బాబు – మోడీ వైర‌మా….రాష్ట్రం కోసం పోరాట‌మా?

ఆంధ్ర ప్రదేశ్ యెడల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ అవలంభించుతున్న విద్రోహక వైఖరి ఎపి ప్రజలకు కష్ట నష్టాలను తెచ్చి పెట్టడం ఎంత వాస్తవమో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపితో తెగతెంపులు చేసుకోక ముందు – తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్రం యెడల అవలంభించుతున్న అసంబద్ధ, అపసవ్యమైన వైఖరి అంతకు మించి ఎపి ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం అంతే వాస్తవం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్దంగా జరగాల్సిన పోరును ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ప్రధాని మోడీకి మధ్య వ్యక్తిగత పోరాటంగా మార్పు చేయడంతో ఎపి ప్రజలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ప్రధాని మోడీ 2014 లో అధికారం చేపట్టిన తదుపరి తన పార్టీకి రాజకీయ ప్రయోజనాలు లేనిదే ఏ చర్య తీసుకున్న దాఖలా లేదు. ఒకవేపు మనం ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తుంటే బీహార్ ఎన్నికలు రాగానే లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. హోదాను అటకెక్కించారు. అది సరే. . హోదా వలన ఏం వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడమే కొస మెరుపు. ఈ ఉవాచ ముఖ్యమంత్రికి ఈ నాటికి యమపాశంగా వెన్నాడుతోంది. 2018 లో కేంద్ర బడ్జెట్ వచ్చే వరకు ప్రధాని మోడీ స్వభావం ముఖ్యమంత్రి తెలుసుకోలేక అమాయకంగా వుండి పోయారంటే ఎపిలో నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అయితే ముఖ్యమంత్రికి తన రాజకీయ ప్రయోజనాలు నేరవేరవని తెలుసుకొనేందుకు మాత్రం నాలుగు సంవత్సరాలు పట్టిందిగాని… ఎపి ప్రజల ప్రయోజనాల గురించి మాత్రంకాదు. ఇందుకు ప్రాతిపదిక లేకపోలేదు. హోదా బదులు ప్యాకేజీ అంగీకరించడం ముఖ్యమంత్రి పలుమార్లు మాటలు మార్చడం అందరికీ తెలిసిందే.

తుదకు ప్రధాని మోడీతో తెగ తెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు పార్లమెంటులో ఇచ్చిన హామీలు రాష్ట్రంలోనూ దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టి సాగించాలిసిన పోరాటం పక్క దారి పట్టింది. మోడీ తన కన్నా జూనియర్ అని ప్రధానులను రాష్ట్ర పతులను చేసిన ఘనత తనదని చెప్పు కోవడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు గాని పోరాటం గాని పక్క దారి బట్టి చంద్రబాబు మోడీ మధ్య పోరుగా మారి పోయింది. అందుకే ముఖ్యమంత్రి ఎన్ని ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు.గతంలో పలుమార్లు అతి సులభంగా మాటలు మార్చడం ప్రభుత్వ వ్యతిరేక రూపంలో వెన్నాడుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ వైఖరి వలన టిడిపి ఆశించిన మైలేజి రాకపోవడం అటుంచగా టిడిపి ప్రభుత్వం ప్రజల ముందు ఎంత అప్రతిష్టపాలు కావాలో, నిధులు లేమితో తన్నుకులాడాలనో అంత మేరకు మోడి కఠిన వైఖరి తీసుకుంటున్నారు. ఫలితంగా ఎపి ప్రజల తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో బిజెపికి అదనంగా వచ్చే నష్టం లేదు. ఎపిలో స్వయంగా తాము సాధించేదేమీ లేదని తేలిన తర్వాతనే ప్రధాని మోడీ ఈ వైఖరి తీసుకున్నారు. ఒక బాబు కాక పోతే ఇంకొక బాబు వున్నారని మోడికి తెలుసు. ఇక్కడ మరొక అంశం గమనంలోనికి తీసుకోవాలి. తనపై కోపముంటే తనపై కక్ష తీర్చుకోమని, ఎపి ప్రజలకు అన్యాయం చేయవద్దని ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలు పరిశీలిస్తే అసలు చిదంబర రహస్యం అర్థం చేసుకోగలం.

దీనిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపి కి జగన్ కు పవన్ కు సంబంధాలు అంటగడుతూ ఎంత చెబుతున్నా పేలడం లేదు. ఎందుకంటే తను చేస్తే కాపురం ఇతరులు చేస్తే వ్యభిచారమా అనే చర్చ సాగడం అడ్డంకిగా వుంది. ఎపుడైతే హోదా ఇవ్వలేదో ప్యాకేజీకి అంగీకరించకుండా బయటకు వచ్చి వుంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలను ప్రజలు నమ్మేవారు. పుణ్యకాలం గడచి పోయిన తర్వాత పుణ్యావచనం చేసి నట్లు వుంది.

ప్రస్తుతం ప్రధాని మోడీ ఎపి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై సాగిన చర్చ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బ తీసింది. ప్రభుత్వపరంగా కాకుండా పార్టీ పరంగా అందులో ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా నిరసనలు సాగించేందుకు చర్చ జరిగి వుంటే పార్టీ కి మైలేజి వచ్చి వుండేది. ఆలా కాకుండా టిడిపి అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగించే విధంగా వున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సిబిఐ ప్రవేశం లేకుండా ఆదేశాలు జారీ చేశారు. బాగానే వుంది. రేపు ఏదైనా విపత్తు సంభవించితే సైన్యం సహాయం కోర కుండా వుండగలరా? గతంలో కేరళ లో కమ్యూనిస్టు ప్రభుత్వం యెడల, అదే విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వం యెడల, ఇంకా వీరప్ప మొయిలీ ప్రభుత్వం యెడల… అప్పటి కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న‌ దుర్మార్గపు వైఖరి సందర్భంగా  ఈవిధ‌మైన‌ వ్య‌క్తిగ‌త దుమారం, అసంమ‌జ‌స ధోర‌ణ‌లు వ్య‌క్తం కాలేదు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఖరి ఎపి ప్రజలకు మేలు చేసేదిగా లేదు. అదే సమయంలో ప్రధాని అధికార హోదాలో రాష్ట్ర పర్యటన పెట్టుకొని వుంటే ముఖ్యమంత్రి ఇరుకున పడేవారు. పార్టీ నిర్వహించే సభకు రావడం ముఖ్యమంత్రికి వెసులుబాటు కలిగింది. అయినా ప్రధాని – ప్రధానే. అంతెందుకు? మోడి కన్నా తను సీనియర్ అని అసందర్భ ప్రసంగాలతో అసలు సమస్య పక్క దారి పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ సీనియారిటీ దృష్టిలో పెట్టుకుని తన కన్నా రాజకీయానుభవం అటుంచి వయస్సులో కూడా తక్కువ అయిన రాహుల్ గాంధీని వెతుక్కుంటూ వెళ్లారు? ఎవరికైనా రాజకీయ అవసరాలు అటు వంటివి. రాజకీయాలు వేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వేరు.                                                                          – వి.శంకరయ్య ( 9848394013)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*