బిగ్‌బాస్‌కే బిగ్‌ సవాల్‌ : 100 రోజులు పూర్తయిన షో!

స్టార్‌ మాటీవిలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ (తెలుగు) సీజన్‌-2 ఇంకో రెండు వారాల్లో ముగియనుంది. 18.09.2018 నాటి ఎపిషోడ్‌తో వంద రోజులు పూర్తి చేసుకుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ షోపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరు విజేత అనేదానికంటే షో సాగుతున్న తీరుపైనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. బిగ్‌బాస్‌కు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. బిగ్‌ బ్రదర్‌ పేరుతో విదేశాల్లో మొదలై, అక్కడ విశేష ఆదరణపొంది….మన దేశానికి సంబంధించి బిగ్‌బాస్‌ పేరుతో హిందీలో ప్రారంభమై…ఇప్పుడు తెలుగు, తమిళం, మళయాలం, కనడ, మరాఠీ, బెంగాలీ… ప్రాంతీయ భాషలకూ విస్తరించిన ఈ షోలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అనేకం ఉన్నాయి. అందుకు ఏ భాషలోనైనా బిగ్‌బాస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ‘బిగ్‌బాస్‌ కోరిక మేరకు…’ అంటూ గంభీరంగా వినిపించడం తప్ప కంటికి కనిపించని ఆ బిగ్‌బాస్‌ చూశారో లేదోగానీ…ఈ సీజన్‌తో అనేక సవాళ్లు బిగ్‌బాస్‌ ముందుకు వచ్చాయి.

నెథర్‌లాండ్స్‌కు చెందిన జాన్‌ డి మోల్‌ జెఆర్‌ అనే వ్యక్తి బిగ బ్రదర్‌ పేరుతో ఈ షోను సృష్టించారు. దీన్నే ‘బిగ్‌బాస్‌’ పేరుతో మొదట 2006లో హిందీలోకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా 11 సీజన్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 16న 12వ సీజన్‌ మొదలుకానుంది. ప్రాంతీయ భాషల్లో తొలుత 2013లో కన్నడ, బెంగాలీలో ప్రారంభించారు. కన్నడలో నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. బెంగాల్‌లో పెద్దగా ఆరణ లేకపోవడంతో రెండు సీజన్లే అయ్యాయి. తెలుగు, తమిళంలో గత ఏడాది మొదటి సీజన్‌ నడిచింది. ఇది రెండో సీజన్‌. హిందీలో అమితాబచ్చన్‌; సల్మాన్‌ఖాన్‌ వంటివారు హోస్ట్‌ చేశారు. మలయాళంలో మోహన్‌లాల్‌ వ్యాఖ్యాతగా పని చేశారు. తమిళంలో కమల్‌ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి బ్రిటన్‌లో ప్రసారమైన బిగ్‌ బ్రదర్‌-5లో విజేత అయిన తరువాత భారత దేశంలో ఈ షోకు ఆదరణ పెరిగింది.

బిగ్‌బాస్‌ ఒక పనికిమాలిన షో అని విమర్శించేవాళ్లున్నారు. ఈ షోను చూసేవాళ్లకూ పనిలేదని ఎగతాళి చేసేవారూ ఉన్నారు. రియాలిటీ షోలలో ఇదో అద్భుతమైన ఫార్మేట్‌ అని అభినందిచవాళ్లూ ఉన్నారు. ఇంతకీ బిగ్‌బాస్‌ షో ఉద్దేశం ఏమిటి? దీని మూలసూత్రం ఏమిటి? ఇది ఎలా పుట్టింది? ‘ఇది ప్రయోగశాలలో వ్యక్తిత్వాల పరిశీలన. ఒక రకంగా ఇది మనుషుల వ్యక్తిత్వాలపై అధ్యయనం. ఈ ప్రక్రియ గురించి సైకాలజీ పాఠాల్లో ఉంది. ఇలా వ్యక్తులపై ప్రయోగాలు చేసిన మనో వికాస శాస్త్రవేత్తలూ ఉన్నారు. ఆ ప్రయోగాల నుంచి వచ్చినదే బిగ్‌బాస్‌ షో’ అని ఓ ఫ్రొఫెసర్‌ వివరించారు. షోను రక్తికట్టించడం కోసం నిర్వాహకులు కాస్త మసాలా జోడించొచ్చుగానీ…పరిస్థితులను బట్టి మనుషుల వ్యక్తిత్వాలు, అనుబంధాలు ఎలా మారిపోతుంటాయో కళ్ల ముందు కనిపిచే షో ఇది. అందుకే బిగ్‌బాస్‌ షోను కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. అది నిరుపయోగమైన కార్యక్రమం కాదు. ఆసక్తిగా చూడగలిగితే…మానవ ప్రవర్తనను నిర్ధిష్టంగా అధ్యయనం చేయడానికి బాగానే ఉపయోగపడుతుంది.

