బిగ్‌బాగ్‌ జుత్తు పీక్కోవాల్సిందే!

బిగ్‌బాష్‌ షో అనేది వ్యక్తుల భావోద్వేగాలతో ఆడుకునేది. బలహీన మనస్తత్వం ఉన్నవారైతేనే ఈ ఆటకు బాగా సూటవుతారు. బిగ్‌బాస్‌ పెట్టే తంపులు, తగవులతో ఇంటి సభ్యులు ఎంతగా రెచ్చిపేయి కొట్టుకుంటే అంతగా రక్తి కడుతుది బిగ్‌బాస్‌ షో. ఇది జరగాలంటే…ముందే చెప్పినట్లు భావోద్వేగాలను నియంత్రించుకోలేని వారై ఉండాలి. చిన్నవాటికే సహనం కోల్పోయేవారైవుండాలి. అదే కాస్త మానసిక దృఢత్వం, ఇంకాస్త చాకచక్యం, మరికొంత తర్కం తెలిసిన వాళ్లయితే….బిగ్‌బాస్‌కే చుక్కలు చూపిస్తారు.

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో పోల్చితే ప్రస్తుతం నడుస్తున్న రెండో సీజన్‌లోని సభ్యులు రెండోరకానికి చెందినవారుగా కనిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండేవారు ఎవరైనా బిగ్‌బాస్‌ చెప్పింది చేయాల్సిందే. కాదనేందుకు వీల్లేదు. అయితే…ప్రస్తుతమున్న సభ్యులు బిగ్‌బాస్‌ చెప్పింది చేస్తున్నట్లే కనిపిస్తున్నా…ఆయన ఆలోచనలకు భిన్నంగా చేస్తున్నారు. ఉదాహరణకు… మొదటి కెప్టెన్‌ ఎంపిక వ్యవహారమే. సభ్యులకు ఒక టాస్క్‌ ఇచ్చి ఎవరు బాగా చేస్తే, వారిని ఇంటి కెప్టెన్‌గా ఎంపిక చేయమని బిగ్‌బాస్‌ చెప్పారు. ఈ టాస్క్‌ను అందరికంటే బాగా భాను చేసినప్పటికీ…సామ్రాట్‌ కెప్టెన్‌ అయ్యారు. ఇంటి సభ్యులు ముందుగానే మాట్లాడుకున్నారు. సామ్రాట్‌ అయితేనే ఇంటిని బాగా నడపగలరని అనుకుని….టాస్క్‌ను ఎవరు ఎలా ప్రదర్శించారనేదానితో నిమిత్తం లేకుండా….సామ్రాట్‌కే ఎక్కువ ఓట్లు వేశారు. ఆయన్నే కెప్టెన్‌ చేశారు. ఇది బిగ్‌బాస్‌కు మింగుడుపడని అంశమే. బిగ్‌బాస్‌ తరపున మాట్లాడే నాని…ఇదే విషయాన్ని ప్రస్తావించారు. టాస్క్‌ ఆధారంగా కెప్టెన్‌ని నిర్ణయించమంటే..మీకు నచ్చిన వారిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. వాస్తవంగా అలా అడిగే అధికారం బిగ్‌బాస్‌కు లేదు. ఎందుకంటే…టాస్క్‌ను చూశాకే, సామ్రాట్‌ను ఎంపిక చేశారు. బిగ్‌బాస్‌ ఏమో తేజ బాగా చేస్తే సామ్రాట్‌ను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. టెన్నికల్‌గా చూస్తే…ఇంటి సభ్యులు చేసింది సరైనదే అనుకోవాలి. ఇందులో బిగ్‌బాస్‌ వైఫల్యం ఉంది. టాస్క్‌ ఆధారంగా కెప్టెన్‌ను నిర్ణయించాలనుకున్నప్పుడు ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు కూడబలుక్కోడానికి వీల్లేని విధంగా టాస్క్‌ను ఇచ్చివుండాలి. ఈ విషయంలో బిగ్‌బాస్‌ అసహనం కూడా బయటపడింది. సామ్రాట్‌ను సభ్యులంతా కలిసి కెప్టెన్‌గా ఎంపిక చేస్తే…’నీకు ఇంటి కెప్టెన్‌గా పనిచేసే అర్హత లేదు’ అని నానీతో చెప్పించారు. దానికి ఏదో పనికిమాలిన కారణాన్ని ఎత్తిచూపారు. ఇంటికి సంబంధించిన అన్ని విషయాలనూ ఇంకో సభ్యునితో చర్చిస్తున్నారనేది ఆ కారణం. అలా చర్చించడం తప్పు ఎలా అవుతుందో తెలియదు. దీన్నిబట్టే బిగ్‌బాస్‌ జుత్తు పీక్కుంటున్నారని అనుకోవాలి.

