణ ఇచ్చారు. ఏదైనా భయంలో ఉన్నప్పుడు ఆకు కదిలిన చప్పుడు కూడా ఆందోళన కలిగిస్తుంది. గవర్నర్‌ ఢిల్లీ వెళుతున్నారంటే…తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయడానికే వెళుతున్నారన్న భావన కలిగి….కాస్త బేలగా మాట్లాడారు.

పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ అందిందో లేక తనకు తానే విశ్లేషించుకున్నారోగానీ….తిరుపతి సభలో ఎక్కడా, నేను ఎవరికీ భయపడను, నాకు ఏదైనా జరిగితే మీరు ఉద్యమించాలి వంటి మాటలు వినింపించలేదు. విజయవాడ సభలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసందే. దీంతో ఆయన కూడా తిరుపతి సభలో జాగ్రత్తపడ్డారు. నోరుజారి కూడా అనవసరపు మాట మాట్లాడలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*