బిగ్‌బాస్‌ తమిల్‌కు మొదటి, రెండు సీజన్లకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ఉన్నారు. ఆయన ఈ షో గురించి విశ్లేషించింది ఏమంటే… ‘ఇది చిల్లర కార్యక్రమం (సిల్లీ షో) కొందరు విమర్శిస్తున్నారుగానీ…వాస్తవంగా ఇది బయటవున్న జీవితానికి ఒక సెటైర్‌ వంటిది…ఒక నకలు వంటిది’ అని చెప్పారు. కమల్‌హాసన్‌ చెప్పినదాంట్లో వాస్తవముంది. ప్రేక్షకులు తమను తాను ఇంటి సభ్యులతో పోల్చుకుంటారు. ఎవరి వ్యక్తిత్వాలు ఎలావున్నాయో గమనిస్తారు. ఫలానా సందర్భంలో తామైతే ఎలా వ్యవహరిస్తామో అంచనా వేసుకుంటారు. ఇంటి సభ్యుల్లో కనిపించే వ్యక్తిత్వ లోపాలు తమలో ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించుకుంటారు. ఇంటి సభ్యుల్లో ఏదైనా నచ్చని గుణం కనిపిస్తే….అదే గుణం తనలో ఉంటే…ఆ ఇంటి సభ్యుడి గురించి తాను అనుకున్నట్లే…తన గురించి కూడా చుట్టుపక్కల వారు అనుకుంటారు కదా…ఆత్మ పరిశీలన చేసుకుని….సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌ షో వ్యక్తిత్వ వికాస పాఠం వంటిది.

ఇది ఎలిమినేషన్‌ పద్ధతిలో నిర్వహించే కార్యక్రమం. బిగ్‌బాస్‌ 15 – 20 మందినిలో ఒక ఇంటిలోకి పంపుతారు. అదే వాళ్ల ప్రపంచం. ఇక్కడ ఇంకెవరూ ఉండరు. టివి ఉండదు. గడియారం ఉండదు. పత్రికలు ఉండవు. పెన్ను ఉండదు. కాగితం ఉండదు. ఈ పరిస్థితుల్లో 75 రోజులు – 100 రోజులు గడపాలి. ఈ క్రమంలో టాస్క్‌ల పేరుతో వివిధ సందర్బాలను బిగ్‌బాస్‌ సృష్టిస్తారు. అప్పుడు సభ్యులు ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని పదుల సంఖ్యలో ఇంట్లో అమర్చిన కెమెరాలతో చిత్రీకరించి షోగా ప్రసారం చేస్తారు. ఇంట్లో ఎవరు ఉండకూడదో చెబుతూ ప్రేక్షకులు ఓట్లు వేయాలి. ఆ ఓట్ల ఆధారంగా వారంవారం ఒకొక్కరిని బయటకు పంపేస్తారు. చివరిదాకా నిలబడినవారే విజేత అవుతారు.

ఇక అసలు విషయానికొస్తే….బిగ్‌బాస్‌-1 తెలుగుకు ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ హోస్ట్‌గా (వ్యాఖ్యాతగా) వ్యవహరించారు. ఆయన అద్భుతంగా నిర్వహించారన్న పేరు సంపాదించుకున్నారు. అందుకే సీజన్‌-2పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తినెలకొంది. ఈ సీజన్‌ను నాని హోస్ట్‌ చేస్తున్నారు. మొత్తం 16 మంది సభ్యులను ఇంటిలోకి పంపారు. ఇందులో హేతువాది బాబు గోనినేని కూడా ఉన్నారు. సాధారణంగా సెలబ్రిటీలను మాత్రమే ఇంటిలోకి పంపుతారు. ఈసారి ముగ్గురు సామాన్యులనూ ఎంపిక చేసి లోనికి పంపించారు. ఇదో కొత్త ప్రయోగం. సామాన్యుల కేటగిరీ కింద వచ్చిన ముగ్గురిలో మొదటి రెండు వారాల్లోనే ఇద్దరు ఎలిమినేట్‌ అవడంతో బిగ్‌బాస్‌పై విమర్శలు మొదలయ్యాయి. అంత మాత్రాన సామాన్యులను లోనికి పంపడం ఎందుకంటూ ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. గణేష్‌ను ఎక్కువ కాలంలో హౌజ్‌లో ఉంచడం ద్వారా ఆ అపవాదును తప్పించుకున్నారు బిగ్‌బాస్‌. ఇక ఇప్పుడు చర్చంతా కౌశల్‌ గురించే.

