బాబూగారూ…ఢిల్లీ బంద్‌ చేయాలా?

ప్రత్యేక హోదా కోసం ఈరోజు (16.04.2018)న నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బంద్‌ చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. ఎక్కువ సమయం పనిచేయడం వంటి జపాన్‌ తరహా పద్ధతిలో నిరసన తెలియజేయాలని చెప్పారు. ఆందోళనలు ఢిల్లీలో చేపడితే మద్దతిస్తామని ప్రకటించారు. అంటే దీనిర్థం ఢిల్లీ బంద్‌ చేయమనేగా…! ఇది సాధ్యమయ్యే పనేనా? అయినా ఢిల్లీలో బంద్‌చేస్తే ఢిల్లీ రాష్ట్రానికి నష్టం జరగదా? ఢిల్లీ ప్రజలు ఇబ్బందిపడతరా? ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లి ఢిల్లీ బంద్‌ చేయడం జరిగేపనేనా? సాధారణంగా ఎక్కడి ప్రజలు అక్కడ తమ నిరసన తెలియజేస్తుంటారు. ఒక్కోసారి పరిపాలనా కేంద్రానికి వెళ్లి కూడా నిరసన తెలియజేస్తారు. మొన్న ముంబైలో రైతులు చేసినట్టు.

ఇక్కడ చంద్రబాబులో మరోధోరణి కూడా కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి గురించి తనకు తప్ప ఎవరికీ పట్టలేదన్నట్లు మాట్లాడుతున్నారు. బంద్‌లో పాల్గొంటున్నది రాష్ట్ర ప్రజలనే సంగతి మరచిపోతున్నారు. బంద్‌ల వల్ల కాస్త ఇబ్బంది జరిగుతుంది. అంతమాత్రాన బంద్‌లే చేయకూడదనడం తగదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఎన్నడూ బంద్‌లలో పాల్గొనలేదా? 2004కు మునుపు కూడా చంద్రబాబు బంద్‌లపై ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో జరిగిన అన్ని బంద్‌లలో టిడిపి పాల్గొంది. అప్పుడు జపాన్‌ తరహా నిరసన అని ఎన్నడూ మాట్లాడలేదు. తాను అధికారంలో ఉండగా ఎవరూ ఆందోళన చేయకూడదనేది బాబు దృక్పథం. అసలు….నిరసన ప్రదర్శనలూ చేయనీకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాసంఘాలు ఛలో అమరావతికి పిలుపునిస్తే రైల్వే స్టేషన్లలోనే అరెస్టు చేస్తున్నారు. నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. అది బంద్‌ కావచ్చు, నిరాహార దీక్ష కావచ్చు. ధర్నా కావచ్చు. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు దృక్పథం మారాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*