బాబూ…అబద్ధాలు చెప్పినా అతికినట్లు చెప్పండి..!

– రూ.24 వేల కోట్లు రుణ మాఫీ ఎక్కడ బాబూ..?

– రైతుల ఖాతాల్లో చేరింది రూ. 14 వేల కోట్లు కదా?

ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో శ్వేత పత్రం విడుదల చేస్తూ రాష్ట్రంలో అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. అందులో ముఖ్య మైనది… రైతు రుణ మాఫీ. తను పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలు చూచి చలించిపోయి ఇబ్బడికీ ఇబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. 24 వేల కోట్లు రుణ మాఫీ చేసినట్లు చక్కటి అబద్దం చెప్పారు. ఇందులో వాస్తవం ఎంత.? అంతే కాదు. సన్న చిన్నకారు రైతులు ఏ మేరకు లాభ పడ్డారు?

2014 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువైనట్లుంది. పాదయాత్ర సందర్భంగా రైతులను రుణాలు చెల్లించ వద్దని, బ్యాంకుల్లో వుండే నగలు విడిపించ వద్దని, తాను అధికారంలోనికిరాగానే ఇంటి పెద్ద కొడుకుగా విడిపించే బాధ్యత తీసుకుంటానని ఊదరగొట్టారు. పాపం రాష్ట్రంలోని అమాయక రైతులు చంద్రబాబు మాట నమ్మి మోసపోయారు. తుదకు రైతు రుణ మాఫీ లక్ష 50 వేలకు కుదించడంతో ఎంతో మంది రైతులు రెండింటికి చెడిన రేవడి అయ్యారు. చంద్రబాబు పాదయాత్ర ప్రసంగాలు విని సకాలంలో నగలు విడిపించుకోనందున వడ్డీలకు వడ్డీలు పెరిగాయి. పలువురు రైతుల నగలు బ్యాంకులు వేలం వేయడం జరిగింది. ఆ రోజుల్లో పత్రికల నిండా వేలం నోటీసులు చూచాం. అధికారం చేపట్టి నాలుగున్నర ఏళ్లు గడిచినా ఇంకా రుణ మాఫీ కోసం రైతులు వెంపర లాడు తున్నారు. ఫైనల్ లిస్ట్ తేలలేదు.

నాణేనికి ఇది ఒక వేపు అయితే వాస్తవంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం రూ.14 వేల కోట్లు మాత్రమే ఇప్పటి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయవలసి వుంది. మరో వేపు అసలే రుణ మాఫీ జరగకుండా తిప్పలుపడే రైతుల రుణ భారం అదనంగా వుంది. వాస్తవం ఇలా వుండగా తుల్యమైన తెల్ల కాగితం అని చెబుతూ అబద్దాలతో నింపడం ఎంత వరకు సమంజసం?

ప్రభుత్వం చేయించుకొంటున్న సర్వేలో రైతు రుణ మాఫీ జాప్యం గుదిబండగా వున్నా శ్వేత పత్రం పేరుతో ప్రకటన చేస్తూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం నిబద్ధత గల ఏ రాజకీయ నేత చేసే పని కాదు.

ఇదిలా వుండగా ప్రభుత్వం పాక్షికంగా అమలు చేసిన రుణ మాఫీని వెక్కిరించే అంశాలు మరిన్ని వున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వివిధ సర్వేలు పరిశీలించితే విభ్రాంతి కరమైన అంశాలు వెలుగు చూచాయి. రైతులలో కేవలం 45 శాతం మందికే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని, మిగిలిన రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు పొందుతున్నారని, పైగా చిన్న సన్నకారు రైతులలో కేవలం 15 శాతం మందికే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్న నేపథ్యంలోముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన రైతు రుణ మాఫీ అసలు సిసలు స్వరూపం వివరించనక్కర లేదు. నిజంగా సహాయం అందవలసిన రైతులు కొల్ల బోయారు. ఇన్ని అబద్దాలతో అసంబద్ధాలతో అమలు అవుతున్న ఈ పథకం విలువ కట్టేందుకు పక్కా షరాబులుగా రైతులు సిద్దంగా వున్నారు.

– వి. శంకరయ్య (9848394013)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*