బాబు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలి!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన రోజు రాత్రి ఓ టివిలో జరిగిన చర్చ ఆసక్తిగా అనిపించింది. టివి చర్చల్లో ఎవరి నోరునైనా మూయించే తెలుగుదేశం ఎంపి కనకమేడల వారు తొలిసారి నీళ్లు నమిలారు. ఆ చర్చల్లో పాల్గొన్న వైసిపి, బిజెపి నాయకులు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించారు. ఈ చర్చ చూసిన తరువాత…రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను బలి చేస్తున్నారా…? అనిపించింది.

వామపక్షాలు, వైసిపి మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ఎక్కడా పక్కకు జరగలేదు. అయితే…కారణాలు ఏవైనా ప్రత్యేక హోదా ఇవ్వలేం…ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబితే…అందుకు అధికార తెలుగుదేశం తలూపింది. పైగా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత గొప్పదో స్వయంగా చంద్రబాబు నాయుడే విశదీకరించారు. కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదంటూ లెక్కలతో సహా వివరించారు చంద్రబాబు. మొత్తంగా హోదా అనేది ముగిసిన అధ్యాయమని తేల్చేసి….ప్రత్యేక ప్యాకేజీ కోసమే మాట్లాడుతూ వచ్చారు.

బిజెపితో రాజకీయ విభేదాలు తెల్తిన తరువాత….(అసెంబ్లీ స్థానాలు పెంచడం, జగన్‌ కేసులను వేగంగా విచారించి శిక్షపడేలా చూడటం…ఈ రెండూ జరక్కపోయే సరికి…) తెలుగుదేశం రూటు మార్చింది. కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ కూడా తీసుకోకుండా….కేంద్రం ఏమీ ఇవ్వలేదనే ప్రచారాన్ని ఉధృతం చేయడం ద్వారా; కేంద్రంపైన, మోడీపైన పోరాడుతున్నట్లు ఫోజు పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహ రచన చేసింది.

ప్రత్యేక ప్యాకేజీ నిధులు రావాలంటే…స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌ (ఎస్‌పివి) ప్రారంభించాలని కేంద్రం చేసిన సూచనను ఆచరణలో పెట్టలేదు. ఎస్‌పివి ప్రారంభించకుండానే నిధులు రాలేదంటూ కేంద్రాన్ని నిందించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఎస్‌పివి ప్రారంభించివుంటే….కేంద్రం నిధులు ఇచ్చేదా ఇవ్వదా అనేది తేలిపోయివుండేది. అది చేస్తే రాజకీయంగా కేంద్రంపై విమర్శలు చేయడానికి వీలుండదు కాబట్టి….అడ్డగోలు వాదనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పివిని ప్రారంభించలేదని ఈ వ్యవహారాల గురించి లోతుగా తెలిసిన వారు చెబుతున్నారు. రాజకీయంగా మైలేజీ సాధించడం కోసమే….ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీని వదిలేసి ప్రత్యేక హోదా నానాదాన్ని టిడిపి ఎత్తుకుందని చెబుతున్నారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు…ఆయనకు జీతం ఇవ్వాలంటే బ్యాంకు ఖాతా ఉండాలి. బ్యాంకు ఖాతా లేకుంటా ప్రభుత్వం వేతనం చెల్లించడం సాధ్యం కాదు. ఎస్‌పివి కూడా అటువంటిదే అని పలువురు చెబుతున్నారు. ఎస్‌పివి ప్రారంభిస్తేనే నిధులు ఇవ్వడానికి వీలవుతుంది. అయితే…రాష్ట్ర ప్రభుత్వ వాదన ఎలావుందంటే…మేము ఎన్నికోట్లు అడిగితే అన్ని కోట్లు మా ఖాతాలో వేసేయాలి. ఆ నిధులు మా ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసుకుంటాం…మీరు అడగకూడదు…అనే విధంగా ఉంది. ఈ ధోరణి వల్లే రాష్ట్రానికి నిధులు రాకుండాపోతున్నాయి. ఫలితంగా నవ్యాంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోతోంది.

టివి చర్చల్లో పాల్గొన్న వైసిపి, బిజెపి నేతలు సంబంధిత టిడిపి ఎంపిని ఇవే ప్రశ్నలు వేస్తే ఆయన నీళ్లు నమిలారు. స్పెషల్‌ ప్యాకేజీ కూడా తీసుకోకుండా టిడిపి ఎందుకు రాజకీయం చేస్తోందో కూడా చర్చ జరిగింది. నాలుగు సంవత్సరాల పాలన అనంతరం క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని గమనించిన చంద్రబాబు….దాన్ని కేంద్రంపైకి నెట్టేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఇలా చేస్తున్నారని వారు వివరించారు. ఇందులో వాస్తవం కనిపిస్తోంది. లేకుంటే ఎస్‌పివి ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాదు. ఇదే మాటను కనకమేడలను అడిగితే…ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు.

కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలోనూ కీలక అంశం చర్చకు వచ్చింది. అమరావతికి 2,500 కోట్లు ఇచ్చారు. ఒక విగ్రహానికి 13,000 కోట్లు ఇచ్చి రాజధానికి ముష్టి రూ.2,500 కోట్లు ఇస్తారా…? అంటూ టిడిపి నాయకులు అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. కేంద్రం ఇచ్చే నిధులు శాశ్వత నిర్మాణాలకు తప్ప….తాత్కాలిక నిర్మాణాల కోసం కాదు. ఇప్పుడు అమరావతిలో జరిగినవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. కేంద్రం ఇచ్చిన 2,500 కోట్లు ఏ శాశ్వత నిర్మాణాలకు ఖర్చు చేశారో చెబితే…మిగతా నిధులు అడగొచ్చు. ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసి కేంద్రం నిధులు ఇవ్వలేదనడంలో అర్థముంటుందా? దీన్ని రాజకీయం చేయడం తప్ప! ఈ మాటకూ కనకమేడల నీళ్లు నమిలారు. కేంద్ర ఇచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పడం లేదంటున్నది దీన్ని దృష్టిలో ఉంచుకునే.

ఇక కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో అవినీతి జరుగుతోందనేది మరో అంశం. ఇది ఒక రాజకీయ ఆరోపణగా టిడిపి కొట్టిపారేయవచ్చుగానీ…తరచి చూస్తే ప్రభుత్వ అర్థిక అరాచకత్వం కనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షగానీ, రాష్ట్రంలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలుకుగానీ… ప్రభుత్వ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు. టివిలు, పత్రికలు, సోషల్‌ మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇలా చేయవచ్చునా? ఇటువంటివన్నీ మౌలికమైన ప్రశ్నలు.

ఏమైనా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలి చేస్తోందన్నది పరిశీలకుల అభిప్రాయం. అందుకే ప్రత్యేక హోదా పేరుతో ఆ పార్టీ చేస్తున్న ‘పోరాటా’నికి ప్రజా మద్దతు లభించడం లేదు. బాబు దీక్షల వల్ల రాజకీయంగా ఆయనకు మేలు జరగవచ్చుగానీ రాష్ట్రానికి ఒరిగేదీమీ లేదు. నిజంగా రాష్ట్రానికి మేలు జరగాలంటే ఇప్పటికైనా ఎస్‌పివి ప్రారంభించి, నిధులు ఇవ్వమని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.

– రాజకీయ వ్యాఖ్యాత

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*