బాబూ గారు రాయలసీమకు అన్నీ చేసేశారు…ఇక జగన్‌ చేయడానికి ఏమీ లేదట..!

Nara Chandrababu Naidu

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు గమ్మత్తుగా సమాధానాలిస్తుంటారు. ఆయనకు అనుకూమైన ప్రశ్నలైతే ఫర్వాలేదుగానీ ఇబ్బందిపెట్టే ప్రశ్నలైతే…చాలా తెలివిగా దాటవేస్తుంటారు. ఒకింత గదమాయించి, ప్రశ్నకు సంబంధం లేని విషయాలేవో చెప్పేసి ముగిస్తారు. తాజా జల వివాదం పోతిరెడ్డి పాడుపైన కూడా ఇటువంటి సమాధానంతోనే దాటవేశారు.

కృష్ణా జలాలను సాధ్యమైనంత ఎక్కువగా (కేటాయింపు మేరకు) రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడానికి అనుకూలంగా రెండు కొత్త ప్రాజెక్టులను చేపడుతూ జగన్‌ ప్రభుత్వం 203 జీవోను విడుదల చేసింది. ఇందులో పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యం పెంపు ఒకటి. దీనిపైన తెలంగాణలో పెద్ద దుమారం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటి దోపిడీకి ప్పాడుతోందని అక్కడి అధికార పక్షం, ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నాయి. కృష్ణ బోర్డుకు ఫిర్యాదు కూడా చేసింది కెసిఆర్‌ ప్రభుత్వం.

ఇంతటి వివాదంగా మారిన అంశంపైన రోజులు గడుస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నేయగస చంద్రబాబు నోరు విప్పలేదు. మీడియా సమావేశాలు పెట్టి కరోనా, విద్యుత్‌ బిల్లులు, డాక్టర్‌ సుధాకర్‌, రంగనాయమ్మ….ఇలా ఏవోవో అంశాలు మాట్లాడుతున్నారు తప్ప జీవో 203 గురించి ప్రస్తావించడం లేదు. దీనిపైన టిడిపి వైఖరి ఏమిటో చెప్పడం లేదు. ఇదే అంశాన్ని ఓ విలేకరి నిన్నటి మీడియా సమావేశంలో చంద్రబాబును ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. ఆ జీవోను సమర్ధిస్తున్నామనో, వ్యతిరేకిస్తున్నామనో చెప్పలేదు. ఈ జీవో విషయంలో తెలంగాణ తీరు గురించి మాట్లాడలేదు. విలేకరిపైన ఎదురుదాడికి దిగారు. పోతిరెడ్డిపాడు పూర్తి చేసింది నేను. తెలుగుగంగ పూర్తి చేసింది నేను. ఎస్‌ఆర్‌బిసి పూర్తి చేసింది నేను. గాలేరి నగరి పూర్తి చేసింది నేను. పట్టిసీమ కట్టి సీమకు నీళ్లు ఇచ్చింది నేను. ఎన్‌టిఆర్‌ ప్రాజెక్టులు ప్రారంభిస్తే నేను పూర్తి చేశాను. మీరా నాకు చెప్పేది… అంటూ ఒకింత అసహనంతో కూడిన సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు గారి మాటలు వింటే…ఇక ఆంధ్రప్రదేశ్‌లో నీటి ప్రాజెక్టుల నిర్మాణమే అవసరం లేదనిపిస్తుంది. అన్నీ ఆయన పూర్తి చేశాక ఇక జగన్‌ చేసేదేముందని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఇక్కడి నీటి వివాదాలు తెలియని వారికి అలా అనిపించవచ్చుగానీ….ఇవన్నీ తెలిసిన వారికి చంద్రబాబు ఎంత అసంబద్ధంగా మాట్లాడారో ఇట్టే అర్థమైపోతుంది.

