బాబు బాటలో మమత…కేంద్రంపై పోరాటం పేరుతో అక్రమార్కులకు అండ..!

గత రెండు రోజులుగా కోల్‌కతాలో జరుగుతున్న పరిణామాలపై మీడియాలో అగ్ర ప్రాధాన్యంతో వార్తా కథనాలు వస్తున్నాయి. ఒక కుంభకోణం విషయంలో విచారణ జరిపేందుకు కోల్‌కతా వెళ్లిన సిబిఐని బెంగాల్‌ పోలీసులు అడ్డుకోవడం, తమ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సపోర్టుగా నిలబడటం, దీక్షకు పూనుకోవడం….ఇవీన్న దేశవ్యాపితంగా చర్చనీయాంశమైన వార్తలయ్యాయి. మమతా బెనర్జీకి కొన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఎన్‌టియేతో లేని రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఇందులో భాగంగానే సిబిఐని ప్రయోగిస్తోందని కొన్ని పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐటి దాడులు నిర్వహించినపుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి వాదన అయితే చేశారో…అటువంటి వాదననే మమతా బెనర్జీ చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఏదో విధంగా బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఇదే సమయంలో…ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణి కూడా అభ్యంతరకరంగా ఉంది. ఉదాహరణకు బెంగాల్‌ వ్యవహారమే తీసుకుంటే….శారదా చిట్‌ఫంట్‌ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఇందులో సూత్రధారులంతా మమతా బెనర్జీ పార్టీ (తృణమూల్‌ కాంగ్రెస్‌)కు చెందిన వారే. బెంగాల్‌ ప్రజల నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఇది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధివుంటే ఇటువంటి కేసును నిగ్గుతేల్చి బాధితులకు న్యాయం చేసివుండాల్సింది.

ఈ కేసులో సరైన విచారణ జరగడం లేదని అక్కడి ప్రధాన ప్రతిపక్షం సిపిఎం మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఒక విధంగా శారదా కుంభకోణం నిందితులకు కొమ్ముకాస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం….ఇప్పుడు సిబిఐ విచారణనూ అడ్డుకుంటోంది. సిబిఐ విచారణ వల్ల బెంగాల్‌ ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదు. సిబిఐ వల్ల శారద కుంభకోణం బాధితులకు కలిగే ఇబ్బందేమీ ఉండదు. ఏమైనా కష్టం, నష్టం ఉంటే….కుంభకోణానికి పాల్పడిన మమతా బెనర్జీ అనుచరులకే ఉంటుంది. అందుకే బిసిఐ విచారణకు మమతా బెనర్జీ అడ్డుపడుతున్నారు. దీన్ని బెంగాల్‌ ప్రజలపై దాడిగా, ప్రజాస్వామ్యంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సిఎం రమేష్‌ వంటి వాళ్లపై ఐటి దాడులు జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు కూడా ఆక్షేపణీయంగా ఉంది. కొందరు వ్యాపారులపై దాడులు జరిగితే…అది రాష్ట్ర ప్రజలపైన జరిగిన దాడిగా చిత్రీకరించారు. వాస్తవంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడలో ప్రజలకు ఏమాత్రమూ సంబంధం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకయ వైరుధ్యాలతోనైనా శారదా కుంభకోణం, అగ్రిగోల్డ్‌ కుంభకోణం వంటి వాటిపై లోతైన విచారణ జరిగి, బాధితులకు న్యాయం జరిగితే అందరూ సంతోషిస్తారు. అది బెంగాలైనా, ఆంధ్రప్రదేశ్‌ అయినా….కుంభకోణాలకు పాల్పడిన వారిపై విచారణ, తనిఖీలు జరగకుండా అడ్డుకోవాలనుకుంటే అక్కడి ప్రజల మద్దతు లభించదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*