కౌశల్‌ ఆర్మీ పేరుతో వందలాది మందిని సోషల్‌ మీడియా ద్వారా సమీకరించి…తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారన్నది షోపైన ఉన్న ప్రధానమైన విమర్శ. తనతో గొడవ పెట్టుకుంటే ఎవరైనా బయటకు వెళ్లిపోవాల్సిందే అని ఒకసారి కౌశల్‌ వ్యాఖ్యానించారు. దీనిపైన బాబు గోగినేని అతనితో గొడవపడ్డారు. కౌశల్‌ చెప్పినట్లే…అతనితో గొడవపడిన హౌజ్‌మేట్స్‌ బయటకు వెళ్లిపోయారు. బయటవున్న కౌశల్‌ ఆర్మీ….కౌశల్‌తో గొడవపడిన వారికి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఇందుకు కారణమని చెబుతున్నారు. కౌశల్‌ ఆర్మీ వేలాది మందితో హైదరాబాద్‌లో 2కె రన్‌ నిర్వహించిందంటే….ఇది ఎంతపెద్ద సైన్యమో అర్థం చేసుకోవచ్చు. కౌశల్‌కు అనుకూలంగా ప్రచారం చేయడానికి కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లతోనూ ఒప్పందాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటింగ్‌కు విలువేముందనేది ప్రశ్న.

కౌశల్‌ ఆర్మీతో మరో సమస్య కూడా ఉంది. హౌజ్‌లో ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే…ఈ ఆర్మీ సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతుంది. సంబంధిత ఇంటి సభ్యులపై బూతులు లంఖించుకుంటుంది. రాయలేని భాషలో తిడతారు. మిగతా ప్రేక్షకుకూ వారిపైన వ్యతిరేక భావన కల్పిస్తారు. ఈ ఆర్మీ హోస్ట్‌ నానిపైనా విమర్శిలు గుప్పించింది. తన స్నేహితుడైన తనిష్‌కు అనుకూలంగా పక్షపాతం చూపుతున్నారని దాడి చేసింది. బిగ్‌బాస్‌ కూడా కౌశల్‌ ఆర్మీకి జంకుతున్నారనేంతగా ఉంది పరిస్థితి. ఇలాగైతే భవిష్యత్తులో ఈ షోను ఎలా నిర్వహించగలరనేది ప్రశ్న. పలుకుబడి కలిగిన వారు వందలాది మందిని నియమించుకుని, ఓట్లు వేయించుకుంటే….ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌కు అర్థం ఉంటుందా? కౌశల్‌ ఆర్మీ గురించి బిగ్‌బాస్‌ హౌజ్‌లోనూ చర్చ జరుగుతోంది. గీత-దీప్తి ఇదే అంశంపై మాట్లాడుకున్నారు. దీన్ని నాని తప్పుబట్టారు. కౌశల్‌ ఆర్మీ గురించి మీకు ఎవరు చెప్పారు అంటూ నిలదీశారు. నూతన్‌ నాయుడు రెండోసారి ఇంట్లోకి వచ్చిన సందర్భంగా చెప్పారని గీత వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తాను…బిగ్‌బాస్‌ షోకి ఎంపికైన విషయం తెలుసుకుని…ఎవరో తనకు ఫోన్‌ చేశారని, హౌజ్‌లో ఉన్న సమయంలో బయట ఓటింగ్‌ వ్యవహారాలకు సంబంధించి తాము ఏర్పాట్లు చేస్తామంటూ బేరం పెట్టారని ఆమె వివరించారు. అంటే బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుల కోసం ఓట్లు సంపాదించే సంస్థలు పుట్టుకొచ్చాయనేకదా దానర్థం?

