బాబు పాలనలో కులాల కుంపట్లు!

ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పాదయాత్ర సందర్భంగా అర్జంట్ గా అధికారంలోనికి రావాలి కాబట్టి ముందు వెనుక చూచు కోకుండా ఎదురైన ప్రతి ఒక్కరికీ హామీలు ఇచ్చారు. అందులో భాగంగానే రిజర్వేషన్లు వున్నాయి. కాపులను బిసిలలో చేర్చడం. గతంలో కాపులు బిసిలు గానే వుండేవారు. వివిధ కారణాలతో ఒసిలు అయ్యారు. తిరిగి బిసిలు కావాలంటే పెద్ద చిక్కులే వున్నాయి. అవేవీ గమనంలోనికి తీసుకోకుండా కమీషన్ వేయడం కమీషన్ చైర్మన్ తో నిమిత్తం లేకుండా రిపోర్టు తెచ్చుకొనీ శాసన సభలో చట్టం చేసి కేంద్రానికి పంపడం అక్కడ పీట ముడిపడటం అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఎన్నికల తాయిలాలుగా ప్రధాని మోదీ అగ్ర వర్ణాలలోని పేదలకు విద్య ఉద్యోగాలలో పదిశాతం రిజర్వేషన్లు కల్పించి అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించారు. అయితే సందట్లో సడేమియా అన్నట్టు కాపుల ఓట్లుకు గాలం వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పదిశాతంలో అయిదు శాతం కాపులకు కేటాయించుతూ శాసన సభలోమరో చట్టం ఆమోదించారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలు తెర మీదకు వచ్చాయి.

1)ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ తోడు దొంగలు. ఎన్నికల గండం పీక మీదకు వచ్చే వరకు నిరుపేదలు గుర్తుకు రాలేదు. తీరా సాహసించి ప్రధాని మోదీ అగ్ర వర్ణాలలోని పేదలకు ఊరట కలిగించేందుకు సిద్ధం కాగానే అందులో ముఖ్యమంత్రి కత్తెర వేశారు.

2)ప్రధాని మోదీ తీసుకు వచ్చిన చట్టంపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించినా ఈ చట్టం రాజ్యాంగ బద్దంగా వుందా? అనే అంశం ఇంకా కోర్టు పరిధిలోనే వుంది. భవిష్యత్తులో ఏమౌతుందో చూడాలి.

3)ఎపిలో కాపు రిజర్వేషన్ పై ఈ పాటికే చట్టం ఆమోదించారు. అది కేంద్ర వద్ద పెండింగ్లో వుంది. రాష్ట్ర పతి ముద్ర పడితేనే చట్టం అవుతుంది. లీగల్ గా అది ఇంకా చట్టం కాకున్నా కాపులను బిసిలుగా కాకుండా ఇబిసిగా రిజర్వేషన్లు కల్పించుతూ చట్టం చేయ వచ్చా?ఇందు వలన కాపులు భవిష్యత్తులో నష్ట పోయే పరిస్థితి ఉంది కదా?

4)ఒకవేళ రేపు కోర్టులు ఇబిసిలు చట్టం చెల్లు బాటు కాదని తీర్పు ఇస్తే కాపుల రిజర్వేషన్లు భవిష్యత్తు ఏమిటి? తిరిగి గతంలో చేసిన కాపు రిజర్వేషన్ బిల్లుపై ఆధారపడే అవకాశం వుంటుందా?

5)ఈ గందరగోళం అంతా తీసుకుని బిసి సంఘాలు ఒక పక్క క్షేత్రస్థాయిలో మరో పక్క కోర్టులలో సవాలు చేస్తే శాశ్వతంగా కాపుల రిజర్వేషన్లు కోల్డ్ స్టోరేజ్ లోనికి నెట్ట బడే అవకాశం వుంది కదా?

6)ఒక వేళ కేంద్ర తీసుకు వచ్చిన చట్టం కొనసాగినా రేపు అగ్ర వర్ణాలలోని వారు కోర్టు తలుపు తట్టి కేంద్రంఅగ్ర వర్ణాలలోని నిరుపేదలకు మాత్రం చేసిన చట్టానికి భిన్నంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం ఇవ్వడం సరికాదని పేదలకందరికీ ఇచ్చిన రిజర్వేషన్లు ఎదో ఒక కులానికి పరిమితం చేయడం సరి కాదని సవాలు చేస్తే అనుకూలంగా తీర్పు వస్తే పరిస్థితి ఏమిటి? ఎన్నికలలో తాత్కాలికంగా లబ్ది పొందేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న యత్నాలు బెడిసి కొట్టే అవకాశం లేక పోలేదు.

7)ఇదిలా ఉండగా గతంలో ముఖ్యమంత్రి తన అస్తవ్యస్త పద్దతులు ద్వారా బిసిలకు కాపుల మధ్య తగాదాలు పెట్టారు. ఇక ముందు కాపులకు అగ్ర వర్ణాలలోని పేదలకు మధ్య మరో మారు చిచ్చు పెడుతున్నారు. వాస్తవంలో కాపులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి భావించితే ప్రస్తుతం ప్రచారం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రధాని అయి ప్రత్యేక హోదా తేగలిగి నపుడు ఇది వరకే ఆమోదించి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంద వచ్చు కదా?

సమస్య అదికాదు. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుంది. విజయం సాధించేందుకు ఏ రాయి దొరికితే దానిని విసురు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుకు 20 శాతం ఐఆర్ ఇచ్చారు. అది జూన్ కూడా వచ్చే జూన్ నుండి ఇస్తారు. ఈ లోపు తన చిత్ర పటానికి పాలాభిశేకం చేయించు కుంటారు. వచ్చే జూన్ నాటికి రాజు ఎవరో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి ఈ జిమ్మిక్కులు చాలానే చేస్తున్నారు. గాని కులాల మద్య చిచ్చు పెట్టడంతో ప్రమాదం పొంచి వుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*