బిగ్‌బాస్‌ అభిమతానికి భిన్నంగా జరిగినవి ఇంకా ఉన్నాయి. సినిమాల నుంచి కొన్ని డైలాగులు ఎంపిక చేసి, ఆ డైలాగు ఎవరికి సరిపోతుందే వారిని ఉద్దేశించి చెప్పమంటూ ఒక్కో ఇంటి సభ్యునికి ఒక్కో డైలాగ్‌ ఇచ్చారు. ఆ డైలాగులు చెబితే…చెప్పినవాళ్లపైన ఎదుటివాళ్లకు కోపం రావడం ఖాయం. ఉదాహరణకు గీతా మాధురికి ఒక డైలాగ్‌ ఇచ్చారు. ఆమె ఆ డైలాగ్‌ చెప్పిన తరువాత ఆ ఇంటి సభ్యురాలిని ఆలింగనం చేసుకుని సారీ చెప్పారు. ఆమె ఆ విధంగా చేయడాన్ని కాదనడానికి ఏమీలేదు. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం అది. అదే ఘర్షణపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్లయితే…తనకు నచ్చనివాళ్ల ముందు ఆ డైలాగును కోపంతో చెప్పేవాళ్లు. అది ఇంకో సందర్భంలో ఘర్షణకు దారితీసేది. ఆ డైలాగు చెప్పిన తరువాత సారీ చెప్పకూడదని అనడానికి బిగ్‌బాస్‌కు అధికారం లేదు. ఆయన చెప్పింది చేశారా లేదా అని అడిగేంత వరకే బిగ్‌బాస్‌కు అధికారం ఉంది.

ఇక ఆ ఇంటిలో టివిగానీ, పత్రికలుగానీ, ఆఖరికి క్యాలెండర్‌, వాచీగానీ ఉండవు. అంటే సమయం ఎంతో, తేదీ ఏమిటో కూడా తెలియని స్థితిలో సభ్యులు ఉండాలన్నది బిగ్‌బాస్‌ అభిప్రాయం. తేదీ, సమయం తెలియకుండా ఉండాల్సిన అవసరం ఏమిటో మనకు తెలియదు. అది అలావుంచితే….ఈసారి ఇంటిలో బాబు గోగినేని ఒక కర్రను ఎండలో నిలబెట్టి సమయం ఎంతో చెప్పేశారు. బిగ్‌బాస్‌ వాచీ అందుబాటులో ఉంచకపోవచ్చుగానీ…తమ తెలివి తేటలను ఉపయోగించి సమయం తెలుసుకోకూడదని చెప్పే హక్కు బిగ్‌బాస్‌కు ఉండదు. ఈ విధంగా సమయాన్ని తెలుసుకునే అవకాశాన్ని సభ్యులకు కొనసాగిస్తారో లేదోగానీ….బాబు గోనినేని వ్యవహారంతో బిగ్‌బాస్‌ షాక్‌ అయివుంటారనడంలో సందేహం లేదు. ఇంకా దుస్తులు విప్పి ప్రదర్శన ఇవ్వమన్నప్పుడు తన హక్కులకు భంగం కలిగే ఏ పనినీ తాను చేయబోనని, బిగ్‌బాస్‌ను ధిక్కరిస్తూ చెప్పేశారు గోగినేని. ఇలాంటివి చాలానే ఈ సారి కనిపిస్తున్నాయి.

దీని ప్రభావం వచ్చే సీజన్లపైనా, ఇతర భాషలపైనా పడినా పడుతుంది. ఇలాంటి అనుభవం ఇప్పటిదాకా ఇతర భాషల్లో ఎప్పుడైనా వచ్చిందో లేదో తెలియదు. బిగ్‌బాస్‌ ఆశించినట్లు సభ్యులు గొడవపడకుండా చాకచక్యంగా తప్పించుకోడాన్ని ఎవరు కాదనగలరు. ఇకపై సభ్యులను ఎంపిక చేసేటప్పుడే ప్రతిచిన్నదానికీ గొడవలు పడే మనస్తత్వం ఉన్నవారిని ఎంపిక చేసుకోవాలి. లేకుంటే బిగ్‌బాస్‌ ఇంటిని మూసేసుకోవాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*