బిగ్‌బాస్‌ ఓటింగ్‌ విధానం కూడా రిగ్గింగ్‌ చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ వారం రెండు కోట్లు ఓట్లు వచ్చాయి, మూడు కోట్ల ఓట్లు వచ్చాయి అని హోస్ట్‌ చెబుతుంటారు. ఇది వాస్తవం కాదు. అంతమంది ఓట్లు వేసే అవకాశమే లేదు. ఒక్కో వ్యక్తి రోజుకు 50 ఓట్లు వేయొచ్చు. వారమంతా వేయొచ్చు. అంటే ఒక వ్యక్తి రోజుకు 350 ఓట్లు వేయొచ్చన్నమాట. ఇక ఎన్ని సెల్‌ఫోన్లు ఉంటే అన్ని 350 ఓట్లు వేయొచ్చు. మిస్ట్‌ కాల్‌ పద్దతిలో వేసి, గూగుల్‌లోని వెబ్‌సైట్‌ ద్వారానూ వేయొచ్చు. ఈ పద్ధతే కౌశల్‌ ఆర్మీ వంటివాళ్లు రిగ్గింగ్‌ చేయడానికి ఉపయోగపడుతోంది. దీన్ని సవరించకుండా భవిష్యత్తులో ఓటింగ్‌ అంటే అర్థముండదు. టివి చూసే ప్రేక్షకులంతా ఓట్లు వేస్తారన్న గ్యారెంటీ లేదు. వందలతో 10 మందయినా ఓట్లు వేస్తారా అనేది అనుమానమే. ఓట్లు వేసేవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో రిగ్గింగ్‌ చేసేవాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది.

ఈవారం ఎవరు ఎలినిమేట్‌ అయ్యారు అనే వివరాలు ఎపిషోడ్‌ ప్రసారం కాకముందే సోషల్‌ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఇదీ ఒక బిగ్‌బాస్‌ బలహీనతగా కనిపిస్తోంది. ముందురోజు జరిగింది తరువాతి రోజు చూపిస్తుంటారు. అలాగే ఆదివారం ఎనిమినేషన్‌ ఎపిషోడ్‌ ఉంటే…శనివారమే చిత్రీకరిస్తారు. దీంతో ఎవరు ఎలిమినేట్‌ అయిందీ బయటకు పొక్కుతోంది. మొదటి సీజన్‌కు లూనావాలాలో హౌజ్‌ నిర్మిస్తే…ఈ సీజన్‌కు హైదరాబాద్‌లోని ఓ సినీ స్టూడియోలో నిర్మించారు. అక్కడ వందలాది మంది పని చేస్తుంటారు. దీంతో వివరాలు ముందే లీక్‌ అవుతున్నాయి. అసలు ఏ ఇంటి సభ్యునికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలూ బయటకు వస్తున్నాయట.

బిగ్‌బాస్‌ షోలో అక్రమాలూ జరుగుతున్నాయన్న అనుమానాలున్నాయి. ఆ ఓట్లు ప్రకారమైతే… కౌశల్‌ మొదటి మూడు నాలుగు వారాల్లోనే వెళ్లిపోవాల్సిందట. షోలో ఎవరు గెలవాలో కూడా ముందే నిర్ణయిస్తారన్న విమర్శలూ ఉన్నాయి. ఎవరిని ఎలిమినేట్‌ చేయాలనుకుంటే…వారికి వ్యతిరేకంగా ఉండే దృశ్యాలను ప్రసారం చేయడం, ఎవరిని కాపాడాలనుకుంటే వారికి అనుకూలంగా ఉండే సన్నివేశాలను చూపించడం ఈ షోలో ఒక జిమ్మిక్కు అనే విమర్శలూ ఉన్నాయి.