చంద్రబాబు చెప్పినట్లు చాలా ప్రాజెక్టులు ఎన్‌టిఆర్‌ ప్రారంభించిన మాట వాస్తవం. అయితే…వాటిని తాను పూర్తి చేశాన‌ని చెప్పుకున్నది మాత్రం శుద్ధ అబద్దం. ప్రత్యేకించి రాయలసీమ నీటి ప్రాజెక్టు దశాబ్దాల తరబడి కునారిల్లడానికి నారావారే ప్రధాన కారణం. ఎన్‌టిఆర్‌ను గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కి, తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన బాబుగారు… సొంతప్రాంతమైన సీమ నెత్తిన మట్టిపోశారు తప్ప…చుక్క నీళ్లు పోయలేదు. ఎన్‌టిఆర్‌ ప్రారంభించిన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులు ఆ తొమ్మిదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు నీటి ప్రాజెక్టునేవి ఆయనకు ప్రాధాన్యం కాకుండా పోయాయి. టూరిజం తప్ప ఇంకొకటి లేదన్నట్లు తొమ్మిదేళ్ల పాలన సాగించారు.

2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాతే సాగునీటి ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. జలయజ్ఞం పేరుతో నీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడే పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యాన్ని విస్తరించారు. హంద్రీనీవా కాలువను సాగించారు. గాలేరి నగరిని పారించారు. ఆ తరువాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా సాగునీటి ప్రాజెక్టుకు అధికక ప్రాధాన్యత ఇచ్చారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే… హంద్రీనీవా కాలువ అనంతపురం జిల్లాదాకా వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు (2014కు మునుపు) నీటి ప్రాజెక్టులను పట్టించుకుని వుంటే 2004 నాటికే…అంటే 15 ఏళ్ల క్రితమే హంద్రీనీవా చిత్తూరు దాకా వచ్చివుండేది. అప్పుడు పట్టించుకోకుండా… వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేసిన పనులను తన ఖాతాలో వేసుకుని, 2014 అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభోత్సవాలు చేశారు. దాన్నే తాను ప్రాజెక్టులు పూర్తి చేసినట్లుగా చెప్పుకుంటున్నారు.

చంద్రబాబు నిజాయితీకి, నిబద్ధతకు మచ్చుతునక పోతిరెడ్డిపాడు. ఆ తూముల సామర్థ్యాన్ని వైఎస్‌ 44 వేల క్యూసెక్కులకు పెంచినా…ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. 2014 నుంచి ఐదేళ్లు పోతిరెడ్డిపాడు తూముల జోలికే వెళ్లలేదు బాబుగారు. పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యం పెంచినా, సీమకు నీళ్లు తోడినా….తాను నమ్ముకున్న గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి ఇబ్బంది ఎదురవుతుందన్నది ఆయన భయం. ఇదే సమయంలో కృష్ణా డెల్డా వారి కోసం, రాజధాని కోసం పట్టిసీమను ఆగమేఘాలపై పూర్తి చేశారు. ఇదీ చంద్రబాబుకు రాయసీమ మీద ఉన్న ప్రేమ. ఇంకొకమాట కూడా చెప్పాలి. కండలేరు నుంచి చిత్తూరుకు ఏడు టిఎంసిల నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తే…టెండర్లు కూడా పూర్తయిన దశలో దాన్ని రద్దు చేసి సీమకు తీరని అన్యాయం చేశారు చంద్రబాబు. ఎప్పుకుంటే ఎలా ఎన్నో…!

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మేలు చేసే జీవో 203ను సమర్ధించి, దానికి ఎదురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా గొంతు కలపడానికి బదులు…సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తూముల సామర్థ్యం పెంపును సమర్థిస్తే ఆ రెండు జిల్లాల వారికి కోపం వస్తుందన్నదే‌ అసలు భయం. అందుకే సూటిగా చెప్పకుండా…ఇప్పటికే తాను అన్నీ చేశాశానని, ఇక చేయాల్సింది ఏమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు చెప్పినవి ఏకపక్ష మీడియా ఉన్న కాంలో చెల్లిందేమోగానీ… సోషల్‌ మీడియా విస్పోటన కాలంలో చెల్లబోదు. ఆయన పది అబద్ధాలు చెబితే…వెయ్యి రుజువులతో బండారం బయటపెడుతోంది సామాజిక మాధ్యమం. ఇప్పటికైనా చంద్రబాబు జిమ్మిక్కు మానుకుని, నిబద్ధతతో వ్యవహరించడం మంచిది.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*