బాబు తొక్కిన బురదను వైసిపి కూడా తొక్కుతుందా..!

ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టిడిపి అధిష్టాన వర్గం నైరాశ్యంతో తప్పులు మీద తప్పులు చేస్తోంది. అనుభవాల నుండి ఏ కొద్ది పాటి గుణపాఠాలు నేర్వడం లేదు. మరో వైపు ఊహించని విజయం లభించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మినహాయించితే నాయకత్వం విజయోత్సాహంతో సంమయనం కోల్పోతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను నివాసమున్న భవనానికి దాపుల్లో ప్రభుత్వ నిధులతో నిర్మింపబడిన ప్రజావేదిక ప్రతిపక్ష నేతగా తన కార్యకలాపాలకు కేటాయించవలసినదిగా ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంలో పలు కీలకాంశాలు తెర మీదకు వచ్చాయి.

గత ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు నివాసం వున్న భవనం అక్రమ నిర్మాణంగా యజమానికి నోటీసులు ఇవ్వ బడ్డాయి. ఈ భవనంతో పాటు నది గర్భంలో నిర్మింపబడిన పలు భవనాలకు నోటీసులు ఇచ్చారు. కాని అక్రమ నిర్మాణ భవనంలోనే ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఈ కథకు తెర పడింది. చంద్రబాబు నాయుడు ఓటమికి గల సవాలక్ష కారణాలలో ఇది ఒకటి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చట్టాలను గౌరవించకపోతే ప్రజలు మాత్రం గౌరవిస్తారా? తుదకు ప్రజలు కూడా ఆయన్ని గౌరవించ లేదు.

అయితే అప్పటి నుండే వైసిపి పార్టీ చంద్రబాబు నాయుడు నివాసం వున్న ఇల్లు పడగొట్టాలని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అందరూ ఊహించినదేమంటే నేడు వైసిపి అధికారంలోనికి రాగానే చంద్రబాబు నాయుడు నివాసం వున్న భవనం కూలగొడతారని భావించారు.
ఇదిలావుండగా బంతిలోనే చోటు లేదంటే ఆకు చిల్లి అన్నట్లు ప్రభుత్వ వైఖరి ఏమిటో వేచి చూడకుండా ప్రతిపక్ష నేతగా తన కార్యకలాపాలకు ప్రజా వేదిక తనకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు కోరడం సమంజసంగానూ, హేతుబద్దంగాను లేదు. తను నివసిస్తున్న భవనం అక్రమ నిర్మాణమని ఇన్నాళ్లు చెబుతున్న వైసిపి అధికారంలోనికి వచ్చిన నేపథ్యంలో పరిణామాలు ఏలా వుంటాయో కనీసం కొన్నాళ్లు వేచి చూడకుండా కోరడంతో పప్పులో కాలేశారని భావించాలి.

 

ఇదిలావుండగా వైసిపి కూడా టీడీపీ కన్నా తక్కువ తిన్నట్టు లేదు. చంద్రబాబు నాయుడు అభ్యర్థన వచ్చిన తదుపరి ప్రజావేదిక తమ పార్టీ కార్య కలాపాలకు, ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలకు
అవసరమని, తమ పార్టీకి కేటాయించమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరడం టిడిపి కన్నా రెట్టింపుగా తప్పులో కాలేసింది. ఇందులో రెండంశాలున్నాయి. 1)చంద్రబాబు నాయుడు అభ్యర్థన వీగి పోయ్యేట్లు వ్యూహం అమలు చేయడం. 2)అంతవరకైతే ఫర్వాలేదు. ఒక వేళ నది గర్భ పరిరక్షణ పేర కూల్చి వేసేటిగా వుంటే తాము వైదొలగుతామని చెప్పడం. ఇచ్చట ముఖ్యమైన అంశమేమంటే నది గర్భ పరిరక్షణ కన్నా చంద్రబాబు నాయుడు కు ప్రజావేదికచెంద కుండా మైండ్ గేమ్ ఆడటం.

ప్రస్తుతం ప్రజావేదిక ను చంద్రబాబు నాయుడు కు ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వంగాని, పార్టీ పరంగాగాని ఇష్టం లేకపోతే అది వేరే అంశం. గతంలో తాము వాదించినట్లు అక్రమ నిర్మాణాలను తమ ప్రభుత్వం అనుమతించదని మొత్తం భవనాలను తొలగించ వచ్చు. చంద్రబాబు నాయుడుకు ఇవ్వకుండా నది గర్భ పరిరక్షణకు మొత్తం భవనాలు కూల్చి వేయమని మాత్రం వైసిపి నేతలు కోరకపోవడం గమనార్హం.
ఈ క్రమంలో నదీ గర్భంలో నిర్మించిన ప్రజావేదిక ఇవ్వడం కుదరదని చంద్రబాబు నాయుడు కు జవాబు చెప్పివుంటే సబబుగా వుండేది. కానీ వైసిపి కూడా అడుసులో కాలేసి టిడిపి కి తామేమీ తీసి పోమని అతి తక్కువ కాలంలోనే రుజువు చేసు కున్నది.

ఈ నాలుగు ఏళ్లుగా నది పరిరక్షణకు భంగంగావుందని పర్యావరణకు హాని చేస్తున్నదని వాదించి ఈ రోజు చంద్రబాబు నాయుడు అడిగిన తర్వాత తమ పార్టీకి కావాలని అడుగుతున్నారంటే కృష్ణ నది పరిరక్షణ, పర్యావరణ గురించి  ఇన్నాళ్లు వైసిపి చెప్పింది బూటకమనుకోవాలి..

పైగా ఈ అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ హుందాగా లేదు. పరాజితుడు విజేతల మధ్య విధానాలు సిద్దాంతాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు వుండవచ్చు. కాని వ్యక్తిగత అంశాలపై వెటకారంగా వ్యంగ్యంగావిమర్శలు వుండ కూడదు. అదే జరిగితే చనిపోయిన పామును చంపడమే అవుతుంది.

జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి చాలా హుందా వ్యవహరిస్తున్నారు. కాని అడఫా దడఫా ఈలాంటివి కొన్ని చోటు చేసుకోవడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు నివాసం అక్రమ కట్టడమని తేల్చి ప్రజావేదిక ఇవ్వ లేమని చెప్పవచ్చు. కాని ఇన్నాళ్లు తాము చేసిన వాదన పక్కన పెట్టి తమకూ కావాలని కోరడం సరైన విధానం కాదు.

– వి. శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*