దీని మూలసుత్రం ప్రకారం ఇది మనుషుల ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని పరిశీలించే కార్యక్రమం అయినప్పటికీ…భౌతికపరమైన టాస్క్‌లు ఎక్కువగా ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ టాస్క్‌లలో బిగ్‌బాస్‌ మానవహక్కులను కాలరాస్తున్నారన్న ఆగ్రహమూ వ్యక్తమవుతోంది. కార్లో 24 గంటలూ కూర్చోవాలని చెప్పడం, కాలకృత్యాలు తీర్చకోడానికీ అవకాశం లేకుండా చేయడం ఇందుకు ఒక ఉదాహరణ. ఇలాంటి పద్ధతులపై మొదట్లోనే బాబు గోగినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిగ్‌బాస్‌ నువ్వు కిందకు రారా…నీ కథేమిటో చూస్తాను’ అన్నారు. కొందరు బిగ్‌బాస్‌పై కోర్టు కేసులు కూడా వేసినట్లున్నారు. ఆడామగా తేడాలేకుండా ఫిజికల్‌ టాస్క్‌లు ఇవ్వడం, నిబంధనలు అస్పష్టంగా పెట్టడం, ఇంటి సభ్యులు ఘర్షణపడుతుంటే వినోదం పంచడం ఇదే షోకు మూలంగా మారిపోయింది. వ్యక్తిత్వాల పరిశీలన పక్కకుపోయింది. ఇది కచ్చితంగా షోను నిర్వహిస్తున్నవారి వైఫల్యమే.

ఈ షోపై ఉన్న మరో ప్రధానమైన విమర్శ ఏమంటే…అసభ్యత. పొట్టి గౌన్లు వేసుకోవడం, ఆడామగా తేడా లేకుండా ఆలింగనం చేసుకోవడమే పనిగా పెట్టుకోవడం…సాధారణ ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. సినిమా వేరు…రియాలిటీ షో వేరు. సినిమాల్లో ఆలింగనం చేసుకోడానికి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మన కళ్లముందు ఒక ఇంట్లో జరుగుతున్న వ్యవవహారంగా ఉంటుంది. అక్కడ కౌగిలింతలను ప్రేక్షకులు ఆమోదించలేరు. రేటింగ్స్‌ కోసమో, మసాలా కోసమో ఇటువంటి దృశ్యాలను ఎక్కువ ప్రసారం చేస్తున్నారు బిగ్‌బాస్‌. బూతులు తిట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. రోల్‌రైడాను కౌశల్‌ ఏదో బూతు అన్నారు. దాన్ని ఎడిట్‌ చేసి ప్రసారం చేశారు. దీనిపైన కౌశల్‌కు నాని క్లాస్‌ పీకారు కూడా.

బిగ్‌బాస్‌ షోకు వెళ్లిన వారు సామాన్యులైనా సెలబ్రిటీలుగా మారిపోతారనేది ఎంత వాస్తవమో…కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలూ పలచనైపోతారన్నదీ అంతేవాస్తవం. సినీనటులను తెరపై చూడటం తప్ప వాళ్ల వ్కక్తిత్వాన్ని చూసే అవకాశం ఉండదు. కానీ ఈ షోలో మూడు నెలలకుపైగా చూడటం వల్ల వాళ్ల వ్యక్తిత్వాలు ఇట్టే తెలిసిపోతాయి. ఇది కొందరికి నష్టం తెస్తుంది కూడా. అదీ సోషల్‌ మీడియా విస్తృతమైన నేపథ్యంలో సభ్యులు బయటకు వచ్చిన తరువాత చూసుకుంటే…తమ గురించి ప్రేక్షకులు ఏమన్నారో తెలిసిపోతుంది. ఇవన్నీ చూశాక బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎందుకెళ్లామా అనే బాధపడేవాళ్లూ ఉండొచ్చు.

మిగతా భాషల్లో షో ఎలానడుస్తోందోగానీ…తెలుగులో రెండో సీజన్‌కే బిగ్‌బాస్‌కు సవాళ్లు తెచ్చిపెట్టింది. వీటిని అధిగమించకుంటే షో ప్రాభవం, ప్రజాదారణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఓటింగ్‌ను ఎవరైనా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనే భావన కలిగినపుడు…ప్రేక్షకులు షోపైన ఆసక్తిచూపే అవకాశం ఉండదు. అన్నింటికన్నా…షో మూలసూత్రాలను నిర్వాహకులు మరచిపోకూడదు. ఇది మనుషుల వ్యక్తిత్వాల పరిశీలనకు సంబంధించిన కార్యక్రమం అనేది విస్మరించకూడదు. ఈ షో ద్వారా వినోదమే కాదు వ్యక్తిత్వ వికాస పాఠాలు ఎంతోకొంత నేర్చుకునేలా ఉండాలి.

– ఆదిమూలం శేఖర్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*