బాషా…వందసార్లు వొద్దు…ఒక్కసారైనా చెప్పండి..!

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పటిదాకా పార్టీ పేరు ప్రకటించలేదు. రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ అని చెప్పారుగానీ….రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించడం లేదు. ఇప్పటికీ సినిమాల్లోనే బిజీగా ఉన్నారు. సినిమా వెనుక సినిమా చేస్తున్నారు.

ఇదిలావుంటే తానూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ‘నాయకుడు’ కమల్‌హాసన్‌ వెనువెంటనే పార్టీ పేరు ప్రకటించారు. అంతేగాదు రాజకీయ పరిణామాలపై క్రమం తప్పకుండా స్పందిస్తున్నారు. తమిళనాడులో 20 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కూడా ఆయన ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ పార్టీ బరిలో ఉంటుందని స్పష్టం చేశారు.

తమిళనాట అనుకోకుండా ఏకంగా 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయి. జయలలిత మరణానంతరం తమిళనాట చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 18 మంది ఎంఎల్‌ఏలు శశికళ వర్గం (దినకరన్‌) వైపు నిలిచారు. దీంతో స్పీకర్‌ ఆ 18 మందిపై అనర్హత వేటు వేశారు. మాద్రాసు హైకోర్టు కూడా స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్ధించింది. అదేవిధంగా కరుణానిధితో పాటు మరో ఎంఎల్‌ఏ ఇటీవల మరణించారు. మొత్తం 20 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఉప ఎన్నికలు ఒకటి రెండు స్థానాలకు జరగడం పరిపాటి. ఒకేసారి 20 స్థానాలకు జరగడమంటే….అతి అత్యంత కీలకమైన పరిణామమే. 2021 ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలూ ఈ ఉప ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్నాయి. కమల్‌ హాసన్‌ కూడా పోటీకి సై అంటున్నారు. రజనీకాంత్‌ మాత్రం పట్టించుకోవడం లేదు.

తాను పోటీ చేస్తే….ఒక్కసారిగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే విధంగా ఉండాలన్న ఆలోచన రజనీకాంత్‌లో ఉన్నట్లుంది. 2021 ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇప్పటికే రజనీకాంత్‌ ప్రకటించారు. ఇది ఉప ఎన్నికలు రాక మునుపటి మాట. అనూహ్యంగా 20 స్థానాలకు ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో రజనీకాంత్‌ ఎందుకు పోటీ చేయరో అర్థం కాదు.

ఈ 20 స్థానాల్లో రజనీ తన సత్తా చాటుకోగలిగితే….తమిళనాడు రాజకీయం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. రజనీకాంత్‌కు ఇదో గొప్ప అవకాశం. 2021 ఎన్నికలకు రిహార్సల్స్‌ లాగా ఉపయోగపడుతుంది. అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలొచ్చినా ఆశ్చర్యం లేదు. 2021 దాకా వేచి చూడాల్సిన అవసరం లేకుండా అధికారం చేజిక్కించుకునే అవకాశాలూ ఉన్నాయి.

ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అని బాషా సినిమాలో రజనీకాంత్‌ చెప్పిన డైలాగులు గుర్తుకొస్తున్నాయి. సినిమాల్లోనే కాదు. రాజకీయాల్లోనూ ఆయనకు అంతటి సత్తా ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే…ఆయన వందసార్లు కాదు కదా…ఒక్కసారి కూడా స్పష్టంగా ఏమీ చెప్పడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*