బాబు లైట్‌ తీసుకుంటే…కెసిఆర్‌ స్ట్రాంగ్‌ చేస్తున్నారు!

బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పనిగట్టుకుని అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారు. అన్ని ప్రాంతాయ పార్టీలతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోనూ చర్చిస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబు ముందు ప్రస్తావించినపుడు…ఆయన కెసిఆర్‌ ఫ్రంట్‌ గురించి చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. ఫ్రంటూ లేదూ…ఏమీలేదు అని వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. టిఆర్‌ఎస్‌లో అంతర్గతంగా ఉన్న ఏవో సమస్యల వల్ల కెసిఆర్‌ అలా మాట్లాడుతున్నారని అన్నారట. చంద్రబాబు అలా మాట్లాడిన తరువాత ఇక కెసిఆర్‌ వెళ్లి ఆయనతో చర్చించేది ఏమీవుండదు. ఇక్కడ బాబు ఆలోచనలు వేరు, కెసిఆర్‌ ఆలోచన వేరు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీనే తొలి శత్రువుగా కనిపిస్తోంది కెసిఆర్‌కు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి మొదటి ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. బిజెపి నుంచి దూరమైన తరువాత చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సంకేతాలు గోచరిస్తున్నాయి. కర్నాటకలో బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా తెలుగుదేశం ప్రచారం చేస్తోంది కూడా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కోడానికి, దాన్ని ఒంటరిపాటు చేయడనికి కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ రాగం ఆలపిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ ఫ్రంట్‌ వెనుక మోడీ ఉన్నారన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తంగా తెలిసిందేమంటే…కెసిఆర్‌ ఫ్రంట్‌లో చంద్రబాబు చేరే అవకాశాలు ఏమాత్రం లేవు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లూ ఉండబోవని, ఆధారాలను బట్టి ఛార్జిషీట్‌ వేయాలని అధికారులకు కెసిఆర్‌ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. 10 – 15 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయబోతున్నారు. అంటే ఆ సమయానికి కర్నాటక ఎన్నికలు అయిపోతాయి. కర్నాకటలో తమను ఓడించడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశంపైన కక్ష సాధించడం కోసం కెసిఆర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారన్న విశ్లేషణలూ వస్తున్నాయి. బిజెపి ఉన్నా లేకున్నా….చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే టిఆర్‌ఎస్‌కు నష్టం. బాబును ఆత్మరక్షణలో పడేసే వ్యూహంలో ఓటుకు నోటు కేసు వేగం పెంచారని అంటున్నారు. ఇదేసమయంలో మరో అంశం కూడా పరిశీలించాల్సివుంది. 15వ ఆర్థిక సంఘం నిబంధనలతో రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయంటూ…ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్నాటక, పుదిచ్చేరి, ఢిల్లీ, బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాలు అమరావతిలో సమావేశమయ్యాయి. కేంద్రం పోరాటానికి సిద్ధమయ్యాయి. మొదటి సమావేశంలో కేరళలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకాలేదు. కేంద్రంపై అంతెత్తు లేస్తున్న కెసిఆర్‌ ఈ సమావేశానికి ఎందుకు హాజరుకాలేని అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మించాలని కెసిఆర్‌కు ఉంటే….ఈ సమావేశానికి ఆయనే ఎక్కువ చొరవ తీసుకోవాల్సివుంది. బిజెపితో ఉన్న రహస్య ఒప్పందం వల్లే కెసిఆర్‌ ఈ సమావేశాలకు హాజరుకావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైనా కెసిఆర్‌లో పారద్శకత కంటే…సొంతపార్టీ లాభం కోసం వ్యూహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*